DailyDose

తెలంగాణా మత్తుమందుల కేసులో మరికొందరు MLAలు-నేరవార్తలు

తెలంగాణా మత్తుమందుల కేసులో మరికొందరు MLAలు-నేరవార్తలు

* తిరుపతి ఘటనపై కేంద్ర ఎన్నికల సంఘానికి తెదేపా ఫిర్యాదు చేసింది. దిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ రాజీవ్‌కుమార్‌ను తెదేపా ఎంపీలు కలిశారు. సోమవారం తిరుపతిలో తెదేపా నిర్వహించిన సభలో జరిగిన రాళ్ల దాడి ఘటనపై ఎంపీలు గల్లా జయదేవ్‌, రామ్మోహన్‌నాయుడు, కేశినేని నాని, కనకమేడల రవీంద్రకుమార్‌ వినతిపత్రం అందజేశారు. తిరుపతి ఉపఎన్నికలో కేంద్ర బలగాల పర్యవేక్షణలో పోలింగ్‌ నిర్వహించాలని ఎంపీలు కోరారు. పోలింగ్‌ కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. 2లక్షల నకిలీ ఓటరు కార్డులు ఉన్నాయని.. రెండు అదనపు గుర్తింపు కార్డులు ఉంటేనే ఓటు వేసే అవకాశం ఇవ్వాలని కోరారు. ఎన్నికల ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వంలోని వాలంటీర్లను భాగస్వాములను చేయకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు.

* సంచలనం సృష్టిస్తున్న బెంగళూరు మత్తుమందుల కేసు కీలక మలుపులు తిరుగుతోంది. ఇందులో ప్రధాన పాత్రధారి అయిన హైదరాబాద్‌ వ్యాపారి కల్‌హర్‌రెడ్డి నోరు విప్పేందుకు సిద్ధమయ్యాడు. దాంతో ఈ కేసుతో సంబంధం ఉందని భావిస్తున్న తెలంగాణ శాసనసభ్యుల చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్లు తెలుస్తోంది. కలహర్‌రెడ్డి ప్రస్తుతం బెంగళూరులోని గోవిందపుర పోలీసుల అదుపులో ఉండగా ట్రావెల్స్‌ యజమాని అయిన రతన్‌రెడ్డి కూడా వాంగ్మూలం ఇచ్చేందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది. పోలీసులు బుధవారానికల్లా వీరిద్దరి వాంగ్మూలం నమోదు చేసి అనంతరం శాసనసభ్యుల ప్రమేయంపై దృష్టి సారించనున్నారు. ఈ కేసులో కీలక సూత్రధారి, కన్నడ సినీ నిర్మాత శంకరగౌడ బెంగళూరులోని డాలర్స్‌ కాలనీలో ఏర్పాటు చేసే పార్టీలకు ప్రతిసారి తెలంగాణ నుంచి అనేకమంది హాజరయ్యేవారని పోలీసులు గుర్తించారు. వారెవరన్నది శంకరగౌడకు తెలుసు కాబట్టి అతడి ద్వారానే పూర్తి వివరాలు రాబట్టాలనే ఆలోచనతో ఉన్నారు. అతడిని మరోసారి విచారించాలని, అలాగే కొన్ని సాంకేతిక అంశాల ఆధారంగా బలమైన ఆధారాలను సేకరించాలని భావిస్తున్నారు.గత ఫిబ్రవరి 26న బెంగళూరు తూర్పు డివిజన్‌ పోలీసులు సినీ ప్రముఖులకు మత్తుమందులు సరఫరా చేసేందుకు వచ్చిన నైజీరియాకు చెందిన ఉగొచౌక్వా హారిసన్‌ లఘబంటి, జాన్‌ నాన్సోలను అరెస్టు చేశారు. అనంతరం జరిగిన దర్యాప్తులో శంకరగౌడ, ఆ తర్వాత తెలంగాణకు చెందిన పలువురు వ్యాపారులు, శాసనసభ్యుల పేర్లు బయటపడ్డాయి. హైదరాబాద్‌కు చెందిన స్థిరాస్తి వ్యాపారి సందీప్‌రెడ్డితోపాటు తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ఓ చోటా హీరోను విచారించారు. ఈ సందర్భంగా కలహర్‌రెడ్డి, రతన్‌రెడ్డిల పేర్లు వెలుగులోకి వచ్చాయి. వీరు తెలంగాణ శాసనసభ్యులను పార్టీల కోసం బెంగళూరు తీసుకొచ్చేవారని తేలింది. దాంతో వారిద్దరికీ రెండుసార్లు నోటీసులు జారీ చేశారు. స్పందన లేకపోవడంతో అరెస్టుకు సిద్ధమయ్యారు. దాంతో కలహర్‌రెడ్డి గత శనివారం పోలీసుల వద్ద హాజరయ్యాడు. మేజిస్ట్రేట్‌ ఎదుట అతడి వాంగ్మూలం నమోదు చేయనున్నారు. విచారణ సందర్భంగా కలహర్‌రెడ్డి పలువురు శాసనసభ్యుల పేర్లు చెప్పినట్లు తెలుస్తోంది. ఇదే తరహాలో ట్రావెల్స్‌ యజమాని రతన్‌రెడ్డి వాంగ్మూలం కూడా నమోదు చేయనున్నారు. ఈ కేసులో వీరి వాంగ్మూలమే కీలకం కానుంది.ఇంకొందరు ప్రజాప్రతినిధులు!

* గుంటూరుకు చెందిన ఆ యువతి ఇంటర్‌ చదువుకున్నారు. పాతగుంటూరుకు చెందిన యువకుడితో 2019లో పెద్దల సమక్షంలో కట్నకానుకలతోపాటు హంగు ఆర్బాటాలతో వివాహం చేశారు. చెడు సావాసాలకు అలవాటుపడిన అతడు భార్యను వేధించడం మొదలుపెట్టాడు. ఈ విషయం ఆమె తన తల్లిదండ్రులకు చెప్పడంతో పెద్దల సమక్షంలో పలుమార్లు సర్ది చెప్పారు. అయినా అతని తీరులో మార్పురాక భార్యను మానసికంగా, శారీరకంగా వేధిస్తూనే ఉన్నాడు. దీంతో ఆమె మతపెద్దల సమక్షంలో విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి అతను శాడిస్టులా ప్రవర్తించడం ప్రారంభించాడు. ఆమెతో కలిసి ఉన్న ఫొటోలను ఫేస్‌బుక్‌లో పెట్టి అసభ్యకరమైన ఈ అమ్మాయి కావాలంటే సంప్రదించండంటూ పోస్టులు పెడుతున్నాడు. అంతటితో ఆగకుండా ఆమె తండ్రి, సోదరుడి ఫొటోలను అసభ్యకరంగా మార్ఫింగ్‌చేసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తున్నాడు. ఆమెకు అర్ధరాత్రిళ్లు ఫోన్‌లు చేసి అసభ్యకరమైన పదజాలంతో మాట్లాడుతూ పైశాచిక ఆనందం పొందుతున్నాడు. అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కక్ష పెట్టుకొని తమ కుటుంబ సభ్యులపై దాడులకు పాల్పడుతున్నాడని బాధితులు వాపోయారు. తన వద్ద నగ్న వీడియోలు ఉన్నాయని, వాటిని సామాజిక మాధ్యమాల్లో పెడతానంటూ బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నాడని, అతనిపై చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని కోరారు.

* ఆదిలాబాద్‌ జిల్లాలో ఇద్దరు అటవీశాఖ అధికారులు కరోనాతో మృతిచెందారు. ఒకే గ్రామానికి చెందిన ఇద్దరు అధికారులు వేర్వేరు చోట్ల విధులు నిర్వర్తిస్తూ వైరస్‌ బారినపడి ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని భీంపూర్‌ గ్రామానికి చెందిన రాఠోడ్‌ ఈశ్వర్‌ (50) ఆదిలాబాద్‌ సెక్షన్‌ అధికారిగా విధులు నిర్వర్తిస్తుండగా.. జాదవ్‌ సునీల్‌ (36) నేరడిగొండలో బీట్‌ ఆఫీసర్‌గా ఉన్నారు. వీరిద్దరికీ కొన్నిరోజుల క్రితం కొవిడ్‌ పాజిటివ్‌ నిర్ధారణ అయింది. అప్పటినుంచి ఆదిలాబాద్‌ రిమ్స్‌లో చికిత్స తీసుకుంటున్నారు. అక్కడ చికిత్స పొందుతూ ఇద్దరూ ఇవాళ ప్రాణాలు కోల్పోయారు. గ్రామానికి చెందిన ఇద్దరు అధికారులు ఒక్కరోజే చనిపోవడంతో భీంపూర్ గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. అధికారుల మృతిపై జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ రాఠోడ్‌ జనార్దన్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అంత్యక్రియల నిమిత్తం మృతదేహాలను రిమ్స్‌ నుంచి భీంపూర్‌కు తరలించారు.

* పెరూ దేశంలో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు అదుపుతప్పి బోల్తా పడటంతో 20 మంది దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన ఉత్తర అంకాష్‌ ప్రాంతంలోని సిహ్వాస్‌ ప్రావిన్స్‌లో జరిగింది. స్థానిక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఘటనలో 18 మంది అక్కడికక్కడే మరణించారు. మరో ఇద్దరు ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించారు. ఇంకా 14 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రయాణికులంతా ఆదివారం పలు ప్రాంతాల్లో నిర్వహించిన ఎన్నికల్లో ఓటు వేయడానికి వెళ్లి తిరిగి వస్తున్నట్లు సమాచారం. సంఘటన గురించి తెలుసుకున్నాక వెంటనే సహాయ చర్యలు చేపట్టినట్లు పెరు రవాణా శాఖ తెలియజేసింది.