Politics

తెదేపా వాదనలో నిజం లేదు

తెదేపా వాదనలో నిజం లేదు

తిరుపతిలో తెదేపా అధినేత చంద్రబాబు సభను అడ్డుకోవాలని రాళ్ల దాడి చేసినట్లు ఆధారాలేమీ లభించలేదని అనంతపురం రేంజ్‌ డీఐజీ కాంతిరాణా టాటా తెలిపారు. తెదేపా నేతలు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్న పరిస్థితి తమ విచారణలో కనిపించలేదని చెప్పారు. తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో డీఐజీ మాట్లాడారు. రాళ్లు తగిలాయని ఇద్దరు కార్యకర్తలు చెప్పారన్నారు. ఈ ఘటనపై సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ చేశామని.. సీసీ టీవీ ఫుటేజ్‌ను పరిశీలించడంతో పాటు ప్రత్యక్ష సాక్షులను విచారించినట్లు తెలిపారు. చంద్రబాబు వాహనశ్రేణిని పరిశీలించామని.. ఆయన భద్రతా సిబ్బందినీ విచారించామన్నారు. ఈ ఘటనపై ఆధారాలుంటే వెంటనే ఇవ్వాలని చంద్రబాబుకు నోటీసు ఇచ్చామని కాంతిరాణా చెప్పారు. చంద్రబాబు ప్రచార సభకు సరిపడా భద్రత కల్పించామని డీఐజీ చెప్పారు. రాళ్ల దాడి ఘటనలో పోలీసులపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని.. అవి సరికాదన్నారు. చంద్రబాబు సభకు ఎలాంటి అంతరాయం కలగలేదని చెప్పారు. ఆయన ప్రచార వాహనానికి ఏ నష్టం జరగలేదన్నారు. దాడిపై ఆధారాలు ఇవ్వాలని ఫిర్యాదు చేసిన తెదేపా నేతలనూ కోరినట్లు డీఐజీ చెప్పారు.