DailyDose

పోలీసులకు నరేష్ ఫిర్యాదు-నేరవార్తలు

Crime News - Actor Naresh Complains To CCS Police

* సినీనటుడు నరేశ్‌ హైదరాబాద్‌ సీసీఎస్‌ పోలీసులను ఆశ్రయించారు. స్టోన్‌ ఇన్‌ఫ్రా కంపెనీ యజమాని లింగం శ్రీనివాస్‌ తమకు రూ.10 కోట్లు ఇవ్వాలని, ఇవ్వకుండా తప్పించుకు తిరుగుతున్నాడని పోలీసులకు తెలిపారు. ‘‘స్టోన్‌ ఇన్‌ఫ్రా కంపెనీల పేరుతో లింగం శ్రీనివాస్‌ .. మా బిల్డర్స్‌ ఫియోనిక్స్‌తో అసోసియేట్‌ అయి సైనింగ్‌ అథారిటీగా ఉన్నాడు. మా కుటుంబంతో ఉన్న పరిచయంతో రూ.7.5కోట్లు అప్పుగా తీసుకున్నాడు. ఆరేళ్లు దాటినా ఇప్పటి వరకు తిరిగి చెల్లించలేదు. దీనిపై మూడ్రోజుల క్రితం సెంట్రల్‌ క్రైమ్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాను. మాకు రూ.10 కోట్లు రావాలి. హైదరాబాద్‌ సీసీఎస్‌ పోలీసులు ఫిర్యాదు తీసుకుని కేసు నమోదు చేశారు. తెలంగాణ పోలీసులకు కృతజ్ఞతలు’’ అని ఓ వీడియో సందేశంలో నరేశ్‌ తెలిపారు.

* మాజీ మంత్రి వైఎస్‌ వివేకా హత్య కేసులో ఇంటెలిజెన్స్ మాజీ‌ చీఫ్ ఏబీ‌ వెంకటేశ్వరరావు(ఏబీవీ) చేసిన ఆరోపణలు నిరాధారమైనవని డీఐజీ పాలరాజు అన్నారు. డీజీపీ, ఇతర పోలీసు అధికారులపై ఏబీవీ రాసిన లేఖపై ఆయన స్పందించారు. డీజీపీపై ఏబీవీ నిరాధార ఆరోపణలు చేశారని మండిపడ్డారు. వివేకా హత్య జరిగిన అనంతరం కూడా వెంకటేశ్వరరావు ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ గానే కొనసాగారని వివరించారు. అప్పుడు ఆ కేసుకు సంబంధించిన కీలక సమాచారం సిట్‌కు ఎందుకు అందించలేదని ఆయన ప్రశ్నించారు. కేసు విషయంలో ఏవైనా సందేహాలుంటే నివృత్తి చేసుకోవాలి తప్ప.. సహచర ఉద్యోగులపై ఇలా ఆరోపణలు చేయడం తగదని పాలరాజు హితవు పలికారు.

* కడప జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలంలో దారుణం చోటుచేసుకుంది. మండలంలోని కస్తూరిరాజుగారిపల్లెలో ఎస్సీ కాలనీకి చెందిన ఓబులేశుపై గుర్తుతెలియని వ్యక్తులు వేట కొడవళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో బాధితుడు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న లక్కిరెడ్డిపల్లి ఎస్‌ఐ చిన్నపెద్దయ్య తన సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. పాత కక్షల నేపథ్యంలోనే ఓబులేశును హత్య చేసి ఉంటారని భావిస్తున్నట్లు పోలీసులు బావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ చిన్నపెద్దయ్య తెలిపారు.

* చెడు వ్యసనాలకు బానిసై, డబ్బులు ఇవ్వలేదనే కోపంతో తండ్రిని రాయితో మోది అతి కిరాతకంగా హత్య చేశాడో కుమారుడు. సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్‌ మండలం నారాయణగూడెంలో ఈ దారుణ ఘటన జరిగింది. నారాయణగూడెం గ్రామానికి చెందిన నంద్యాల అంజిరెడ్డి(70), పుల్లమ్మ దంపతుల కుమారుడు అమరసింహారెడ్డి. పుల్లమ్మ పదేళ్ల క్రితం మరణించగా కుమార్తె కీర్తి భర్తతోపాటు హైదరాబాద్‌లో ఉంటోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒక్కగానొక్క కుమారుడు కావడంతో అమరసింహారెడ్డిని గారాబంగా పెంచారు. వేలకు వేలు ఫీజులు చెల్లించి ప్రైవేటు పాఠశాలలో చదివించారు. 2014లో హైదరాబాద్‌లో ఓ ప్రైవేటు కళాశాలలో ఇంజినీరింగ్‌ పూర్తిచేశాక ఉన్నత చదువులకు కెనడా పంపించారు. అక్కడ ఉన్న నాలుగేళ్లలో అమరసింహారెడ్డి మద్యం, మత్తు పదార్థాలకు బానిసగా మారాడు. చదువును పూర్తిగా పక్కన పెట్టేసి డబ్బులు పంపించాలంటూ తండ్రిని వేధించేవాడు. డబ్బుల కోసం కొద్దిరోజులు కెనడాలో క్యాబ్‌ డ్రైవర్‌గా కూడా పనిచేశాడు. అనంతరం అక్క కీర్తి జోక్యం చేసుకుని తమ్ముణ్ని హైదరాబాద్‌ తీసుకొచ్చారు. అయినా అమరసింహారెడ్డి అలవాట్లు మారలేదు. తెలిసిన వాళ్ల దగ్గర అప్పులు చేసి జల్సాలు చేసేవాడు. ఆ బాకీలు తీర్చేందుకు గ్రామంలోని రెండు ఎకరాల పొలం కూడా అమ్మారు. సోదరి సైతం విసిగిపోయి అక్కడి నుంచి పంపేయడంతో అమరసింహారెడ్డి నారాయణగూడెంలో తండ్రి దగ్గరకు వచ్చాడు. ఇంట్లో దాచిన నగదు తీసుకెళ్లి చెడు వ్యసనాలకు ఖర్చు చేసేవాడు. ఈ విషయంలో తండ్రీకొడుకుల మధ్య తరచుగా వాగ్వాదం జరుగుతున్నట్లు స్థానికులు తెలిపారు. శుక్రవారం అర్ధరాత్రి మద్యం తాగి వచ్చిన అమరసింహారెడ్డి.. తండ్రిని డబ్బులు అడిగాడు. తండ్రి ఇవ్వకపోవడంతో విచక్షణ కోల్పోయిన అమరసింహారెడ్డి ఇనుప బకెట్‌తో దాడిచేశాడు. కిందపడిపోయిన తండ్రి ముఖంపై రాయితో బలంగా మోదడంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. శనివారం సూర్యాపేట డీఎస్పీ మోహన్‌కుమార్‌, గ్రామీణ సీఐ విఠల్‌రెడ్డి, పెన్‌పహాడ్‌ ఎస్‌ఐ రంజిత్‌రెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహన్ని పోస్టుమార్టం కోసం సూర్యాపేట జనరల్‌ ఆసుపత్రికి తరలించారు. కీర్తి ఫిర్యాదుతో కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలిసింది.

* తమిళనాడులోని వేలూరులో విషాదం చోటుచేసుకుంది. పట్టణ పరిధిలోని ఓ బాణసంచా దుకాణంలో అగ్నిప్రమాదం జరగడంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సజీవ దహనమయ్యారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నట్లు సమాచారం. అగ్నిప్రమాదానికి గల కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు.