Politics

గెలిపించవల్సిందిగా జగన్ లేఖలు-తాజావార్తలు

గెలిపించవల్సిందిగా జగన్ లేఖలు-తాజావార్తలు

* ఉప ఎన్నిక నేపథ్యంలో తిరుపతి లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని కుటుంబాలకు వైకాపా అధినేత, సీఎం జగన్‌ లేఖలు రాశారు. 22 నెలల పాలనా కాలంలో వైకాపా ప్రభుత్వం చేపట్టిన వివిధ పథకాలు, ప్రభుత్వ కార్యక్రమాల ద్వారా ఆయా కుటుంబాలకు జరిగిన మేలును ఈ లేఖలో వివరించారు. క్యాంపు కార్యాలయంలో తొలి లేఖపై జగన్‌ సంతకం చేశారు. వైఎస్సార్‌ సున్నా వడ్డీ, వైఎస్సార్‌ ఆసరా, జగనన్న వసతి దీవెన, జగనన్న విద్యాదీవెన, వైఎస్సార్‌ చేయూత, వైఎస్సార్‌ పింఛన్‌ కానుక, జగనన్న అమ్మ ఒడి, పేదలందరికీ ఇళ్లు తదితర పథకాల ద్వారా ఆయా కుటుంబాలకు జరిగిన లబ్ధిని ఈ లేఖల్లో పేర్కొన్నారు. రాష్ట్రంలో వైద్యం, విద్య, వ్యవసాయ రంగాలతో పాటు రైతులు, సామాజిక న్యాయం, పారదర్శక పాలన, అభివృద్ధి పనులు తదితర అంశాలను జగన్‌ ఈ లేఖల్లో ప్రస్తావించారు. తిరుపతి ఉప ఎన్నికలో ఫ్యాన్‌ గుర్తుపై ఓటువేసి వైకాపా అభ్యర్థిగా పోటీచేస్తున్న డాక్టర్‌ గురుమూర్తిని గెలిపించాలని ఆయా కుటుంబాలను సీఎం అభ్యర్థించారు. ఈ లేఖలను ఓటర్లకు వైకాపా నేతలు అందజేయనున్నారు. లేఖల్లో ప్రతిపక్ష పార్టీల మీద ఎలాంటి విమర్శలు చేయకుండా.. తమ 22 నెలల పరిపాలనలో అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను, ప్రభుత్వ దార్శనికత, నిలబెట్టుకున్న వాగ్దానాలు.. దానికి సంబంధించిన విధానాన్నే ప్రజలకు తెలియజేస్తున్నట్లు వైకాపా వర్గాలు తెలిపాయి.

* దేశంలో కొవిడ్​ కేసులు ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయి. కొత్తగా 1,26,789 మంది మహమ్మారి బారినపడ్డారు. మరో 685 మందిని కొవిడ్​ బలి తీసుకుంది.మొత్తం కేసులు: 1,29,28,574మొత్తం మరణాలు: 1,66,862కోలుకున్న వారు: 1,18,51,393యాక్టివ్​ కేసులు: 9,10,319కరోనా సోకిన వారిలో కొత్తగా 59,258 మంది కోలుకున్నారు.దేశవ్యాప్త రికవరీ రేటు 91.67 శాతానికి చేరగా.. మరణాల రేటు 1.29 శాతంగా నమోదైనట్టు కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.దేశవ్యాప్తంగా బుధవారం ఒక్కరోజే 12లక్షల 37వేల నమూనాలను పరీక్షించినట్టు భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్​) తెలిపింది.దీంతో మొత్తం టెస్ట్​ల సంఖ్య 25 కోట్ల 26 లక్షలు దాటింది.తాజాగా 29 లక్షల మందికిపైగా వ్యాక్సిన్​ పంపిణీ చేసినట్టు ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇప్పటివరకు టీకా పొందిన లబ్ధిదారుల సంఖ్య 9.01 కోట్లకు చేరింది.

* కరోనా కేసులు పెరుగుతున్నందున మళ్లీ లాక్​డౌన్​ విధిస్తారనే భయాలు వలస కార్మికుల్లో నెలకొన్నాయి.ముందుజాగ్రత్త చర్యగా వారు పట్టణాలను వీడి సొంతూళ్లకు పయనమవుతున్నారు.ఇలా దేశంలోని పలు రాష్ట్రాల నుంచి బిహార్‌కు తరలివస్తున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.దీంతో తూర్పు మధ్య రైల్వే వారి కోసం ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తోంది.

* ఏవోబీ సరిహద్దులోని 7 గ్రామాల్లో పోలింగ్ ప్రారంభం కాలేదు.పట్టుచెన్నూరు, పగలుచెన్నూరు, గంజాయిభద్రలో పోలింగ్‌ ఇంకా ప్రారంభించలేదు.ఓటర్లు బయటకు రాకుండా ఒడిశా భద్రతా బలగాలు అడ్డుకుంటున్నాయి.కొవిడ్ సాకు చూపించి కొఠియా గ్రామాల్లో ఆంక్షలు విధించింది ఒడిశా ప్రభుత్వం.కరోనా దృష్ట్యా చర్యలు చేపడుతున్నట్టు లేఖ విడుదల చేసింది.గంజాయిభద్ర నుంచి వచ్చే దారులను మూసేసి పోలీసులతో పహారా చేపట్టింది.ఏపీ అధికారులు, ప్రజాప్రతినిధులు స్టేటస్ కోను ఉల్లంఘిస్తున్నారని అంటున్నారు.

* పశ్చిమగోదావరి జిల్లా నుంచి తమిళనాడు ఎన్నికల విధులకు వెళ్లిన పోలీసు సిబ్బందిలో 10మందికి కరోనా సోకింది.50 మంది పోలీసులు అంతా ఒకే బస్సులో ప్రయాణం చేశారు. వారిలో 6గురికి కరోనా పాజిటివ్ వచ్చింది.దీంతో మిగిలిన సిబ్బంది ఎన్నికల విధులకు హాజరవుతున్నారు.అలాగే పోలవరంలో ఎన్నికల విధులు నిర్వహిస్తున్నఓ కానిస్టేబుల్‌కు కరోనా పాజిటివ్ వచ్చింది.ఇటీవల తమిళనాడు ఎన్నికలకు 367 మంది పోలీసులు వెళ్ళారు.

* రేపటి నుండి సాయంత్రం ఐదు గంటలకే బేగం బజార్ మార్కెట్ మూసివేత.కరోనా కేసులు రోజు రోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో నిర్ణయం తీసుకున్న బేగం బజార్ మార్కెట్ కమిటీ.

* జిల్లాలోని సినిమా ధియేటర్ లలో కొత్త చిత్రాల విడుదల సందర్భంగా ప్రీమియర్ షో,రెగ్యులర్ షో లకు సినిమా టికెట్లు పెంచడానికి ఎలాంటి అనుమతులు జారీ చేయలేదని జాయింట్ కలెక్టర్ డాక్టర్ కె.మాధవి లత ఒక ప్రకటనలో తెలిపారు.

* ‘వకీల్‌సాబ్‌’ కోసం అందరిలాగే తాను కూడా ఎదురుచూస్తున్నానని మెగాస్టార్‌ చిరంజీవి అన్నారు. పవన్‌కల్యాణ్‌ ప్రధానపాత్ర పోషించిన ఈ చిత్రం ఏప్రిల్‌ 9న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో పవన్ను‌ ఉద్దేశిస్తూ ఒక ట్వీట్‌ చేశారు. ఆ ట్వీట్‌లో చిరు తన తమ్ముడు పవన్‌కల్యాణ్‌కు జుట్టు సరిచేస్తున్న పాత ఫొటో కూడా పంచుకున్నారు. ‘చాలాకాలం తర్వాత పవన్‌కల్యాణ్‌ను వెండితెర మీద చూడటానికి మీలాగే నేను కూడా ఎదురుచూస్తున్నాను. అమ్మ, కుటుంబసభ్యులతో రేపు సాయంత్రం థియేటర్‌లో వకీల్‌సాబ్‌ చూడనున్నాం. సినిమా చూసిన తర్వాత నా స్పందన మీతో పంచుకోవాలని ఎంతో ఆత్రుతగా ఉన్నాను’ అని ఆయన ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు.

* ఏపీలో కరోనా కోరలు చాస్తోంది. కేసులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. తాజా వివరాల ప్రకారం ఒక్కరోజు వ్యవధిలో 31,268 నమూనాలను పరీక్షించగా 2,558 మందికి కొవిడ్‌ నిర్ధారణ అయింది. అత్యధికంగా గుంటూరు జిల్లాలో 465, అత్యల్పంగా పశ్చిమగోదావరి జిల్లాలో 37 కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్‌లో వెల్లడించింది. తాజా సంఖ్యతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 9,15,832కి చేరింది.

* క‌లియుగ ప్ర‌త్య‌క్ష దైవ‌ం శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామి వారు కొలువైన తిరుమ‌ల క్షేత్రం ఇకపై హ‌నుమంతుని జ‌న్మ‌స్థానంగానూ గుర్తింపు పొంద‌నుంది. ఏప్రిల్ 13న తెలుగు సంవ‌త్స‌రాది ఉగాది రోజున ఈ విష‌యాన్ని పురాణాలు, శాస‌నాలు, శాస్త్రీయ‌ ఆధారాల‌తో స‌హా నిరూపించేందుకు ‌తితిదే సిద్ధమైంది. తిరుప‌తిలోని తితిదే ప‌రిపాల‌నా భ‌వ‌నంలో ఈవో డాక్ట‌ర్ కేఎస్‌ జవహర్‌ రెడ్డి గురువారం ఈ విష‌యంపై నిపుణుల కమిటీ స‌భ్యుల‌తో సుదీర్ఘంగా స‌మీక్షించారు. ఈ సంద‌ర్భంగా ఈవో మాట్లాడుతూ.. క‌మిటీలోని పండితులు జ్యోతిష శాస్త్రం, శాస‌నాలు, పురాణాలు, శాస్త్రీయ ఆధారాల‌తో ఉగాది రోజున ఈ విషయాన్ని ప్ర‌జ‌ల‌కు తెలియ‌జేస్తారన్నారు.

* అంబానీకి బెదిరింపులు- మన్‌సుఖ్‌ హిరేన్‌ హత్య కేసు చినికి చినికి గాలివానగా మారుతోంది. జాతీయ దర్యాప్తు సంస్థ కేసును విచారించే కొద్దీ దిగ్ర్భాంతి గొలిపే విషయాలు బయటకు వస్తున్నాయి. ఇవి మహారాష్ట్ర పోలీసుశాఖకు అప్రతిష్ఠ తేవడంతో పాటు, రాజకీయంగా కూడా సర్కారును ఇబ్బంది పెడుతున్నాయి. ఈ కేసు కారణంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ వరకూ తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు తాజాగా ఈ కేసులో ప్రధాన నిందితుడు సచిన్‌ వాజే న్యాయస్థానానికి ఓ లేఖ ఇవ్వబోవడం.. ఆ లేఖలో మరికొందరు రాజకీయ ప్రముఖుల పేర్లను కీలకంగా ప్రస్తావించడంతో ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది.

* టీమ్‌ ఇండియా బౌలింగ్‌ కోచ్‌ భరత్‌ అరుణ్‌ తనను సొంత కొడుకులా చూసుకుంటాడని ఆర్సీబీ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ అన్నాడు. బెంగళూరు టీమ్ గురువారం విడుదల చేసిన ఓ వీడియోలో మాట్లాడిన సిరాజ్‌ తన కెరీర్‌ గురించి అనేక అంశాలు పంచుకున్నాడు. టీమ్‌ ఇండియా తరఫున అత్యధిక వికెట్లు తీయడమే తన కోరికని చెప్పాడు. ‘టీమ్‌ ఇండియాకు నేను బౌలింగ్‌ చేసినప్పుడల్లా జస్ప్రీత్‌ బుమ్రా నా పక్కనే ఉండేవాడు. ప్రాథమిక అంశాలకు లోబడి బౌలింగ్‌ చేయమని, అనవసర విషయాలపై దృష్టి పెట్టొద్దని చెప్పాడు.

* ఏపీలో పరిషత్‌ ఎన్నికల పోలింగ్‌ చెదురుమదురు ఘటనల మినహా ప్రశాంతంగా ముగిసింది. 7,220 ఎంపీటీసీ, 515 జడ్పీటీసీ స్థానాలకు ఈ ఉదయం 7 గంటల నుంచి పోలింగ్‌ ప్రారంభమైంది. మొత్తం 7,735 స్థానాలకు 20,840 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. సాయంత్రం 5 గంటల వరకు క్యూలైన్లలో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మధ్యాహ్నం 3 గంటల వరకు 47.42 శాతం పోలింగ్‌ నమోదైంది.