Health

భారతీయులకు విదేశీ టీకాలు-తాజావార్తలు

భారతీయులకు విదేశీ టీకాలు-తాజావార్తలు

* భారత్‌లో కరోనా వ్యాక్సిన్‌ కొరతను అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే విదేశాల్లో ఆమోదం పొందిన టీకాలకు అనుమతులు ఇచ్చే ప్రక్రియను వేగవంతం చేయాలని నిర్ణయించింది. దీంతో అత్యవసర వినియోగ అనుమతులను వేగంగా ఇచ్చేందుకు సన్నద్ధం అయ్యింది. భారత్‌లో ఇప్పటికే మూడు టీకాలు అనుమతులు పొందాయి. కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయంతో మరికొద్ది రోజుల్లోనే మరిన్ని టీకాలు అందుబాటులోకి రానున్నాయి.

* తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకీ పెరుగుతున్నాయి. నిన్న రాత్రి 8 గంటల వరకు 1,13,007 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా కొత్తగా 3,052 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ మంగళవారం ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది. రాష్ట్రంలో నిన్న కరోనాతో ఏడుగురు మరణించారు. దీంతో కరోనాతో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 1,772కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న 778 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 3,06,678కి చేరింది. ప్రస్తుతం 24,131 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని, వారిలో 16,118 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో 406 కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో ఇప్పటి వరకు నిర్వహించిన మొత్తం కరోనా పరీక్షల సంఖ్య 1,11,81,010కి చేరింది.

* ‘అఖండ’గా రానున్న నటసింహం.. టీజర్ విడుదల. నందమూరి నట సింహం బాలకృష్ణ ప్రస్తుతం మాస్ డైరెక్టర్ బోయపాటి తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు బిబి3 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పటికే ఈ ఇద్దరి కాంబినేషన్ లో సింహ, లెజెండ్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే. దాంతో ఇప్పుడు బిబి 3 టైటిల్ తెరకెక్కుతున్న ఈ సినిమా పై అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. తాజాగా ఈ సినిమానుంచి అప్డేట్ వచ్చింది. ఉగాది పర్వధినాన్ని పురస్కరించుకొని బాలయ్య సినిమా టైటిల్ ను అనౌన్స్ చేశారు చిత్రయూనిట్. ఈ మేరకు టీజర్ ను విడుదల చేశారు. గత సినిమాల మాదిరిగానే ఈసినిమాకు కూడా అఖండ అనే పవర్ ఫుల్ టైటిల్ ను ఎంచుకున్నాడు బోయపాటి. ఇక ఈసినిమాలో బాలయ్య ద్విపాత్రాభినయం చేయబోతున్నారు.

* గత రెండు, మూడు రోజుల కిందట వరకూ సూర్యుడు తన ప్రతాపం చూపించాడు. వరుసగా అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ప్రజలు ఉక్కపోతతో అల్లాడిపోయారు. ఈ నేపథ్యంలో భారత వాతావరణశాఖ(ఐఎండీ) చల్లని కబురు చెప్పింది. వచ్చే నాలుగైదు రోజుల్లో దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈదురు గాలులు, మెరుపులు, ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, కేరళతో పాటు దక్షిణ కర్ణాటక, తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

* గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న భారత్ బయోటెక్ సంస్థకు చెందిన 2 లక్షల కోవాగ్జిన్ కరోనా డోసులు.

* భారత్‌లో కరోనా వైరస్‌ రెండో దశ విజృంభణ కొనసాగుతోంది. క్రితం రోజుతో పోలిస్తే కొవిడ్‌ కేసులు స్వల్పంగా తగ్గాయి. అంతకుముందు రోజు 1.68 లక్షల కేసులు నమోదు కాగా.. గడిచిన 24గంటల్లో 1,61,736 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయింది. నిన్న 14 లక్షల పరీక్షలు నిర్వహించారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,36,89,453కి చేరింది. కొత్తగా 97,168మంది వైరస్ బారి నుంచి బయటపడ్డారు. దీంతో మొత్తం రికవరీల సంఖ్య 1,22,53,697కు చేరి.. రికవరీ రేటు 89.86శాతానికి తగ్గింది.

* చెపాక్‌ వేదికగా కోల్‌కతా నైట్‌ రైడర్స్‌, ముంబయి ఇండియన్స్‌ మరికాసేపట్లో తమ రెండో మ్యాచ్‌లో తలపడుతున్నాయి. ఈ సందర్భంగా టాస్‌ గెలిచిన కోల్‌కతా కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌ తొలుత బౌలింగ్‌‌ ఎంచుకున్నాడు. ఇప్పటికే తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ను ఓడించిన కోల్‌కతా ఈ మ్యాచ్‌లో ముంబయిని కూడా ఓడించాలనే పట్టుదలతో ఉంది. మరోవైపు తొలి మ్యాచ్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు చేతిలో ఓటమిపాలైన ముంబయి ఈ మ్యాచ్‌లోనైనా గెలవాలని చూస్తోంది.

* ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులపై దుష్ప్రచారం చేస్తూ లబ్ధి పొందాలని భాజపా ప్రయత్నిస్తోందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. జానారెడ్డి లాంటి సీనియర్ నేత పార్టీ మారుతున్నారంటూ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. సీఎల్పీ కార్యాలయంలో భట్టి మీడియాతో మాట్లాడారు. ఇది భాజపా దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. దుబ్బాక ఎన్నికల సమయంలోనూ కాంగ్రెస్ అభ్యర్థి తెరాసలో చేరుతున్నారంటూ తప్పుడు వీడియోను విడుదల చేసి ప్రజలను తప్పుదోవ పట్టించి ఓట్ల లబ్ధి పొందారని విమర్శించారు.

* కరోనా వైరస్‌ విజృంభణతో మహారాష్ట్ర వణికిపోతోంది. దీంతో వైరస్‌ కట్టడికి ఇప్పటికే రాత్రిపూట కర్ఫ్యూతో పాటు వారాంతంలో లాక్‌డౌన్‌ అమలవుతోంది. అయినా వైరస్‌ తీవ్రత అదుపులోకి రాకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ అమలు చేస్తారనే ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే మరికొద్ది గంటల్లోనే మీడియా ముందు ప్రకటన చేసే అవకాశం ఉంది.

* పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా ముస్లిం సోదరులకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ మాసంలో నిర్వహించే ఉపవాస దీక్షలు, దైవప్రార్థనలతో సామరస్యం, ఆనందం వెల్లివిరియాలని ఆకాంక్షించారు. గంగాజమునా తహజీబ్ జీవన విధానం మరింతగా పరిఢవిల్లాలని, సోదరభావ స్ఫూర్తి గొప్పగా బలపడాలని అభిలషించారు. అన్ని మతాలకు సమాన గౌరవాన్నిస్తూ మత సామరస్యం కోసం తెలంగాణ ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుందన్నారు. ఆర్థికంగా వెనకబడిన ముస్లింల కోసం తెలంగాణ ప్రభుత్వం అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు.

* తిరుపతిలో తెదేపా అధినేత చంద్రబాబు సభను అడ్డుకోవాలని రాళ్ల దాడి చేసినట్లు ఆధారాలేమీ లభించలేదని అనంతపురం రేంజ్‌ డీఐజీ కాంతిరాణా టాటా తెలిపారు. తెదేపా నేతలు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్న పరిస్థితి తమ విచారణలో కనిపించలేదని చెప్పారు. తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో డీఐజీ మాట్లాడారు. రాళ్లు తగిలాయని ఇద్దర కార్యకర్తలు చెప్పారన్నారు. ఈ ఘటనపై సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ చేశామని.. సీసీ టీవీ ఫుటేజ్‌ను పరిశీలించడంతో పాటు ప్రత్యక్ష సాక్షులను విచారించినట్లు తెలిపారు. చంద్రబాబు వాహనశ్రేణిని పరిశీలించామని.. ఆయన భద్రతా సిబ్బందినీ విచారించామన్నారు. ఈ ఘటనపై ఆధారాలుంటే వెంటనే ఇవ్వాలని చంద్రబాబుకు నోటీసు ఇచ్చామని కాంతిరాణా చెప్పారు.