Business

₹47వేల దిగువకు బంగారం-వాణిజ్యం

₹47వేల దిగువకు బంగారం-వాణిజ్యం

* స్టాక్‌ మార్కెట్‌ సూచీలు సోమవారం భారీ లాభాల్లో ముగిశాయి. ఉదయం సానుకూలంగా ప్రారంభమైన సూచీలు రోజంతా అదే జోరును కొనసాగించాయి. ఉదయం 48,197 వద్ద బలంగా ప్రారంభమైన సెన్సెక్స్‌ 48,667 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని.. 48,152 వద్ద కనిష్ఠాన్ని నమోదు చేసింది. చివరకు 508 పాయింట్ల లాభంతో 48,386 వద్ద ముగిసింది. నిఫ్టీ విషయానికి వస్తే 14,449 వద్ద సానుకూలంగా ప్రారంభమై 14,557 – 14,421 మధ్య కదలాడింది. చివరకు 147 పాయింట్ల లాభంతో 14,488 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.74 వద్ద నిలిచింది.

* కరోనాతో సతమతమవుతున్న భారత్‌కు.. కావాల్సిన సహకారం అందిస్తామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ హామీ ఇచ్చారు. కరోనా కట్టడిలో ఉపయోగపడే కీలక వైద్య పరికరాలు, ఇతర సరఫరాలను భారత్‌కు పంపనున్నామని తెలిపారు.

* అంతర్జాతీయ సానుకూల పవనాలతో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు సోమవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:26 గంటల సమయంలో సెన్సెక్స్‌ 591 పాయింట్ల లాభంతో 48,470 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 159 పాయింట్లు ఎగబాకి 14,501 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.80 వద్ద కొనసాగుతోంది.

* దేశంలో బంగారం ధ‌ర‌లు స్వ‌ల్పంగా దిగివ‌చ్చాయి. గ‌త వారం రూ.47 వేల మార్కును దాటిన బంగారం ధ‌ర‌లు ఇప్పుడు మ‌ళ్లీ రూ.47 వేల దిగువ‌కు వ‌చ్చింది. ఢిల్లీలో ఇవాళ తులం స్వ‌చ్ఛ‌మైన బంగారం ధ‌ర రూ.81 త‌గ్గి రూ.46,796కు చేరింది. క్రితం ట్రేడ్‌లో తులం స్వ‌చ్ఛ‌మైన బంగారం ధ‌ర రూ.47,057 వ‌ద్ద ముగిసింది.

* మారుతి సుజుకి మాజీ ఎండీ, కార్నేష‌న్ ఆటో ఇండియా వ్య‌వ‌స్ధాప‌కులు జ‌గ్దీష్ ఖ‌ట్ట‌ర్ (78) గుండె పోటుతో సోమ‌వారం మ‌ర‌ణించారు. 1993లో మార్కెటింగ్ డైరెక్ట‌ర్ గా మారుతిలో చేరిన ఖ‌ట్ట‌ర్ 1999లో సంస్థ ఎండీగా ఎదిగారు. సుజుకి మోటార్ కార్పొరేష‌న్ నామినీగా 2002లో కంపెనీ ఎండీగా తిరిగి నియ‌మితుల‌య్యారు. 2007లో ఆయ‌న ప‌ద‌వీవిర‌మ‌ణ చేసేంత వ‌ర‌కూ ప‌ద‌విలో కొన‌సాగారు.

* స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్బీఐ) లోన్‌ ఫైనాన్స్‌ కంపెనీ నుంచి లోన్‌ కావాలా? అని మీకు ఫోన్‌ వచ్చిందా?.. ఆయితే జాగ్రత్త. అలాంటి కంపెనీ ఏదీ తమ అనుబంధ సంస్థ కాదని ఎస్బీఐ తెలిపింది. ఎస్బీఐ లోన్‌ ఫైనాన్స్‌ పేరుతో లోన్లు ఆఫర్‌ చేస్తూ మోసాలకు పాల్పడుతున్న ఓ బోగస్‌ కంపెనీని గుర్తించారు. కొంత మంది గుర్తు తెలియని వ్యక్తులు ప్రజలను మోసం చేయడానికి ఎస్బీఐ లోన్‌ ఫైనాన్స్‌ పేరుతో తెగబడుతున్నారని తెలిపింది. ఒకవేళ బ్యాంకు నుంచి రుణం పొందాలనుకునేవారు నేరుగా బ్యాంకు శాఖను సంప్రదించవచ్చునని ఈ సందర్భంగా ఎస్బీఐ పేర్కొంది.