NRI-NRT

టాంటెక్స్ ఆధ్వర్యంలో 165వ నెలనెలాతెలుగువెన్నెల సదస్సు

టాంటెక్స్ ఆధ్వర్యంలో 165వ నెలనెలాతెలుగువెన్నెల సదస్సు

ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సాహిత్య సదస్సు నెలనెలా తెలుగు వెన్నెల ధారావాహికలో భాగంగా ఈ నెల 18న జరిగిన 165 వ సాహితీ సదస్సు ఆసక్తికరంగా సాగింది.

చిన్నారి మాడ సమన్విత పాడిన “హరి బోలా దేతా, హరి బోలా ఘేతా ” అన్న సంత్ ఏకనాథ్ రాసిన భజన కీర్తనతో సభ ప్రారంభమైంది. రామ నవమి శుభాకాంక్షలు తెలుపుతూ చిన్నారి సమన్విత “రామ జనార్థన రావణ మధన” అన్న ముత్తుస్వామి దీక్షితర్ వారి శంకరాభరణ రాగ నోటుస్వర గేయాన్ని ఆలపించింది. తదుపరి గేయంగా చిన్నారులు సాహితి వేముల, సిందూర వేముల “ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో!” అన్న సుప్రసిద్ధ దాశరథి వారి గేయాన్ని ఆలపించారు. గొప్ప సామాజిక సందేశం కలిగిన దాశరథి వారి గేయం చిన్నారుల నోట పలకడం సభికులను ఆకట్టుకుంది.

ఈ మాసపు సాహిత్య సభకు ముఖ్య అతిథిగా ఆచార్యులు దివాకర్ల రాజేశ్వరి విచ్చేశారు. ఉపద్రష్ట సత్యంగారు రాజేశ్వరిగారిని సభకు పరిచయం చేస్తూ వారి సాహిత్య జీవన ప్రస్థానాన్ని చక్కగా వివరించారు.బెంగళూరు విశ్వవిద్యాలయంలో “ప్రబంధ రూపాన్ని పొందిన సంస్కృత నాటకాలు” అన్న సిద్దాంత గ్రంథం రాసి పి హెచ్ డి పొందారు. నాలుగు దశాబ్దాలుగా కన్నడ, తెలుగు సాహిత్యాలకు తులనాత్మక వ్యాసాలు రాసి ఉభయ భాషా కవయిత్రిగా సృజనాత్మక పాత్ర పోషించారు. “భూమి తడిపిన ఆకాశం”, “నీరు స్థంభిచిన వేళ”, “నక్షత్ర దాహం” వంటి స్వీయ కవితా సంపుటులను, ఎన్ గోపి గారి “కాలాన్ని నిద్ర పోనివ్వను” అన్న తెలుగు కవితా సంపుటిని కన్నడ భాషాలోకి రాజేశ్వరి అనువాదం చేశారు. దివాకర్ల తిరుపతి శాస్త్రి, దివాకర్ల వేంకటావధాని వంటి గొప్ప పేరున్న అగ్రేసర సాహిత్యకారుల కుటుంబ నేపథ్యం ఒక వైపు, స్వీయ సాహిత్యజీవన సాఫల్యాలు మరో వైపు కలసి రాజేశ్వరి గారి సాహిత్య సేవను పరిపుష్టం చేశాయి.

రాజేశ్వరి ముఖ్య అతిథి ప్రసంగం చేస్తూ “ప్రబంధ యుగంలో స్త్రీ” అన్న అంశం పై ఎన్నో చారిత్రక, సాంస్కృతిక, సాహిత్య దృష్టి కోణాలన్నీ విస్తరిస్తూ సాధికారిక చర్చచేశారు. అధ్యాపకులుకుగా, కళాశాలలో తెలుగు శాఖాద్యక్షులుగా విస్తార అననభవం గల రాజేశ్వరి, కృష్ణ దేవరాయలు కాలంనాటి సాహిత్యాన్ని పరిమిత సమయంలోనే సమగ్రంగా విశ్లేషించారు. ప్రబంధ యుగ కవులు సమాజాన్ని మార్చాలనే ఆశయాన్ని కలిగిన ఉద్యమకారులు కాకపోవచ్చునే కాని, ఉత్తమ కావ్య లక్షణాలు ఏవైతే ఉండాలో అన్నిటిని సమస్తమూ రంగరించి గొప్ప కళా ప్రయోజనాన్ని సాధించిన సాంస్కృతిక యోధులని మాత్రం మనం గుర్తించి గర్వించాలని రాజేశ్వరి ప్రతిపాదించి తమ ప్రసంగం ద్వారా నిరూపించారు. ప్రబంధాలు తెలుగు భాషకు, తెలుగు వాడి సాంస్కృతిక చారిత్రక జీవన పథానికి చెందిన అమూల్య సంపదగా పరిగణించి విద్యార్థులకు బోధ చేయాలని పిలుపునిచ్చారు. రాజేశ్వరి ప్రసంగాన్ని విస్తరిస్తూ వరూధిని, గోదాదేవి నుండి మొదలుకొని సోమిదమ్మ వరకూ సాగిన వివిథ ప్రబంధ యుగ స్త్రీ పాత్రలకు కావ్యకర్తలు ఆపాదించిన వ్యక్తిత్వాలను చారిత్రక, సామాజిక విలువల దృష్టి కోణం నుండి చూపించారు. రాజేశ్వరి అద్భుత ప్రసంగానికి సభికులు సహృదయంతో స్పందించి ధన్యావాదాలు తెలిపారు.

ప్రధాన వక్త ప్రసంగానికి ముందు ప్రతీ మాసం ఎంతో ఆదరణ పొందుతున్న “మనతెలుగు సిరి సంపదలు” ధారావాహికలో భాగంగా ఉరుమిండి నరసింహా రెడ్డి కొన్ని పొడుపుకథలు, జాతీయాలు, ప్రహేళకలు ప్రశ్నలు జవాబుల రూపంలో సంధిస్తూ సదస్యులను చర్చలో భాగస్వాములును చేశారు. తరువాత లెనిన్ వేముల మాట్లాడుతూ డాక్టర్ దివాకర్ల వేంకటావధానిగారు సిద్దాంత గ్రంథంగా రాసిన “ఆంధ్ర వాఙ్మయారంభ దశ” అనే పరిశోథనను గూర్చి వివరించారు. ఆది కవి నన్నయ్యకు పూర్వం వేయబడిన వందల సంఖ్యలో ఉన్న శాసనాలను పరిశీలించి, వాటి లో ప్రయోగించబడిన భాషాపదాలకు ఛందస్సుకూ నన్నయ్యగారి మహాభారత కావ్యంలో వాడబడిన పదాలకు, ఛందస్సుకు ఉన్న తోడాలను, పోలికలను శాస్త్రీయ దృష్టి తో దివాకర్ల చేసిన పరిశోధనను లెనిన్ వేముల శ్లాఘించారు.

తరువాతి అంశంగా మాడ దయాకర్ పుస్తక పరిచయం చేస్తూ సుప్రసిద్ద పరిశోకులు, గేయ రచయిత ఆరుద్రగారు రచించిన “రాముడికి సీత ఏమైతుంది”అన్న నవల ఎందుకు విశిష్ఠమైనదో వివరించారు. రామాయణ కథలలోని పాత్రలు, వాటి మధ్య సంబంధాలు కేవలం భారత సమాజంలో మనముందు చూపి చెప్పబడేవే కాక ఇతర మతాలైన జైన బౌద్ద విశ్వాసాలపై అవి చూపిన ప్రభావం , పాత్రల సంబంధా లలోని భినత్వం ఏ విధంగా ఉన్నాయో వివరించేది ఆరుద్రగారి నవల అని చెప్పారు. ఉదాహరణకు పలు మతాల, సంస్కృతుల, దేశాల వారు రాముడి సీతకు మధ్య బంధాన్ని కొందరు భార్యా భర్తలుగా మరి కొందరు సోదర సంబంధంగా చెప్పారు. ఇన్ని మత సంస్కృతులలో ఎవరు ఏది చెప్పారో అన్న పరిశీలన చేసిన నవలగా ఆరుద్ర రచన మిగులుతుందని దయాకర్ వివరించారు. తరువాతి అంశంగా మద్దుకూరి చంద్రహాస్ “కలలో ఇలలో కరోనా” అన్న స్వీయ కవితను వినిపించారు. చైత్రలక్ష్మి ప్రత్యక్షమై త్వరలో కరోనా విముక్తి జరుగునన్న ఆమె సందేశం వినిపించగా, కలలో ఆమెతో జరిపిన ఆశావహ సంభాషణను సాంప్రదాయ ఛందస్సునూ, వచన, గేయ రీతులను సమపాళ్ళలో ప్రయోగించి శ్రోతలను చంద్రహాస్ తన కవిత ద్వారా మెప్పించారు.

చివరి అంశంగా ఉపద్రష్ట సత్యం “పద్య సౌగంధం” శీర్షికన రాయల వారి అష్టదిగ్గజ కవులలో ఒకరైన పింగళి సూరన రచించిన “కళా పూర్ణోదయం” కావ్యంలోని “ఆ కొమరున్ ప్రాయపు గబ్బి గుబ్బెతలు”, “భళిరా సత్కవివౌదు నిక్కమ తగన్ భావించ” అన్న రెండు పద్యాలను తాత్పర్య సహిత విశేషాలతో వివరించారు. నారద మునీంద్రల వారు, మణికంధరుడు ఆకశయానం చేసి భూలోకంపై వాలుతున్నపుడు ఊయలలూగుతూ పాదాలు ఆకాశానికెత్తిన యువతులను చూసి కవితావేశాన్ని పొంది చేసిన చక్కటి రసభావగుంభిత సంభాషణయే ఈ రెండు పద్యాలు. ఆ ఆకాశంలోకి రువ్విన పాదాలు దేవతా స్త్రీలతో సౌంధర్య విషయంలో కయ్యానికి కాలు దువ్వతున్నాయా అన్నట్లున్నాయని మణికంధరుడంటే, కయ్యమేమిటి అసలు ఆ దేవతా స్త్రీల అందాన్ని తలదన్నే విధందా ఉన్నాయని నారదుల వారి చేత పలికించిన కవీంద్రులు పింగళి సూరన గొప్ప ప్రావీణ్యం గల కవిగా ఉపద్రష్ట వారు ఎత్తిచూపి చెప్పారు

ఈ కార్యక్రమానికి సంఘం అధ్యక్షులు లక్ష్మి పాలేటి, నెల నెలా తెలుగు వెన్నెల సాహిత్య సదస్సు సమన్వయకర్త నీరజా కుప్పాచి తదితర కార్వవర్గ సభ్యులు, పాలక మండలి సభ్యులు , స్థానిక సాహిత్య ప్రియులు హాజరయ్యారు. వారు ముఖ్య అతిథి ఘంటశాల నిర్మల గారికి, ప్రార్థనా గీతం పాడిన సమన్విత తోపాటు ముఖ్య అతిథి దివాకర్ల రాజేశ్వరిగారికి, కార్యక్రమంలో పాల్గొన్న సాహిత్య అభిమానులకు ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం కార్యవర్గం, పాలక మండలి తరుఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.