Politics

మోడీజీ…60లక్షల డోసులు కావాలి-తాజావార్తలు

మోడీజీ…60లక్షల డోసులు కావాలి-తాజావార్తలు

* కరోనా కారణంగా జూమ్‌ యాప్‌ వినియోగం పెరగడంతోపాటు.. చాలా మంది వ్యక్తిగత జీవితాలు ఆన్‌లైన్‌కెక్కుతున్నాయి. కొవిడ్‌ కారణంగా కెనడా పార్లమెంట్‌ సమావేశాలు జూమ్‌ విధానంలో జరుగుతున్నాయి. ఇటీవల హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌ సభ భేటీలో ఓ సభ్యుడు నగ్నంగా ప్రత్యక్షమయ్యాడు. ఆ తర్వాత నాలుక్కరుచుకొని క్షమాపణలు చెప్పాడు.

* పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ)ను మోసం చేసి యూకేకు పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీని భారత్‌కు అప్పగించేందుకు బ్రిటన్‌ అంగీకరించింది. నీరవ్‌ మోదీని భారత్‌కు అప్పగిస్తామని యునైటెడ్‌ కింగ్‌డమ్‌ హోం మినిస్టర్‌ అంగీకారం తెలిపినట్లు సీబీఐ వెల్లడించింది. నీరవ్‌ మోదీని భారత్‌కు అప్పగించాలని ఫిబ్రవరి నెలలోనే అక్కడి కోర్టు తీర్పు ఇవ్వగా.. తాజాగా బ్రిటన్‌ హోంమంత్రిత్వశాఖ కూడా ఆమోదం తెలిపింది. దీంతో నీరవ్‌ మోదీని భారత్‌ రప్పించేందుకు మార్గం సుగమమయ్యింది.

* ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. వైరస్‌ బారినపడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. రాష్ట్రంలో సెకండ్‌ వేవ్‌లో మొదటిసారి 6వేలకుపైగా కేసులు నమోదు అయ్యాయి. అంతేకాకుండా ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 35,962 పరీక్షలు నిర్వహించగా.. 6,096 కేసులు నిర్ధారణ కాగా.. 20 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 9,48,231 మంది వైరస్‌ బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.

* కరోనా వ్యాక్సినేషన్ కోసం ఏపీకి మరో 60 లక్షల డోసుల కొవిడ్ టీకాలను పంపాల్సిందిగా ముఖ్యమంత్రి జగన్ ప్రధాని నరేంద్రమోదీని కోరారు. టీకా ఉత్సవ్ కార్యక్రమం అమలుపై ప్రధానికి సీఎం లేఖ రాశారు. 45 ఏళ్ల వయసు దాటిన వ్యక్తులకు టీకా వేసేందుకుగానూ వచ్చే మూడు వారాల్లో ఏపీకి 60 లక్షల కొవిడ్ టీకా డోసుల అవసరం ఉందని లేఖలో పేర్కొన్నారు. ఈ మేరకు వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు ఆదేశాలు ఇవ్వాల్సిందిగా ప్రధానిని విజ్ఞప్తి చేశారు. కరోనా నిర్వహణ, వ్యాక్సినేషన్‌కు సంబంధించి ఏపీ ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వానికి పూర్తి సహకారం ఉంటుందని స్పష్టం చేశారు. ఈ అంశంలో కేంద్ర ప్రభుత్వం అనుసరించిన కార్యాచరణ ప్రపంచ వ్యాప్తంగా మన్ననలు అందుకుందని లేఖలో పేర్కొన్నారు.

* సామాజిక మాధ్యమాలను తాత్కాలికంగా నిలిపివేస్తూ పాకిస్థాన్‌ ప్రభుత్వం శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. ఫ్రాన్స్ పత్రికలకు వ్యతిరేకంగా పాకిస్థాన్‌లో ర్యాడికల్‌ ఇస్లామిక్‌ పార్టీ చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ఫ్రాన్స్ పత్రికలు దైవ దూషణకు పాల్పడ్డాయంటూ ఆ పార్టీకి చెందిన వేలాది మంది మద్దతుదారులు రోడ్లపైకి వచ్చి ఇష్టారీతిలో దాడులకు తెగబడుతున్నారు.

* తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో గాంధీ ఆస్పత్రి మరోసారి పూర్తిస్థాయి కొవిడ్‌ ఆస్పత్రిగా మారనుంది. రేపటి నుంచి పూర్తి స్థాయిలో గాంధీలో కొవిడ్‌ సేవలు అందించనున్నారు. ఈ మేరకు కొవిడ్‌ ఆస్పత్రిగా గాంధీని మార్చేందుకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా రేపటి నుంచి ఓపీ సేవలు నిలిపివేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.ఎమర్జెన్సీ ఆపరేషన్స్‌ను కూడా ఆపేసి కేవలం కరోనా కేసులకు మాత్రమే చికిత్స అందించనుంది.

* తెలంగాణలో ఎడ్‌సెట్‌ నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ నెల 19 నుంచి జూన్ 15వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు పరీక్షల కన్వీనర్‌ తెలిపారు. ఆగస్టు 24, 25న ఎడ్‌సెట్ పరీక్ష నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ ఏడాది అన్ని మెథడాలజీలకు ఒకే ప్రశ్నాపత్రం ఉంటుందని వెల్లడించారు. సిలబస్‌, నమూనా ప్రశ్నాపత్రాలు ఎడ్‌సెట్‌ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు.

* వైఎస్‌ షర్మిలపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్న వైఎస్‌ విజయమ్మకు అమరావతి రాజధాని కోసం పోరాడుతోన్న మహిళా రైతులపై పోలీసుల దాడులు గుర్తుకురాలేదా? అని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రశ్నించారు. ఏపీలో మహిళలపై దాడులు జరిగితే విజయమ్మ ఎందుకు మాట్లాడలేదని నిలదీశారు. అమరావతిలో మహిళలను ఇళ్లల్లో నుంచి బయటకు రానివ్వడం లేదన్నారు. షర్మిలకు ఒక రూల్‌.. ఏపీ మహిళలకు మరొక రూలా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారన్నారు. అమరావతిలో జరుగుతున్న దౌర్జన్యాలపై పార్టీ గౌరవ అధ్యక్షురాలిగా విజయమ్మ మాట్లాడాలని.. తద్వారా పార్టీ గౌరవం మరింత పెరుగుతుందని రఘు రామకృష్ణరాజు అభిప్రాయపడ్డారు.

* ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పరిస్థితిని రాష్ట్ర ప్రభుత్వం నిశితంగా గమనిస్తోందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ తెలిపారు. సీఎం సూచనల మేరకు విద్యార్థుల భవిష్యత్తు, భద్రతపై అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఏమాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. రాష్ట్రంలో పదో తరగతి, ఇంటర్‌ పరీక్షల నిర్వహణకు ఇప్పటికే షెడ్యూల్‌ ఖరారు చేసినట్లు మంత్రి తెలిపారు. రాబోయే రోజుల్లో పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. రాష్ట్రంలోని విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు రానివ్వమని స్పష్టం చేశారు.