WorldWonders

తిమింగళం ఉమ్మి…పరిమళం వెదజల్లుతుంది

తిమింగళం ఉమ్మి…పరిమళం వెదజల్లుతుంది

చిత్రంలో రాయిలా కనిపిస్తున్నది తిమింగలం ఉమ్మివేసిన పదార్థం (దీన్ని ఇంగ్లిష్‌లో అంబెగ్రీస్‌ అంటారు). దీని ధర చాలా ఎక్కువ. కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లా మురుడేశ్వర సమీప సముద్ర తీరలో ఓ జాలరికి లభించింది. అంతర్జాతీయ మార్కెట్‌లో తప్ప స్థానికంగా కొనేవారు ఉండరనే ఉద్దేశంతో ఆయన దీన్ని అటవీశాఖకు అప్పగించారు. ఆదివారం ఈ విషయం వెలుగులోకి వచ్చింది.‘అంబెగ్రీస్‌ను అత్యంత ఖరీదైన సుగంధ పరిమళాలు, లేపనాల తయారీలో వినియోగిస్తారు. స్పర్మ్‌ జాతి తిమింగలాలు ఉమ్మివేసిన పదార్థం మాత్రమే సుగంధ భరితంగా ఉంటుంది. సాధారణంగా తిమింగలాలు ఇతర జలచరాలతోపాటు స్క్విడ్‌, కటిల్‌ ఫిష్‌ తదితర జాతుల చేపల్ని ఆరగిస్తుంటాయి. వీటిల్లోని ఎముకలు జీర్ణంకాక జీర్ణాశయంలో వ్యర్థాలుగా మిగిలిపోతాయి. వ్యర్థాలు మలం రూపంలో వెలుపలికి వచ్చినా కొన్ని అక్కడే మిగిలిపోయి.. కొన్ని నెలల తర్వాత ముద్దగా మారతాయి. ఈ ముద్ద ఒక్కోసారి కిలో నుంచి 10 కిలోల వరకు బరువు ఉంటుంది. ఈ పరిమాణంలోని ముద్దను నోటి ద్వారా ఉమ్మివేస్తాయి. తిమింగలం కడుపులో నెలల తరబడి వివిధ రసాయన చర్యలకు గురవడం వల్ల సుగంధ పరిమళం వెదజల్లుతుంది. ఇది మైనం తరహాలో ఉంటుంది’ అని శాస్త్రవేత్తలు వెల్లడించారు.