NRI-NRT

సింగపుర్ ప్రవాసుల ఉగాది

సింగపుర్ ప్రవాసుల ఉగాది

సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో లోకకళ్యాణార్ధం మరియు అందరి శ్రేయస్సే మహాసంకల్పంగా శ్రీ ప్లవ నామ సంవత్సర ఉగాది న ఆ దేవదేవుడు శ్రీనివాసునకు సుప్రభాతసేవ, తోమాలసేవ, శ్రీవారి అభిషేకం మరియు విశేషపూజలతో పాటు , మహా గణపతి, విష్ణుదుర్గ, మహాలక్ష్మి,ఆంజనేయస్వామి వార్లకు అభిషేకము మొదలగు విశేష కైంకర్యములతో పాటు శ్రీదేవి , భూదేవి సమేత శ్రీ శ్రీనివాసకల్యాణోత్సవము ను స్థానిక సెరంగూన్ రోడ్ లోని శ్రీ శ్రీనివాస పెరుమాళ్ దేవాలయమందు ఏప్రిల్ 13 మంగళవారం నాడు అత్యంత భక్తిశ్రద్ధలతో , శాస్త్రోక్తంగా , భగవన్నామ స్మరణల మధ్య నిర్వహించారు. శ్రీవారి కల్యాణోత్సవానంతరణ ఆస్ధానం మరియు ఇతర విశేష పూజలను వైభవోపేతం గా నిర్వహించారు.

కల్యాణోత్సవానంతరం శ్రీవారు ఆస్ధానంలో ఉండగా బ్రహ్మశ్రీ డా. మాడుగుల నాగఫణి శర్మ గారిచే నిర్వహించిన పంచాంగ శ్రవణంను అందరూ ఆసక్తిగా ఆలకించారు. ఈ కార్యక్రమానికి హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ మాన్యశ్రీ బండారు దత్తాత్రేయగారు హాజరుకావటం విశేషం.

ప్రస్తుతమున్న ప్రత్యేక పరిస్ధితులదృష్ట్యా సింగపూర్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ మరియు హిందూ ఎండోమెంట్స్ బోర్డ్ నిర్ధేశించిన మార్గదర్శకాలతో దేవాలయానికి వచ్చే భక్తుల శరీర ఉష్ణోగ్రత లను పరిశీలించడం, భక్తుల వివరాల సేకరించడంతో పాటు భక్తులు సామాజిక దూరాన్ని పాటించేల వివిధ ఏర్పాట్లు చేసి వాలంటీర్ల సహాయంతో , భక్తుల సహకారంతో అమలు చేయటం జరిగింది. అంతేకాకుండా ఆ కలియుగ దైవం కృప అందరికీ కలగాలనే సత్సంకల్పంతో భక్తులు ఇంటి నుంచే వీక్షించేవిధంగా ఫేస్బుక్ ద్వారా లైవ్ ప్రసారమయ్యేవిధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రత్యేక ఏర్పాట్ల పట్ల భక్తులు హర్షం వ్యక్తం చేసారు.

షడ్రచుల సమ్మిళితమైన ఉగాది పచ్చడి ని ప్రత్యేక ప్యాకెట్ రూపం లో సుమారు 2000 మందికి అందించారు.

తెలుగు సమాజం అధ్యక్షులు కోటిరెడ్డి తెలుగువారందరికీ ప్లవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలపటంతో పాటు , పంచాంగ పఠనం చేసిన నాగఫణి శర్మగారికి , అతిధి గా విచ్ఛేసిన మాన్యశ్రీ బండారు దత్తాత్రేయ గారికి కృతజ్ఞతలు తెలియచేసారు. కార్యక్రమానికి అన్నివిధాల పెరుమాళ్ దేవస్ధానాల కార్యవర్గాలకు , దాతలకు, స్పాంసర్స్ కు , సహకరించిన ప్రతి ఒక్కరికీ కార్యక్రమ నిర్వాహకులు , ఉపాధ్యక్షులు అనిల్ కుమార్ పోలిశెట్టి కృతజ్ఞతలు తెలిపారు. భక్తులకు , వాలంటీర్లకు, కార్యక్రమానికి లైవ్ ద్వారా వీక్షించిన వారికి కార్యదర్శి సత్యచిర్ల ఈ సందర్భంగా ధన్యవాదములు తెలియజేశారు.