Business

ఒక డాలరుకు ₹74.95-వాణిజ్యం

One USD To INR Is More Than 74 Rupees

* ‘ఫోర్బ్స్‌ 30 అండర్‌ 30’ జాబితాలో ఇద్దరు యువ హైదరాబాదీలు స్థానం సంపాదించారు. తాజాగా విడుదలైన ఈ జాబితాలో మేకర్స్‌ హైవ్‌ఇన్నోవేషన్స్‌ సీఈఓ ప్రణవ్‌ వెంపటి, డిజి-ప్రెక్స్‌ వ్యవస్థాపకుడు సమర్థ్‌ సింధీ ఉన్నారు.ప్రణవ్‌ వెంపటికి చెందిన హైవ్‌ఇన్నోవేషన్స్‌ కృత్రిమ అవయవాల తయారీలో నిమగ్నమైన సంస్థ. ఈ అంకుర సంస్థ ‘కల్‌ఆర్మ్‌’ అనే పేరుతో బయోనిక్‌ హ్యాండ్‌ తయారు చేసి, ఎంతో తక్కువ ధరకు అందిస్తోంది. ఈ కృత్రిమ చేత్తో టైపింగ్‌ సహా అన్ని రకాల పనులు చేయొచ్చు! స్టార్‌ఫిష్‌ గ్రోత్‌ పార్టనర్స్‌తో పాటు మరికొన్ని పెట్టుబడి సంస్థల నుంచి హైవ్‌ఇన్నోవేషన్స్‌ కొద్దికాలం క్రితం 9 మిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.65 కోట్లు) సమీకరించింది. డిజి-ప్రెక్స్‌ ఆన్‌లైన్‌ ఫార్మసీ సేవల సంస్థ. డాక్టర్‌ ప్రిస్క్రిప్షన్‌ను వాట్సాప్‌లో పంపి, నెలకు సరిపడా మందులకు డబ్బు చెల్లిస్తే, ఉచితంగా డెలివరీ చేస్తుంది. ఈ సంస్థ రెండేళ్ల క్రితం ఖోస్లా వెంచర్స్, వై కాంబినేటర్, జస్టిన్‌ మతీన్‌ నుంచి 5.5 (దాదాపు రూ.40 కోట్లు) బిలియన్‌ డాలర్ల నిధులు సమీకరించింది. అ అంకుర సంస్థ వ్యవస్థాపకుడైన సమర్థ్‌ సింధీ బ్రౌన్‌ యూనివర్సిటీ నుంచి మెకానికల్‌ ఇంజనీరింగ్‌ పట్టా పుచ్చుకున్నారు. యూఎస్‌లోని ఒక హెల్త్‌కేర్‌ కంపెనీలో కొంతకాలం పనిచేసి వెనక్కి వచ్చారు.

* దేశీయ స్టాక్‌ మార్కెట్లలో విదేశీ పోర్ట్‌ఫోలియో (ఎఫ్‌పీఐలు) మదుపర్ల పెట్టుబడుల విలువ గత ఆర్థిక సంవత్సరంలో (2020-21) 555 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.40,00,000 కోట్లు)కు చేరింది. 2020 సెప్టెంబరు నుంచి 2021 మార్చి మధ్య ఈ విలువ 105 బిలియన్‌ డాలర్లు పెరిగిందని బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా సెక్యూరిటీస్‌ నివేదిక తెలిపింది. దేశీయ సంస్థాగత మదుపర్ల పెట్టుబడుల విలువ 2020-21 చివరినాటికి 203 బిలియన్‌ డాలర్లుగా (సుమారు రూ.15,00,000 కోట్లు) ఉంది. ఎఫ్‌పీఏల పెట్టుబడుల విలువలో ఇది సగం కంటే తక్కువే. ప్రస్తుత ఏడాదిలో ఏప్రిల్‌ 16 వరకు చూస్తే, ఎఫ్‌పీఐలు నికరంగా 7.2 బిలియన్‌ డాలర్లు పెట్టుబడిగా పెట్టారు. జనవరిలో 2.2 బిలియన్‌ డాలర్లు, ఫిబ్రవరిలో 3.5 బిలియన్‌ డాలర్లు, మార్చిలో 3.5 బిలియన్‌ డాలర్లు చొప్పున విదేశీ మదుపర్ల పెట్టుబడులు నమోదయ్యాయి. తద్వారా ఈ ఏడాదిలో ఇప్పటివరకు విదేశీ మదుపర్లు నికరంగా పెట్టుబడుల పెట్టిన ఏకైక దేశంగా భారత్‌ నిలిచింది. ఇతర వర్ధమాన విపణులన్నింటి నుంచి ఎఫ్‌పీఐలు పెట్టుబడులను నికరంగా వెనక్కితీసుకోవడం గమనార్హం. దేశీయ ఈక్విటీ మార్కెట్లు రాణించడంలో ఎఫ్‌పీఐల పెట్టుబడులు కీలక పాత్ర పోషిస్తాయనే విషయం తెలిసిందే.

* దేశీయ స్టాక్‌ మార్కెట్లు గురువారం నాటి ట్రేడింగ్‌ను లాభాలతో ముగించాయి. దేశంలో కరోనా కేసులు ఉద్ధృతంగా పెరుగుతున్న నేపథ్యంలో ఉదయం నష్టాల్లో ప్రారంభమైన సూచీలు.. మెటల్‌, ఫైనాన్షియల్‌ షేర్ల అండతో లాభాల్లోకి వచ్చాయి. దీంతో నిఫ్టీ 14,400 పాయింట్ల ఎగువన ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 74.95గా ఉంది.

* మన దేశంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన విభాగంలో పోటీ ప్రస్తుతం చాలా తక్కువగా ఉంది. చాలా వరకు పెద్ద కంపెనీలు ఇంకా తమ ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకొని రాలేదు. ఇప్పుడిప్పుడే ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇటీవల విడుదలైన కొన్ని గణాంకాలు చూస్తే మనకు అర్ధం అవుతుంది. ప్రభుత్వాలు కూడా ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లను ప్రోత్సాహిస్తున్నాయి. బజాజ్ ఆటో, టీవీఎస్ మోటార్ రెండూ కూడా తమ ఫ్లాగ్‌షిప్ ఎలక్ట్రిక్ వాహన మోడళ్లను మార్కెట్ లోకి విడుదల చేశాయి.