Politics

తెలంగాణాలో సెలవులు-TNI కోవిద్ బులెటిన్

India COVID 19 Daily Bulletin 2021 Today

* ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రములో ఏప్రిల్ 27 నుంచి మే నెల 31వ తేదీ వరకు వేసవి సెలవులు ప్రకటిస్తున్నట్లు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. పాఠశాలలు, జూనియర్ కళాశాలలకు సంబంధించి వేసవి సెలవుల నిర్ణయంపై గౌరవ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు గారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, విద్యా శాఖ అధికారులతో ఆదివారం ఉదయం సమీక్షించారని మంత్రి తెలిపారు. కరోనా విస్తరించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా ఇప్పటికే 10వ తరగతి పరీక్షలు రద్దు చేసి 5,21,392 మంది విద్యార్థులను పాస్ చేసినట్లు మంత్రి గుర్తు చేశారు. అదేవిధంగా 1 నుంచి 9వ తరగతి వరకు చదువుతున్న 53 లక్షల 79 వేల 388 మంది విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేసినట్లు మంత్రి తెలిపారు. పాఠశాలలు, జూనియర్ కళాశాలలను తరువాత ఎప్పుడు తెరిచేది కోవిడ్ – 19 పరిస్థితిని అనుసరించి జూన్ 1న ప్రభుత్వం నిర్ణయిస్తుందని మంత్రి తెలిపారు. ఏప్రిల్ 26వ తేదీని ప్రస్తుత విద్యా సంవత్సరం చివరి దినంగా పరిగణిస్తామని మంత్రి పేర్కొన్నారు.

* తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్‌ ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. నిన్న రాత్రి 8 గంటల వరకు 1,08,602 కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించగా.. 8,126 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ ఆదివారం ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది. రాష్ట్రంలో కరోనాతో నిన్న 38 మంది మృతిచెందగా.. 3,307 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 62,929కి చేరింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో మరో 1,259 కేసులు నమోదయ్యాయి.

* కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం శనివారం సాయంత్రం మరికొన్ని ఆంక్షలను విధించింది. ఇప్పటి వరకు వెసులుబాటు ఉన్న ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, కేరళ రాష్ట్రాల ప్రజలు కూడా తప్పనిసరిగా ఈ-పాస్‌ పొందాలని స్పష్టం చేసింది. రాష్ట్రంలో క్లబ్‌లు, బార్లు, సినిమా థియేటర్లు, వ్యాయామశాలలు, రిక్రియేషన్‌ క్లబ్‌లు, వాణిజ్య ప్రాంగణాలు, మాల్స్‌ను మూసివేయాలని పేర్కొంది. సోమవారం తెల్లవారుజామున 4 గంటల నుంచి ఈ కొత్త నిబంధనలు అమలులోకి రానున్నాయి.

* దేశంలో కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాల్చిన నేపథ్యంలో వైరస్‌ను తరిమికొట్టే బృహత్తర ప్రక్రియ వ్యాక్సిన్‌ పంపిణీని కేంద్రం మరింత వేగవంతం చేసింది. 18ఏళ్ల పైబడిన వారందరికీ టీకాలు అందించే కార్యక్రమం మే 1వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్‌ పంపిణీని సమర్థంగా అమలు చేయడం కోసం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం శనివారం నూతన మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ మార్గదర్శకాలను రాష్ట్రాలు తప్పనిసరిగా పాటించాలని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ కోరారు. టీకా పంపిణీపై రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఎప్పటికప్పుడు కొవిన్‌ యాప్‌లో అప్‌లోడ్‌ చేయాలని సూచించారు.

* ప్రఖ్యాత వ్యాక్సిన్‌ తయారీ సంస్థ భారత్‌ బయోటెక్‌ కరోనా నియంత్రణ టీకా ‘కొవాగ్జిన్‌’ ధరలను ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేటు ఆస్పత్రులకు వేర్వేరు ధరలు నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వాలకు అందించే టీకాకు ఒక్కో డోసు ధర రూ600లు కాగా.. ప్రైవేటు ఆస్పత్రులకు సరఫరా చేసే వ్యాక్సిన్‌ ధరను రూ.1200లుగా నిర్ణయించింది. ఈ మేరకు శనివారం రాత్రి ఆ సంస్థ ఓ ప్రకటన జారీ చేసింది. విదేశాలకు ఎగుమతి చేసే టీకా ధర 15 నుంచి 20 డాలర్లు మధ్య ఉంటుందని వెల్లడించింది. కరోనాను నివారించడంలో కొవాగ్జిన్‌ టీకా సమర్థంగా పనిచేస్తున్నట్టు ఇటీవల భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ వెల్లడించిన విషయం తెలిసిందే. మూడో దశ క్లినికల్‌ పరీక్షల రెండో మధ్యంతర ఫలితాలను బుధవారం వెల్లడించింది. దీని ప్రకారం.. ఈ టీకా తేలికపాటి, మధ్య స్థాయి, తీవ్రమైన కొవిడ్‌ వ్యాధిపై 78శాతం ప్రభావశీలత కనబరిచిందని తెలిపింది. దీన్ని తీసుకుంటే తీవ్రమైన కరోనా వ్యాధితో ఆస్పత్రి పాలయ్యే అవకాశాలు నూరు శాతం లేవని వెల్లడించిన విషయం తెలిసిందే.

* ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో దారుణ ఘటన.నీరసించి, సొమ్మసిల్లు ఆసుపత్రికి వచ్చిన బీడీ కాలనీకి చెందిన జయలక్ష్మి.కోవిడ్ రిపోర్ట్ ఉంటే గానీ వైద్యం చేయలేమన్న వైద్యులు.కోవిడ్ టెస్ట్ చేస్తే వారానికి గానీ రిపోర్ట్ రావడంలేదు.వైద్యం చేయాలని కోరిన కుటుంబ సభ్యులు.ఈలోగా వైద్యం అందక మృతిచెందిన మహిళ.వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ ఆసుపత్రి ఎదుట మృతురాలి బంధువులు ఆందోళన.

* దేశంలో కరోనా మహమ్మారి రెండో దశ రికార్డు స్థాయిలో వ్యాపిస్తోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో 17,19,588 టెస్టులు చేయగా 3,49,691 కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ఆదివారం వెల్లడించింది. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 1,69,60,172కు చేరింది. కొత్తగా 2,17,113 మంది మహమ్మారి బారి నుంచి కోలుకున్నారు. దీంతో దేశంలో మొత్తం రికవరీల సంఖ్య 1,40,85,110 చేరి, 83.49 శాతానికి తగ్గింది
తాజాగా కరోనా మరణాలు సైతం రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 2,767 మంది మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయారు. దీంతో వైరస్‌ వెలుగులోకి వచ్చిన నాటి నుంచి దాని బారిన పడి మరణించిన వారి సంఖ్య 1,92,311 కుచేరింది. ఇక మరణాల రేటు 1.14శాతానికి చేరింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా క్రియాశీలక కేసుల సంఖ్య కూడా భారీగా పెరిగింది. ప్రస్తుతం 26,82,751 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఇక టీకాల విషయానికొస్తే.. నిన్న 25,36,612 మందికి పైగా వ్యాక్సిన్‌ అందించారు. దీంతో మొత్తం టీకాలు పొందిన వారి సంఖ్య 14,09,16,417 కి చేరింది.