Business

ఆలీబాబా ఇదేందబ్బా?-వాణిజ్యం

Business News - Alibaba Jack Ma Fined Hefty By Chinese Government

* కరోనా వైరస్‌ ఇన్ఫెక్షన్లు రెండో విడత భారీగా పెరిగిపోతుండడం భారత ఆర్థిక వ్యవస్థ రికవరీపై ప్రభావం చూపిస్తుందని.. బ్యాంకులకు సమస్యలు తెచ్చి పెడుతుందని ఫిచ్‌ రేటింగ్స్‌ సంస్థ అంచనా వేసింది. 2021లో భారత బ్యాంకింగ్‌ రంగానికి మోస్తరు ప్రతికూల వాతావరణం ఉంటుందని పేర్కొంది. కరోనా ఇన్ఫెక్షన్‌ కేసులు పెరుగుతూ పోతే.. నియంత్రణ కోసం చేపట్టే మరిన్ని చర్యలు వ్యాపారాలు, ఆర్థిక కార్యకలాపాలపై మరింత ప్రభావం పడేలా దారితీస్తుందని.. అప్పుడు సమస్యలు తీవ్రమవుతాయని శుక్రవారం విడుదల చేసిన నివేదికలో ప్రస్తావించింది. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి కరోనా కేసులు భారీగా పెరుగుతుండడం చూస్తూనే ఉన్నాం. ‘‘ప్రభుత్వం అనుసరిస్తున్న మరింత సర్దుబాటు ద్రవ్య విధానం స్వల్ప కాలంలో వృద్ధిపై ఒత్తిళ్లను అధిగమించేలా చేయవచ్చు. అయితే, ఆర్థిక వ్యవస్థకు విఘాతం కలగకుండా ఉండడం అన్నది టీకాలు వేసే కార్యక్రమాన్ని వేగవంతం, సమర్థవంతంగా అమలు చేయడంపైనే ఆధారపడి ఉంటుంది’’అని ఫిచ్‌ రేటింగ్స్‌ తెలిపింది. 2021-22 సంవత్సరంలో భారత జీడీపీ 12.8 శాతం వృద్ధి రేటు నమోదు చేస్తుందని ఫిచ్‌ లోగడ అంచనా వేసిన విషయం గమనార్హం. అయితే పెరుగుతున్న కరోనా కేసులతో ఈ అంచనాలకు రిస్క్‌ ఉందని సంస్థ పేర్కొంది. ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో వృద్ధి మందగించొచ్చని పేర్కొంది.

* పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లయింది ఇప్పుడు అలీబాబా గ్రూప్‌ పరిస్థితి. ఈ సంస్థ వ్యవస్థాపకుడు, అపరకుబేరుడు జాక్‌ మా ఏ ముహూర్తాన నోరుజారారో గానీ.. అప్పటి నుంచి ఆయనను, కంపెనీని కష్టాలు చుట్టుముట్టాయి. ఆయనపై ప్రతీకార చర్యలు ఆరంభించిన డ్రాగన్‌ సర్కారు.. తొలుత యాంట్‌గ్రూప్‌ ఐపీవోను అడ్డుకుంది. ఆ తర్వాత బ్యాంకింగ్ రెగ్యులేషన్‌ నిబంధనలు నెత్తిన రుద్దింది. ఫలితంగా స్టాక్ మార్కెట్లో కంపెనీ విలువ అమాంతం పడిపోయింది. అటు జాక్‌మా కుబేరుల అగ్రస్థానాన్నీ కోల్పోవాల్సి రావడమేగాక, బాహ్య ప్రపంచానికి కన్పించలేని పరిస్థితి తలెత్తింది. ఇప్పుడు ఏకంగా నియంత్రణ పేరుతో జరిమానా రూపంలో అలీబాబాపై భారీ భారాన్నే మోపింది చైనా. గుత్తాధిపత్యం కోసం నిబంధనలను ఉల్లంఘించిందంటూ ఈ ప్రపంచ దిగ్గజ ఇ-కామర్స్‌ సంస్థపై ఏకంగా 2.8 బిలియన్‌ డాలర్ల జరిమానా విధించింది.

* లోధా డెవ‌ల‌ప‌ర్స్ ఐపీఓ బిడ్డింగ్ చివ‌రి రోజున 103% ఓవ‌ర్ స‌బ్‌క్సైబ్ అయ్యింది.గృహాల నిర్మాణంపై ఎక్కువ‌గా దృష్టి సారించిన లోధా గ్రూప్ గ‌త సంవ‌త్స‌రంలో త‌న వాణిజ్య కార్యాల‌య (క‌మ‌ర్షియ‌ల్ స్పేస్‌) వ్యాపారాన్ని పెంచుకుంది.డిసెంబ‌ర్ 31తో ముగిసిన త్రైమాసికంలో భార‌త‌దేశ‌పు అతిపెద్ద రియ‌ల్ ఎస్టేట్ డెవ‌ల‌ప‌ర్ లోధా గ్రూప్ రూ. 2,500 కోట్ల విలువైన బుకింగ్‌ల‌ను న‌మోదు చేసింది. ల‌గ్జ‌రీ, ప్రీమియం గృహాల‌కు డిమాండ్ పెరిగింది. ఈ విభాగంలో సుమారు రూ. 1000 కోట్ల బుకింగ్‌లు ల‌భించాయి.లోధా డెవ‌ల‌ప‌ర్స్ అని పిలువ‌బ‌డే మాక్రోటెక్ డెవ‌ల‌ప‌ర్స్ లిమిటెడ్ యొక్క ప్రారంభ ప‌బ్లిక్ ఆఫ‌రింగ్ (ఐపీఓ) శుక్ర‌వారం నాటికి బిడ్డింగ్ చివ‌రి రోజుకి 103% ఓవ‌ర్ స‌బ్‌క్సైబ్ అయ్యింది.అర్హ‌త‌గ‌ల సంస్థాగ‌త కొనుగోలుదారులు మ‌రియు సంస్థేత‌ర పెట్టుబ‌డిదారుల నేతృత్వంలో ఐపీఓకు బ‌ల‌మైన స్పంద‌న వ‌చ్చింది.రిటైల్ విభాగంలో 34% స‌బ్స్‌క్సైబ్‌తో మంచి స్పంద‌న‌ను చూసింది.

* ద‌క్షిణ కొరియాకు చెందిన ప్ర‌ముఖ కార్ల త‌యారీ సంస్థ హ్యుందాయ్, అల్కాజార్ పేరుతో, మూడు వ‌రుస‌ల సీట్ల‌తో స‌రికొత్త‌ ఎస్‌యూవీని భార‌త‌దేశంలో ఆవిష్క‌రించ‌నుంది. ఇటీవ‌లి కాలంలో 6/7 సీట్ల ఎస్‌యూవీపై కొనుగోలుదారులు ఆశ‌క్తి చూప‌డంతో, కంపెనీ ఈ విభాగంపై దృష్టి సారించిన‌ట్లు తెలుస్తుంది.