WorldWonders

పంజాబ్ కూలీకి కోటి రూపాయిల అదృష్టం-తాజావార్తలు

పంజాబ్ కూలీకి కోటి రూపాయిల అదృష్టం-తాజావార్తలు

* పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌ జిల్లా అకోటా గ్రామానికి చెందిన రోజువారీ కూలీ రాత్రికి రాత్రే కోటీశ్వరుడైపోయాడు. లాటరీ రూపంలో అతడిని అదృష్టం వరించింది. బోదరాజు అనే కూలీ రూ.100 పెట్టి కొన్న లాటరీ అతడి జీవితాన్నే మార్చేసింది. ఏప్రిల్‌ 14న బోదరాజు రూ.100 పెట్టి లాటరీ టికెట్‌ కొన్నాడు. కాగా లూథియానాలో న్యాయనిర్ణేతల సమక్షంలో జరిగిన డ్రాలో బోదరాజు కొన్న లాటరీని అదృష్టం వరించింది. ఈ విషయాన్ని లాటరీల నిర్వాహకుడు అశోక్‌.. బోదరాజుకు తెలియజేశాడు. త్వరలోనే నగదు అందిస్తామని వెల్లడించాడు. ఈ ఆనందాన్ని భార్య, ఇద్దరు కూతుళ్లతో పంచుకున్న బోదరాజు.. వచ్చే డబ్బుతో పిల్లలకు మంచి చదువు చెప్పిస్తానని పేర్కొన్నాడు.

* లాభనష్టాలతో సంబంధం లేకుండా విశాఖ ఉక్కు కర్మాగారాన్ని విక్రయిస్తామంటే ఊరుకోబోమని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు అన్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ, సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఆర్కే బీచ్‌లో నిర్వహించిన రైతు, కార్మిక శంఖారావంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ రంగ సంస్థలంటే ప్రజా సంపద అని.. వాటిని పెట్టుబడిదారులకు ఎలా ఇస్తారని వడ్డే నిలదీశారు. న్యాయస్థానాల ద్వారా స్టీల్‌ప్లాంట్‌ను రక్షించుకుంటామని చెప్పారు.

* తెలంగాణలో కరోనా సెకండ్‌ వేవ్‌ వేగంగా విస్తరిస్తున్నా సీఎం కేసీఆర్‌ ఏమీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రె‌డ్డి ఆరోపించారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు ఆయన లేఖ రాశారు. రాష్ట్రంలో కొవిడ్‌ కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ ఎందుకు తక్కువ చేసి చూపిస్తున్నారని ప్రశ్నించారు. కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయిన వారి ప్రైమరీ కాంటాక్టులకూ టెస్టులు చేయాల్సిన సర్కార్ ఎందుకు చేయడం లేదని నిలదీశారు. రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి క్రమంగా పెరుగుతున్నప్పటికీ ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవడం లేదని.. ప్రజారోగ్య వ్యవస్థను పూర్తిగా గాలికి వదిలేశారని విమర్శించారు.

* ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. సెకండ్‌ వేవ్‌లో కొవిడ్‌ మహమ్మారి మరింత వేగంగా వ్యాపిస్తోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 35,922 పరీక్షలు నిర్వహించగా.. 6,582 కేసులు నిర్ధారణ అయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 9,62,037 మంది వైరస్‌ బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొవిడ్‌ వల్ల 22 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. చిత్తూరులో ఐదుగురు, కృష్ణా, నెల్లూరులో నలుగురు చొప్పున; కర్నూల్‌లో ముగ్గురు, అనంతపురం, గుంటూరులో ఇద్దరేసి; విశాఖ, విజయనగరం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 7,410కి చేరింది.

* విశాఖ స్టీల్ ప్లాంట్ , ప్రభుత్వ రంగ సంస్థ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖ అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జెఎసి ఆధ్వర్యంలో జీవియంసి గాంధీ విగ్రహం వద్ద నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు 16 వ రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షలను ఎఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి ఓబులేసు ప్రారంభించారు .

* తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు అనూహ్యంగా పెరుగుతున్నాయి. నిన్న రాత్రి 8గంటల వరకు 1,29,637 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా… కొత్తగా 5,093 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో కరోనా వ్యాప్తి మొదలైన తర్వాత ఇవే అత్యధిక కేసులు. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ ఆదివారం ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది. రాష్ట్రంలో నిన్న కరోనాతో 15 మంది మరణించారు. దీంతో కరోనాతో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 1,824కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న 1,555 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 3,12,563కి చేరింది. ప్రస్తుతం 37,037 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని, వారిలో 24,156 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో 743 కేసులు నమోదయ్యాయి.

* బీజేపీ నేత మోత్కుపల్లి నర్సింహులు ఆరోగ్య పరిస్థితి విషమం – కరోనా సోకి సోమాజిగూడలో చికిత్స పొందుతున్న మోత్కుపల్లి – మోత్కుపల్లికి ఐసీయూలో చికిత్స అందిస్తున్న వైద్యులు

* ఖమ్మం మున్సిపల్ ఎన్నికల్లో కలిసి పోటీచేయనున్న బీజేపీ, జనసేన పార్టీలు

* కరోనా తీవ్రతతో బెజవాడలో స్వచ్ఛందంగా వ్యాపార దుకాణాలు మూసివేత. నేటి నుంచి ఈ నెల 30 వరకు ఉదయం 9 నుంచి సాయంత్రం 6 వరకు మాత్రమే షాపులు తెరిచి ఉంచాలని నిర్ణయం.

* 52 మంది విద్యార్థినీలకు కరోనా.ఆదోని కస్తూర్బా గాంధీ హాస్టల్‌లో కరోనా కలకలం చెలరేగింది.52 మంది విద్యార్థినీలకు కరోనా పాజిటివ్ వచ్చింది.అలాగే ప్రిన్సిపాల్ శాంతి దగ్గు, జ్వరంతో బాధపడుతున్నారు.కొవిడ్ పాజిటివ్ వచ్చిన విద్యార్థినులను వైద్య అధికారులు ఐసోలేషన్‌కు తరలించారు.పాఠశాల సముదాయంలోనే ఓ గదిలో ఉంచి వారికి చికిత్స అందిస్తున్నారు.ఏపీలో విద్యాసంస్థల్లోనూ కరోనా వ్యాప్తి చెందుతుండడం ఆందోళన కలిగిస్తోంది.కరోనా సెకండ్ వేవ్ ఆంధ్రప్రదేశ్‌లో విజృంభిస్తోంది.రోజు రోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది.

*