NRI-NRT

వైభవంగా తానా ప్రపంచ తెలుగు మహా కవి సమ్మేళనం-2021

TANA World Poetry Conference 2021 Ugadi Plava

ఉత్తర అమెరికా తెలుగు సంఘం, (తానా) సాహిత్య విభాగం – తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వహణలో – “ప్రపంచ తెలుగు మహాకవి సమ్మేళనం – 21″ భారత కాలమానం ప్రకారం ఏప్రిల్ 10 వ తేదీన ఉదయం 8 గంటలకు ప్రారంభమై, ఏప్రిల్ 11 ఉదయం 9 గంటల వరకు 25 గంటల పాటు అంతర్జాలంలో ఘనంగా నిర్వహించారు. ప్లవ నామ ఉగాది సందర్భంగా భారతదేశం, అమెరికాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా 21 దేశాల్లోని, 21 తెలుగు సంఘాల నుండి 246 మంది కవులు, పండితులు, సాహితీప్రియులు, యువతీ యువకులు ఈ కవి సమ్మేళనంలో పాల్గొన్నారు. ప్రముఖ శాస్త్రీయ సంగీత విద్వాంసురాలు కళ్యాణి ద్విభాష్యం, ప్రముఖ గాయని లక్ష్మి భావజల “మా తెలుగు తల్లికి మల్లె పూదండ” గీతంతో కార్యక్రమం ప్రారంభమైంది. ముఖ్య అతిథి భారత ఉప-రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు తన సందేశంలో తానా సంస్థ తెలుగు భాషా సంస్కృతులకు ప్రాధాన్యమిస్తూ ప్రపంచ మహాకవి సమ్మేళనం నిర్వహించడం ఆనందదాయకమని పేర్కొని ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. తానా అధ్యక్షులు తాళ్ళూరి జయశేఖర్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరినీ ఒకే వేదిక మీదకు తీసుకువచ్చి తెలుగు భాష అభివృద్ధికి పాటుపడాలనే ఉద్దేశంతో ఈ వేడుక నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ గత సంవత్సర కాలంగా ప్రతి నెలా ఆఖరి ఆదివారం వివిధ అంశాలపై అంతర్జాతీయ స్థాయిలో అంతర్జాలంలో సాహిత్య సమావేశాలను, మరి కొన్ని ప్రత్యేక సాహిత్య కార్యక్రమాలను జరుపుకుంటున్నామని, కాని ఇంత పెద్ద కార్యక్రమం జరుపుకోవడం ఇదే మొదటిసారని, విశ్వ వ్యాప్తంగా ఈ సాహితీ యజ్ఞంలో పాల్గొంటున్న తెలుగు సంఘాల అధ్యక్షులకు, భాషాభిమానులకు, వీక్షకులకు స్వాగతం పలికారు. సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ నిర్వహణలో సమ్మేళనం రక్తి కట్టింది. తానా మహిళా విభాగం సమన్వయకర్త శిరీష తూనుగుంట్ల సాంకేతిక సహకారాన్ని అందించారు. ప్రారంభసభలో ముఖ్య అతిథిగా తెలంగాణ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ జి. చంద్రయ్య, విశిష్ట అతిథిగా మహా సహస్రావధాని గరికిపాటి నరసింహారావు, ప్రత్యేక అతిథిగా కేంద్ర సాహిత్య అకాడమీ కార్యదర్శి కె. శ్రీనివాస్ హాజరై తెలుగు భాషా వైభవాన్ని పెంచడం కోసం తీసుకోవాల్సిన చర్యల గురించి ప్రసంగించారు. ముగింపు సభకు ముఖ్య అతిథిగా పద్మ భూషణ్ డా. కె. ఐ. వర ప్రసాద్ రెడ్డి హాజరై “నూతన పదకోశ అభివృద్దే భాషా పరిరక్షణకు మూలమని, ఆదిశగా అందరూ ఆలోచించాలని” అన్నారు. విశిష్ట అతిథిగా హాజరైన తనికెళ్ల భరణి భాషాభివృద్దికి విలువైన పలు సూచనలు చేశారు.

*** ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ సంస్థలు:
శ్రీ సాంస్కృతిక కళా సమితి – సింగపూర్; మలేషియా తెలుగు సంఘం – మలేషియా; హాంగ్ కాంగ్ తెలుగు సమాఖ్య- హాంకాంగ్; తెలుగు కళా సమితి – ఒమన్; తెలుగు కళాసమితి – ఖతర్; తెలుగు సంఘాల ఐక్యవేదిక – కువైట్; సౌదీ తెలుగు అసోసియేషన్ – సౌదీ అరేబియా; తెలుగు కళా సమితి – బెహ్రైన్; తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా – సౌత్ ఆఫ్రికా; తెలుగు అసోసియేషన్ ఆఫ్ బోట్స్వానా; నైజీరియా తెలుగు సంఘం – నైజీరియా; ఫ్రాన్స్ తెలుగు సంఘం – ఫ్రాన్స్; ఫిన్ల్యాండ్ తెలుగు సంఘం – ఫిన్లాండ్; డెన్మార్క్ తెలుగు సంఘం – డెన్మార్క్; నార్వే తెలుగు సంఘం – నార్వే; నార్తర్న్ ఐర్లండ్ తెలుగు సంఘం – నార్తర్న్ ఐర్లండ్; తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ – యూకే; తెలుగు అసోసియేషన్ ఆఫ్ స్కాట్ లాండ్ – స్కాట్ లాండ్; తెలుగు అసోసియేషన్ ఆఫ్ న్యూజీల్యాండ్ – న్యూజీల్యాండ్; తెలుగు మల్లి – ఆస్ట్రేలియా; తెలుగు అసోసియేషన్ ఆఫ్ చైనా – చైనా.

వైభవంగా తానా ప్రపంచ తెలుగు మహా కవి సమ్మేళనం-2021