Business

మారుతీ కార్ల ధరలు పెంపు-వాణిజ్యం

మారుతీ కార్ల ధరలు పెంపు-వాణిజ్యం

* తమ సంస్థ నుంచి వస్తున్న కార్లలో చాలా మోడళ్ల ధరల్ని పెంచుతున్నామని ఆటో దిగ్గజం మారుతీ సుజుకీ శుక్రవారం ప్రకటించింది. ఈ ధరలు తక్షణమే అమల్లోకి రానున్నట్లు తెలిపింది. ఎక్స్‌షోరూం ధరల్ని దాదాపు 1.6 శాతం మేర పెంచినట్లు పేర్కొంది. తయారీ, నిర్వహణ, ముడిసరకుల వ్యయాలు ఎగబాకడమే ధరల పెంపునకు కారణమని వివరించింది. తప్పనిసరి పరిస్థితుల్లోనే ధరల పెంపు నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చిందని బీఎస్‌ఈ ఫైలింగ్‌లో పేర్కొంది. మోడల్‌ని బట్టి ఒక్కో కారుపై అత్యధికంగా రూ.22,500 వరకు పెంచినట్లు తెలిపింది. స్విఫ్ట్‌, సెలెరియో మినహా దాదాపు అన్ని మోడళ్లపై ధరలు పెరిగినట్లు వెల్లడించింది. ఈ కేలండర్‌ సంవత్సరంలో మారుతీ ధరలు పెంచడం ఇది రెండోసారి. జనవరి 18న గరిష్ఠంగా కొన్ని మోడళ్లపై రూ.34,000 వరకు ధరలు పెరిగిన విషయం తెలిసిందే.

* భారత్‌ సహా మొత్తం 13 దేశాల్లో రిటైల్‌ వ్యాపారం నుంచి నిష్క్రమించేందుకు అమెరికాకు చెందిన బ్యాంకింగ్‌ దిగ్గజం సిటీ బ్యాంక్‌ సిద్ధమైంది. ఈ వ్యాపారాన్ని విక్రయించేందుకు సరైన కొనుగోలుదారు కోసం అన్వేషిస్తోంది. రిటైల్‌ బ్యాంకింగ్‌, క్రెడిట్‌ కార్డులు, గృహ రుణాలు, వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ సేవలు నిర్వహించే ఈ సంస్థ నిష్క్రమణ భారత్‌లోని చిన్న బ్యాంకులకు ఓ అవకాశమనే చెప్పాలి.

* ఆహార సరఫరా సేవల సంస్థ స్విగ్గీ తాజాగా భారీ విలువను సొంతం చేసుకొంది. దీనిలో పెట్టుబడులు పెట్టేందుకు జపాన్‌కు చెందిన సాఫ్ట్‌బ్యాంక్‌ 5.5 బిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.40వేల కోట్లు)గా విలువ కట్టింది. తాజాగా మాస్కోషి సన్‌ విజన్‌ ఫండ్‌2 నుంచి స్విగ్గీలో 450 మిలియన్‌ డాలర్ల పెట్టుబడులు రానున్నాయి. ఈ పెట్టుబడులకు భారత యాంటీట్రస్ట్‌ రెగ్యూలేటరీల ఆమోదముద్ర పడాల్సి ఉందని ఆంగ్ల పత్రిక బిజినెస్‌ స్టాండర్డ్‌ పేర్కొంది. దీనిపై స్విగ్గీకానీ, అటు సాఫ్ట్‌ బ్యాంక్‌ ప్రతినిధులు కానీ స్పందించలేదు.

* యూనివర్సల్‌ బ్యాంకులు, చిన్న ఫైనాన్స్‌ బ్యాంకులను ‘ఆన్‌ ట్యాప్‌’ లైసెన్సు కింద ఏర్పాటు చేయడానికి చెరో నాలుగు దరఖాస్తులు వచ్చాయని రిజర్వు బ్యాంక్‌ (ఆర్‌బీఐ) ప్రకటించింది. యూనివర్సల్‌ బ్యాంకు లైసెన్సుల కోసం యూఏఈ ఎక్స్ఛేంజీ అండ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్, ది రెపాట్రియేట్స్‌ కోఆపరేటివ్‌ ఫైనాన్స్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ (రెప్కో బ్యాంక్‌), సచిన్‌ బన్సల్‌ సంస్థ చైతన్య ఇండియా ఫిన్‌ క్రెడిట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, పంకజ్‌ వైశ్‌లు దరఖాస్తు చేసుకున్నాయి. చిన్న ఫైనాన్స్‌ బ్యాంకు లైసెన్సుల కోసం దరఖాస్తు చేసుకున్న వాటిలో విసాఫ్ట్‌ టెక్నాలజీస్, కాలికట్‌ సిటీ సర్వీస్‌ కోపరేటివ్‌ బ్యాంక్, అఖిల్‌ కుమార్‌ గుప్తా, ద్వారా క్షేత్రియ గ్రామీణ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ ఉన్నాయి. ప్రైవేట్‌ రంగంలో యూనివర్సల్‌ బ్యాంకుల లైసెన్సులకు మార్గదర్శకాలను 2016 ఆగస్టులో, చిన్న ఫైనాన్స్‌ బ్యాంకుల లైసెన్సు మార్గదర్శకాలను 2019 డిసెంబరులో ఆర్‌బీఐ జారీ చేసింది. దరఖాస్తుల మదింపునకు ఆర్‌బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్‌ శ్యామలా గోపినాధ్‌ సారథ్యంలో స్టాండింగ్‌ ఎక్స్‌టెర్నల్‌ అడ్వైజరీ కమిటీ (ఎస్‌ఈఏసీ)ని ఏర్పాటు చేయనున్నట్లు ఆర్‌బీఐ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.

* హైడ్రోజన్‌ సరఫరాకు అవసరమయ్యే మౌలిక వసతులను భారత్‌ మరింత పెంచుతుందని చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ పేర్కొన్నారు. ఇతర ఇంధనాలతో పోలిస్తే కర్బన రహిత ఇంధనానికి ఉన్న ప్రయోజనాల దృష్ట్యా ఆ ఇంధన ఉత్పత్తి దిశగా ప్రణాళికలు వేగవంతం చేయాలని భావిస్తున్నామని గురువారం తెలిపారు. ‘భవిష్యత్‌ ఇంధన వనరుగా మారడానికి హైడ్రోజన్‌కు గొప్ప అవకాశాలున్నాయి. హైడ్రోజన్‌పై ఉత్సుకతకు కారణమేంటంటే దానిని బ్యాటరీగా మార్చినా లేదా వేడి కోసం మండించినా.. అది భూతాపాన్ని తగ్గిస్తుంది. సహజ వాయువు లేదా బొగ్గు నుంచి కర్బన రహిత హైడ్రోజన్‌ను తయారు చేయొచ్చు. విద్యుత్‌ను ఉపయోగించే నీటిని హైడ్రోజన్, ఆక్సిజన్‌గా విడదీయవచ్చు. ఇలా ఉత్పత్తి చేసిన హైడ్రోజన్‌ను రవాణా ఇంధనంగానూ ఉపయోగించవచ్చ’ని ఆయన వివరించారు.

* స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ (బీఎస్‌బీడీ) ఖాతాను జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ ఖాతా అని పిలుస్తారు, ఇది ఒక‌ పొదుపు ఖాతా, కొన్ని కనీస సౌకర్యాలను ఉచితంగా వినియోగ‌దారుల‌కు అందిస్తుంది. ఇటువంటి ఖాతాలు ప్రధానంగా ఆర్థికంగా వెన‌క‌ప‌డిన‌వారిని ప్రోత్స‌హించ‌డానికి ఉప‌యోగ‌ప‌డ‌తాయి.4 ఉచిత లావాదేవీలకు మించి బీఎస్‌బీడీ ఖాతాల్లోని డిజిటల్ లావాదేవీలపై వసూలు చేసిన ఛార్జీలపై ఎస్‌బీఐ స్పష్టతనిచ్చింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆగస్టు 2012 లో, 4 ఉచిత లావాదేవీలకు మించి బీఎస్‌బీడీ ఖాతాలలో సహేతుకమైన ఛార్జీలు వసూలు చేయడానికి బ్యాంకులకు స్వేచ్ఛనిచ్చింది. దీని ప్రకారం, ఎస్‌బీఐ బీఎస్‌బీడీ ఖాతాలలో నాలుగు ఉచిత లావాదేవీలకు మించి డెబిట్ లావాదేవీల కోసం ఛార్జీలను ప్రవేశపెట్టింది ఇది జూన్ 15, 2016 నుంచి వినియోగదారులకు అందుబాటులోకి రానుంది.2020 ఆగస్టులో చేసిన‌ డిజిటల్ లావాదేవీలపై జ‌న‌వ‌రి2020 తరువాత నుంచి వసూలు చేసిన ఛార్జీలను తిరిగి చెల్లించాలని, అలాంటి వాటి ద్వారా భవిష్యత్తులో జరిగే లావాదేవీలపై ఛార్జీలు విధించవద్దని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్స్ (సిబిడిటి) బ్యాంకులకు సూచించింది.ఆదేశాలను అనుసరించి, అన్ని డిజిటల్ లావాదేవీలకు సంబంధించి జ‌న‌వ‌రి 2020 నుంచి సెప్టెంబ‌ర్ 2020 వ‌ర‌కు వసూలు చేసిన ఛార్జీలను బీఎస్‌బీడీ వినియోగదారులకు ఎస్‌బీఐ తిరిగి చెల్లించింది.