DailyDose

బెజవాడ సైకో భర్తకు ఉరిశిక్ష-నేరవార్తలు

బెజవాడ సైకో భర్తకు ఉరిశిక్ష-నేరవార్తలు

* కృష్ణాజిల్లా కోడూరు మండలం లింగాయపాలెంకు చెందిన ముక్కు మోహనరావుకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు. పెద్ద కుమార్తె శైలజ.. తన ఇద్దరు చెల్లెళ్లు పద్మజ, జ్యోతి, తమ్ముడు అరవింద్‌ కుమార్‌తో కలిసి కొన్నేళ్ల కిందట లబ్బీపేటలోని ఫకీర్‌గూడెం పిడికిటి రామకోటయ్య వీధిలోని ఒక ఇంట్లో అద్దెకు దిగారు. అందరూ ప్రైవేటు ఉద్యోగాలు చేసుకుంటూ జీవనాన్ని సాగిస్తున్నారు. బీఎస్సీ బీఈడీ చదివిన శైలజ(30) టిక్కిల్‌రోడ్‌లోని ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేసేవారు. ఆమెకు కృష్ణాజిల్లా జొన్నపాడు నివాసి, గుడివాడలో ప్రైవేటు కళాశాలలో సహాయ అధ్యాపకుడిగా పనిచేస్తున్న బత్తుల నంబియార్‌(35) అలియాస్‌ సుజిత్‌తో వివాహమైంది. పెళ్లయిన కొద్ది రోజులకే అతడు ఉద్యోగాన్ని మానేసి, విజయవాడ ఫకీర్‌గూడెంలోని భార్య వద్దే ఉండేవాడు. ఆమె సంపాదనపైనే ఆధారపడి జీవించేవాడు. ఈ నేపథ్యంలో భార్యకు వేరొకరితో వివాహేతర సంబంధం ఉందనే అనుమానం అతనిలో మొదలైంది. ఇవే విషయాలను పలు సందర్భాల్లో మరదళ్లు, అత్త వద్ద ప్రస్తావించినప్పటికీ వారు పట్టించుకోలేదు. దీనికి తోడు ఇటీవల శైలజ తన ఇద్దరు చెల్లెళ్లకు, తమ్ముడికి వివాహాలు జరిపించడంతో నంబియార్‌లో అసూయ రేగింది. గర్భిణి అయిన ఆమెను అంతం చేయాలనే నిర్ణయానికి వచ్చి ఇంట్లో తాను, భార్య తప్ప ఇతరులు లేని సమయం చూసి, తెల్లవారుజామున నిద్రలో ఉన్న శైలజ ఒంటిపై పెట్రోలు పోసి నిప్పంటించాడు. ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆమెను ఇరుగుపొరుగు వారు ప్రభుత్వాసుపత్రికి తరలించగా, చికిత్సపొందుతూ కొద్దిసేపటికే ఆమె మరణించింది. కేసు నమోదు చేసిన పోలీసులు నంబియార్‌ను కోర్టులో హాజరు పరిచారు. విచారణ అనంతరం నంబియారే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు నిర్ధారణ కావడంతో అతడికి న్యాయస్థానం ఉరిశిక్ష విధించింది.

* న్యాయం చేయాలని కోరుతూ జబర్దస్త్‌ వినోద్‌ ఈస్ట్‌ జోన్‌ డీసీపీ రమేష్‌రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. ‘‘ప్రస్తుతం నివాసం ఉంటున్న అద్దె ఇంటిని విక్రయిస్తామని యజమాని రూ.40లక్షలకు అగ్రిమెంట్‌ చేసుకున్నారు. ఏడాది క్రితం రూ.13.40లక్షలు అడ్వాన్సు కూడా తీసుకున్నారు. ఇప్పుడేమో రూ.40లక్షల కంటే ఎక్కువ ఇస్తేనే ఇల్లు అమ్ముతానని, లేని పక్షంలో అడ్వాన్సుగా ఇచ్చిన రూ.13.40లక్షలు కూడా తిరిగి ఇవ్వమని బెదిరిస్తున్నారు. గతంలో భౌతిక దాడి చేశారు. దాడి ఘటనపై అప్పట్లో కాచిగూడ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. నాకు న్యాయం చేయండి’’ అని డీసీపీకి అందజేసిన వినతిపత్రంలో వినోద్‌ పేర్కొన్నారు.

* కరోనా వైరస్‌ రెండో దశ ఉద్ధృతిని అరికట్టేందుకు మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం సీరియస్‌గా వ్యవహరిస్తోంది. నివారణ చర్యలు పాటించే విషయంలో కఠిన చర్యలు తీసుకుంటోంది. తాజాగా ఇండోర్‌ నగరంలో మాస్కులు ధరించని కారణంగా పోలీసులు 258 మందిని తాత్కాలిక జైలుకు పంపించారు.

* తెలంగాణలోని భూపాలపల్లి పరిధి కేటీకే ఆరో గనిలో ప్రమాదం చోటుచేసుకుంది. పైకప్పు కూలడంతో ఇద్దరు సింగరేణి కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. మూడో సిమ్ 11వ లెవల్లో కార్మికులు శంకరయ్య, నరసయ్య సపోర్ట్‌మెన్‌గా పనిచేస్తున్నారు. ఈక్రమంలో పైకప్పు ఒక్కసారిగా కూలడంతో వారిద్దరూ మృతిచెందినట్లు సింగరేణి అధికారులు తెలిపారు. రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

* ఏపీ-తెలంగాణ రాష్ట్ర సరిహద్దులో కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం గరికపాడు చెక్‌పోస్టు వద్ద ఈరోజు ఉదయం పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా భారీగా నగదు పట్టుబడింది. కారులో తరలిస్తున్న కోటి నలభైలక్షల రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నగదుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై సెక్షన్‌ 102 కింద కేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నట్టు చిల్లకల్లు ఎస్‌ఐ వాసా వెంకటేశ్వరరావు తెలిపారు.

* తనకు పుట్టలేదన్న అనుమానంతో ఎనిమిది మాసాల కుమారుడిని ఓ తండ్రి సంప్‌లో పడేసి చంపేశాడు. హృదయ విదారక సంఘటన శంషాబాద్‌ పరిధి తొండుపల్లిలో బుధవారం చోటు చేసుకుంది. శంషాబాద్‌ పోలీసు కథనం ప్రకారం.. తొండుపల్లికి చెందిన గంధం విక్రమ్‌కుమార్‌కు, శంషాబాద్‌కు చెందిన యువతితో ఆరేళ్ల క్రితం పెళ్లయింది. అతడొక క్షౌరశాలలో పని చేస్తున్నాడు. భార్యపై అనుమానంతో తరచూ గొడవ పడుతుండేవాడు. మూడేళ్ల క్రితం గొడవ పెద్దలు, పోలీసు పంచాయితీ వరకు వెళ్లింది. ఎనిమిది మాసాల క్రితం వారికి ఓ బాబు జన్మించాడు. పెళ్లైన ఆరేళ్ల తర్వాత పుట్టిన ఒక్కగానొక్క కుమారుడు తన సంతానం కాదేమో అని విక్రమ్‌ అనుమానం పెంచుకున్నాడు. మంగళవారం రాత్రి భార్య పక్కలో నిద్రిస్తున్న పసికందును తీసుకువెళ్లి నీటి సంపులో పడేసి బయటకు వెళ్లిపోయాడు. అక్కడొక స్నేహితుడు కనిపించడంతో అతడితో ఈ విషయం చెప్పాడు. ఆ మిత్రుడు వెంటనే ఇంటికొచ్చి అప్రమత్తం చేయడంతో కుటుంబసభ్యులు సంపులో చూడగా అప్పటికే బాలుడు మృతిచెందాడు.

* వైకాపాకు వ్యతిరేకంగా పనిచేసినందుకు తమ కుటుంబంపై ఆ పార్టీ వర్గీయులు దాడి చేశారని పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన బాధితులు వాపోయారు. ఈ దాడిలో ఆరుగురు గాయపడ్డారు. బాధితుల కథనం మేరకు.. ఉంగుటూరు మండలం కాకర్లమూడికి చెందిన దారం వెంకటేశ్వరరావు ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. పంచాయతీ ఎన్నికల్లో అతని ఆటోను తెదేపా మద్దతుదారుల ప్రచారం కోసం పెట్టారు. మంగళవారం రాత్రి గ్రామంలో మహంకాళమ్మ ఉత్సవాలు జరుగుతుండగా సుమారు 15 మంది కలిసి వెంకటేశ్వరరావు కుటుంబంపై కర్రలతో దాడిచేశారు. ఈ దాడిలో వెంకటేశ్వరరావు, అతని కుమార్తె మార్తారత్నంతోపాటు ఆపడానికి ప్రయత్నించిన వారి బంధువులు మద్దాల పండు, దారం మరియమ్మ, మద్దాల మహంకాళి, దారం కాంతారత్నంలపై కూడా దాడికి పాల్పడ్డారు. బాధితులు తాడేపల్లిగూడెం ప్రాంతీయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దీనిపై చేబ్రోలు ఎస్సై వీర్రాజు మాట్లాడుతూ అది మద్యం మత్తులో జరిగిన గొడవని, దీనికి రాజకీయ కక్షలు కారణం కాదన్నారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.

*చిత్తూరు జిల్లా కుప్పం మండలంలోని గోనుగూరు పేటగుట్టపై నెలకొన్న శ్రీవళ్లీదేవసేన సమేత శ్రీసుబ్రహ్మణ్యస్వామి ఆలయంలోని దేవతా విగ్రహాల ధ్వంసం కేసును 24 గంటల్లోపు ఛేదించినట్లు ఎస్పీ సెంథిల్‌ కుమార్‌ తెలిపారు. కుప్పం గ్రామీణ సర్కిల్‌ కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘మంగళవారం సుబ్రహ్మణ్యస్వామి ఆలయానికి వెళ్లిన పూజారికి విగ్రహాలు కనిపించలేదు. పరిసరాలను పరిశీలించగా సమీపంలోని గుట్టలో విగ్రహాలు ధ్వంసమై పడి ఉండటాన్ని గమనించారు. పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేశాం. గ్రామంలోని ఓ మతిస్థిమితం లేని మహిళ మద్యం తాగి ఆలయంలో నిద్రిస్తుండేది. ఆమే ఈ విగ్రహాలను ధ్వంసం చేసినట్లు తేలింది. ధ్వంసం చేసినట్లు ఆమె కూడా అంగీకరించింది’ అని వివరించారు. కేసు విచారణ చేయకముందే ఇందులో కుట్రకోణం ఉందని ప్రతిపక్షాలు అనడం, సీబీఐతో కేసు విచారించాలని డిమాండ్‌ చేయడాన్ని ఖండించారు.