Business

LIC జోరు బాగుంది-వాణిజ్యం

LIC జోరు బాగుంది-వాణిజ్యం

* కరోనా రెండో దశతో ఏర్పడిన సంక్షోభం తాత్కాలికమని షేర్‌ మార్కెట్‌ బిగ్‌ బుల్‌గా పేరుగాంచిన ప్రముఖ పెట్టుబడిదారుడు రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా అభిప్రాయపడ్డారు. మహమ్మారి రెండో దఫా విజృంభిస్తున్నప్పటికీ.. రెండంకెల వృద్ధి రేటు నమోదు కావడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. మార్కెట్లు భారీగా దూసుకెళ్లే క్రమంలో ఉన్నాయని తెలిపారు.

* లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా భారతీయులకు పరిచయం అక్కర్లేని పేరు. మధ్యతరగతి కుటుంబాల్లో ఎల్ఐసీ పాలసీ తీసుకొని ఫ్యామిలీ ఉండదంటే అతిశయోక్తి కాదు. మెట్రో నగరాల నుంచి మారుమూల గ్రామాల వరకు ప్రతీ చిన్న పల్లెకు ఎల్ఐసీ విస్తరించింది. తాజాగా ఎల్ఐసీ మరో రికార్డు సృష్టించింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఎల్ఐసీ పాలసీల ద్వారా కలెక్ట్ చేసిన ప్రీమియం విలువ ఒక లక్షా 84 వేల కోట్ల రూపాయలపైనే ఉంటుంది.

* స్టాక్‌ మార్కెట్లో నమోదిత కంపెనీలు గత ఆర్థిక సంవత్సరంలో ప్రైవేట్‌ ప్లేస్‌మెంట్‌ ప్రాతిపదికన బాండ్లు జారీ చేసి రూ.7.72 లక్షల కోట్లు సమకూర్చుకున్నాయి. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే 14 శాతం వృద్ధి నమోదైంది. ఒక ఆర్థిక సంవత్సరంలో ఈ మార్గంలో సమకూరిన నిధుల్లో ఇదే అత్యధికం. 2019-20లో రూ.6.75 లక్షల కోట్లు, 2018-19లో రూ.6.1 లక్షల కోట్లు, 2017-18లో 6.4 లక్షల కోట్లు పోగయ్యాయి.

* కరోనావైరస్‌ వ్యాప్తితో పలు రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌లు, కర్ఫ్యూలు విధించడంపై మారుతీ సుజుకీ ఛైర్మన్‌ ఆర్సీ భార్గవ స్పందించారు. ఆయన టౌమ్స్‌నౌతో మాట్లాడుతూ వైరస్‌ వ్యాప్తి కట్టడికి లాక్‌డౌన్‌లు ప్రభావవంతంగా పనిచేయకపోగా.. ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతోపాటు కార్మికులు నగరాలను వీడి వెళ్లిపోయేట్లు చేస్తుందని అభిప్రాయపడ్డారు. చికిత్స ఎప్పుడు రోగం కంటే బాధాకరం కాకూడదని వివరించారు. రాష్ట్రం మొత్తం గంపగుత్తగా లాక్‌డౌన్‌ విధించే కంటే ఆయా ప్రాంతాల వారీగా కంటైన్మెంట్‌జోన్ల విధానాలు అమలు చేయడం మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు.