Politics

జస్టిస్ బాబ్డేకు ఘనంగా వీడ్కోలు-తాజావార్తలు

Justice SA Bobde Takes Grand Farewell From Colleagues

* సుప్రీంకోర్టులో జస్టిస్‌ బోబ్డేతో కలిసి పనిచేసిన కాలాన్ని తాను ఎప్పటికీ మరిచిపోలేనని నూతన సీజేఐగా నియమితులైన జస్టిస్‌ ఎన్వీ రమణ అన్నారు. సీజేఐగా జస్టిస్‌ బోబ్డే పదవీ కాలం ముగిసిన నేపథ్యంలో శుక్రవారం వర్చువల్‌గా ఏర్పాటు చేసిన వీడ్కోలు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘వీడ్కోలు పలకడం అనేది చాలా కష్టమైన పని’ అని జస్టిస్‌ ఎన్వీ రమణ అన్నారు. జస్టిస్‌ బోబ్డేలోని తెలివి, శక్తి సామర్థ్యాలు తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని చెప్పారు. ఆయనకు విభిన్న అభిరుచులు ఉన్నాయని, దీంతో పదవీ విరమణ తర్వాత ఏం చేయాలనే దానిపై ఈ పాటికే ఒక నిర్ణయం తీసుకుని ఉంటారని అన్నారు. భవిష్యత్‌లో ఆయన చేసే అన్ని ప్రయత్నాల్లో మంచి జరగాలని ఆకాంక్షించారు. మారుతున్న కాలంతో పాటు, ప్రస్తుత కరోనా పరిస్థితుల దృష్ట్యా ప్రజలకు న్యాయం అందించడం కోసం జస్టిస్‌ బోబ్డే ఈ-కోర్టులను ప్రారంభించారని, మహమ్మారి సమయంలోనూ మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేశారని కొనియాడారు. దేశమంతా ప్రస్తుతం పరీక్షా కాలాన్ని ఎదుర్కొంటోందని ఈ సందర్భంగా జస్టిస్‌ ఎన్వీ రమణ అన్నారు. కరోనా మహమ్మారితో పోరాడుతున్న ఇలాంటి క్లిష్ట సమయంలో కొన్ని బలమైన చర్యలు తీసుకొని వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయాలని అన్నారు. విధిగా మాస్కులు ధరించాలని, చేతులు కడుక్కోవాలని సూచించారు. అవసరం ఉంటేనే బయటికి రావాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. క్రమశిక్షణతోనే మహమ్మారిని ఓడించగలమని చెప్పారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, న్యాయవాదులు కూడా కరోనా బారిన పడ్డారని తెలిపారు. వైరస్‌కు ఎలాంటి బేధభావాలూ లేవని అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసర సేవలకు ఆటంకం కలగకుండా సహకరించాలని ప్రజలకు హితవు పలికారు.

* కరోనా వైరస్‌ మహమ్మారి సెకండ్‌ వేవ్‌లో విలయతాండవం చేస్తోన్న వేళ.. పలు రాష్ట్రాలు ఆక్సిజన్‌ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ఈ పరిస్థితిని అధిగమించేందుకు దేశవ్యాప్తంగా పలు ప్లాంట్ల నుంచి ‘ఎక్స్‌ప్రెస్‌’ వేగంతో ఆక్సిజన్‌ కంటెయినర్లను తరలిస్తున్నారు. అయినప్పటికీ ఆక్సిజన్‌ కొరత తీరడం లేదు. దీంతో అప్రమత్తమైన భారత్‌, ఆక్సిజన్‌ ప్లాంట్లను జర్మనీ నుంచి దిగుమతి చేసుకునేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా జర్మనీ నుంచి దాదాపు 23 మొబైల్‌ ఆక్సిజన్‌ ఉత్పత్తి ప్లాంట్లను తీసుకురానున్నారు.

* దేశంలో కొవిడ్‌ ఉద్ధృతిపై సుప్రీంకోర్టు సుమోటోగా చేపడుతున్న విచారణ నుంచి ప్రముఖ న్యాయవాది హరీశ్‌ సాల్వే అమికస్‌ క్యూరీగా తప్పుకొన్నారు. దేశం ప్రస్తుతం అత్యంత అయోమయ స్థితిలో ఉందన్న సాల్వే.. న్యాయస్థానం విచారిస్తున్న అత్యంత క్లిష్టమైన విచారణ ఇదేనని అభిప్రాయపడ్డారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బోబ్డే తనకు ఎప్పటినుంచో తెలిసి ఉన్నందున ఈ విచారణ నుంచి తాను తప్పుకొంటున్నట్లు తెలిపారు.

* సంగం డెయిరీని దెబ్బతీసి అమూల్‌కు కట్టబెట్టే కుట్రలో భాగంగానే ధూళిపాళ్ల నరేంద్రను అక్రమంగా అరెస్ట్‌ చేశారని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు. ఈ అరెస్ట్‌ను ఆయన తీవ్రంగా ఖండించారు. స్థానిక రైతులు భాగస్వామిగా ఉండే సంగం డెయిరీని నిర్వీర్యం చేసి పొరుగు రాష్ట్రానికి చెందిన అమూల్‌తో లోపాయికారీ ఒప్పందాలు చేసుకున్నారని.. తద్వారా ఇక్కడి సంస్థలను దెబ్బతీస్తున్నారని ఆయన ఆరోపించారు. వైకాపా రెండేళ్ల పాలనలో అభివృద్ధి లేకపోయినా అక్రమ అరెస్ట్‌లు ఉన్నాయని ఎద్దేవా చేశారు.

* తెదేపా సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రను అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) అరెస్ట్‌ చేసింది. గుంటూరు జిల్లా చింతలపూడిలోని ఆయన నివాసం వద్ద తెల్లవారుజామునే సుమారు 100 మందికి పైగా పోలీసులు మోహరించారు. అనంతరం నరేంద్రను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసి తమ వాహనంలో తీసుకెళ్లారు. ధూళిపాళ్ల ప్రస్తుతం సంగం డెయిరీ ఛైర్మన్‌గా ఉన్నారు. ఆ సంస్థలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలతో ఆయనపై 408, 409, 418, 420, 465 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ఏసీబీ తెలిపింది. మరోవైపు ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా నరేంద్రను అరెస్ట్‌ చేయడమేంటని తెదేపా కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు.

* కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర మంత్రులు కేటీఆర్‌, ఈటల రాజేందర్ చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి ఆర్వింద్‌, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌ తెలిపారు. ఈ మేరకు వారు ఓ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో కరోనా విజృంభిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేయడమే కాకుండా కేంద్రంపై అనవసర ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు. కొవిడ్ వ్యాప్తిపై ఇప్పటిదాకా రాష్ట్ర ప్రభుత్వం ఒక్క ఉన్నత స్థాయి సమీక్ష కూడా చేయలేదని దుయ్యబట్టారు. రాష్ట్రానికి ఎన్ని టన్నుల ఆక్సిజన్ అవసరమో కూడా ప్రభుత్వానికి తెలియదని వారు ఎద్దేవా చేశారు. కరోనా కట్టడి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా చేతులెత్తేసిందని విమర్శించారు.

* కరోనా టీకా విషయంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మే 1 నుంచి 18 సంవత్సరాలు దాటిన అందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్‌ ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి ప్రకటించారు. శుక్రవారం మంత్రులు, అధికారులతో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. వ్యాక్సిన్‌ సరఫరా విషయమై సీఎం జగన్‌ ఇప్పటికే భారత్‌ బయోటెక్‌, హెటెరో డ్రగ్స్‌ ఎండీలకు ఫోన్‌ చేసి మాట్లాడారు.

* తిరుమలలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో గంటన్నరపాటు ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. జోరుగా కురిసిన వానతో తిరుమల మాడ వీధులు, రహదారులు పూర్తిగా జలమయం అయ్యాయి. భారీగా గాలులు వీయడంతో అనేక చెట్టు కొమ్మలు విరిగిపడ్డాయి. శ్రీవారి ఆలయ పరిసరాల్లో పెద్ద ఎత్తున నీరు చేరింది. ఒక్కసారిగా కురిసిన భారీ వర్షంలో భక్తులు తడిసి ముద్దయ్యారు.

* తెలంగాణలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ కొరత లేదని.. రెండు మూడు రోజుల్లో ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ ఆక్సిజన్‌ అందేలా చూస్తామని వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. కరీంనగర్ జిల్లా ఆస్పత్రిలో ఆక్సిజన్‌ ఉత్పత్తి ప్లాంట్‌ను ఇవాళ ఈటల ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

* రాష్ట్రంలో కరోనా పరిస్థితుల పై హైకోర్టు విచారణ చేపట్టింది. కోవిడ్ లక్షణాలు ఆధారంగా చేసుకుని ఆస్పత్రిలో అడ్మిట్ చెలుకోవాలని హైకోర్టు ఆదేశించింది. ఆర్‌టీపీసీఆర్‌ టెస్ట్‌ రిపోర్ట్‌ లేకున్నా ప్రతి హాస్పిటల్‌ అడ్మిషన్‌ ఇవ్వాలని హైకోర్టు స్పష్టం చేసింది. 24 గంటల్లోగా ఆర్‌టీపీసీఆర్‌ రిపోర్టు ఇచ్చే విధంగా చూడాలని కోరింది. విచారణ సందర్బంగా రోజుకు 30 నుంచి 40 వేల ఆర్‌టీపీసీఆర్‌ టెస్టులు చేస్తున్నామని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. ఈ క్రమంలో కోర్టు ‘‘ఏప్రిల్ 1 నుంచి ఇప్పటి వరకు 3,47,000 టెస్టులు మాత్రమే టెస్టులు చేశారు.. కానీ ప్రభుత్వం చెప్పిన దాని ప్రకారం చూస్తే ఇప్పటి వరకు 8,40,000 టెస్టులు చేయాలి. ఎందుకు చేయడం లేదు’’ అని కోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. కరోనా కేసులు వివరాలను ప్రతి రోజు మీడియా బులెటిన్‌ విడుదల చేయాలని ఆదేశించింది.

* కోవిడ్‌ బారిన పడి వంట చేసుకోలేని వారికి యోగా విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో అన్నదానం చేయనున్నట్లు అన్నపూర్ణేశ్వరి దేవి యోగా గురూజీ జగన్‌ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. కరోనా బారిన పడిన వారికి ఇంటి వద్దకే నేరుగా భోజనం, ఆహార పానీయాలు అందజేయనున్నట్లు తెలిపారు. ఎవరికైతే తమ సేవలు కావాలో ముందస్తుగా ఫోన్‌చేసి పేరు, చిరునామా లొకేషన్‌ పెడితే అన్నం ఇతర పదార్థాలు అందజేస్తామన్నారు. మరిన్ని వివరాలకు సెల్‌: 9441887766 ఈ నెంబరుకు కాల్‌ చేయాలని నిర్వాహకులు ఒక ప్రకటనలో కోరారు.

* సరిగ్గా ఎనిమిదేళ్ల క్రితం ఇదే రోజు(2013 ఏప్రిల్‌ 23) విండీస్‌ యోధుడు క్రిస్‌ గేల్‌ ఐపీఎల్‌లో పెను విధ్వంసాన్ని సృష్టించాడు. 2013 ఐపీఎల్‌ సీజన్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుకు ప్రాతినిధ్యం వహించిన అతను.. పూణే వారియర్స్‌ ఇండియాపై 66 బంతుల్లో ఏకంగా 175 పరుగులు సాధించి క్రికెట్‌ ప్రపంచాన్ని నివ్వెరపోయేలా చేశాడు. ఈ మ్యాచ్‌కు ముందు చిరుజల్లులతో తడిసి ముద్దైన బెంగళూరు వేదిక, గేల్‌ సిక్సర్ల సునామీలో కొట్టుకుపోయింది. అప్పటివరకు నాటి కేకేఆర్‌ ఆటగాడు బ్రెండన్‌ మెక్‌కల్లమ్‌(158) పేరిట ఉన్న ఐపీఎల్‌ అత్యధిక వ్యక్తిగత స్కోర్‌ రికార్డును గేల్‌, ఈ ఇన్నింగ్స్‌ ద్వారా తుడిచిపెట్టాడు. క్రికెట్‌ ప్రపంచంలో గేల్‌ సృష్టించిన ఈ మహా ప్రళయం ధాటికి పలు రికార్డులు కాలగర్భంలో కలిసిపోయాయి.