WorldWonders

శ్మశానాల్లో ఖాళీ లేదు – ఇండియాలో కరోనా విలయతాండవం

శ్మశానాల్లో ఖాళీ లేదు – ఇండియాలో కరోనా విలయతాండవం

దేశంలో కరోనా ఉగ్ర తాండవం చేస్తోంది. గతంలో ఎన్నడూలేనంత ఉద్ధృతంగా విరుచుకుపడుతోంది. కరోనా సెకండ్‌ వేవ్‌ శరవేగంగా వ్యాప్తి చెందడంతో దేశంలోని పలు రాష్ట్రాలు చిగురుటాకుల్లా వణికిపోతున్నాయి. గుజరాత్‌లో రాజ్‌కోట్‌ జిల్లాలోని ఆస్పత్రుల్లో బెడ్‌లు ఖాళీ లేక, సకాలంలో వైద్యం అందక రోగులు అల్లాడిపోతున్నారు. చివరకు, కొవిడ్‌తో మృతిచెందిన వారికి అంత్యక్రియలు నిర్వహించేందుకు సైతం శ్మశానాల్లో ఖాళీలేని దయనీయ పరిస్థితులు దాపురించాయి.

రాజ్‌కోట్‌ జిల్లాలో కరోనా కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ప్రతి రోజూ 50 మందికి పైగా కొవిడ్‌తో ప్రాణాలు కోల్పోతున్నారు. ఆస్పత్రుల్లో బెడ్‌లు లేక, 108 అంబులెన్స్‌ల కొరతతో జనం అల్లాడిపోతున్నారు. ఆస్పత్రిలో చేరిన రోగులూ చికిత్స కోసం బతిమిలాడుకోవాల్సిన దుస్థితి. చికిత్స కోసం ప్రభుత్వ/ప్రైవేటు ఆస్పత్రుల ముందు రోగులు ఆస్పత్రుల ముందు కి.మీల మేర బారులు తీరుతున్నారు. అంబులెన్స్‌లు అందుబాటులో లేకపోవడంతో దిక్కుతోచని స్థితిలో రోగులు ఆటో రిక్షాల్లో ఆస్పత్రులకు తరలివస్తున్నారు. వారిలో కొందరైతే ఆటోరిక్షాల్లో‌ల్లోనే కూర్చొని చికిత్స పొందుతుండటం కొవిడ్‌తో అక్కడి ప్రజారోగ్య వ్యవస్థ సంక్షోభానికి, దయనీయ పరిస్థితికి అద్దం పడుతోంది.

రాజ్‌కోట్‌ జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. రోజూ దాదాపు 400లకు పైగా కొత్త కేసులు రాగా.. 50మంది వరకూ ప్రాణాలు కోల్పోతున్నారు. శుక్రవారం ఒక్కరోజే 52మంది ప్రాణాలు విడిచారు. మృతుల సంఖ్య భారీగా పెరుగుతుండటంతో శ్మశానవాటికల వద్ద అంత్యక్రియలు నిర్వహించేందుకు నిరీక్షణ తప్పడంలేదు. మరోవైపు, ఆస్పత్రుల ముందు ఉదయం నుంచే అంబులెన్స్‌ల బారులు తీరి ఉంటున్నాయి. సివిల్‌, ప్రైవేటు ఆస్పత్రుల్లో పడకలు ఖాళీలేక పోవడంతో ఆస్పత్రుల బయట వాహనాలు భారీగా క్యూ కడుతున్నాయి. శుక్రవారం ఉదయం చౌదరి హైస్కూల్‌ మైదానం సమీపంలో సివిల్‌ ఆస్పత్రి బయట అంబులెన్స్‌ వ్యాన్‌లు బారులు తీరి ఉన్నాయి. ఆస్పత్రుల్లో పడకల కొరత నేపథ్యంలో అనేకమంది మార్కెట్లోనే ఆక్సిజన్‌ సిలిండర్లు కొనుక్కొని ఇంటి వద్దే చికిత్స పొందుతున్నారు.