NRI-NRT

భారీగా క్షీణించిన మారుతీ లాభాలు-వాణిజ్యం

Maruti Profits Shrink By Seven Percent - Business News

* కోవిడ్-19 మహమ్మారి బెడద దేశీయ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకిని పట్టి పీడిస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో కరోనా మహమ్మారి కారణంగా అమ్మకాలతో భారీగా దెబ్బతిన్నాయి. దీంతో క్యు4లో ఫలితాలు మార్కెట్‌ అంచనాలను అందుకోలేకపోయాయి. 2021 ఆర్ధిక సంవత్సరంలో 25.1 శాతం క్షీణితతో నికర లాభం రూ.4,229.7 కోట్లుగా ఉందని కంపెనీ మంగళవారం వెల్లడించింది. అలాగే ఆదాయం 7.2శాతం క్షీణించి రూ.66562 కోట్లకి పరిమితమైంది. మరోవైపు కంపెనీ బోర్డు ఒక్కో షేరుకు రూ.45 మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది.

* భారత్‌లో స్టార్టప్‌ కంపెనీలు దూసుకెళ్తున్నాయి. ఇప్పటికే పలు స్టార్టప్‌ కంపెనీలు యూనికార్న్‌ క్లబ్‌లోకి చేరగా, ఈ సారి 2021 మొదటి నాలుగు నెలల్లో మరో ఐదు స్టార్టప్‌ కంపెనీలు యునికార్న్ క్లబ్‌లోకి ప్రవేశించాయి. మీషో, గ్రోవ్‌, షేర్‌చాట్‌, ఏపీఐ హోల్డింగ్స్‌, గప్‌షుప్‌ కంపెనీలు యూనికార్న్‌ కంపెనీలుగా అవతారమెత్తాయి. ప్రస్తుతం ఈ కంపెనీల వాల్యూ సుమారు ఒక బిలియన్‌ డాలర్ల వరకు చేరింది.

* భారతదేశంలోని చాలా ఐటి కంపెనీలు కోవిడ్ కేర్ సదుపాయాలను తమ ఉద్యోగులకు కల్పిస్తున్నాయి. దేశంలో సెకండ్ వేవ్ తీవ్రంగా కొనసాగుతున్న నేపథ్యంలో తమ ఉద్యోగుల ఆరోగ్యంపై శ్రద్ద కనబరుస్తున్నాయి. కరోనా సోకిన ఉద్యోగులకు 21 రోజుల పాటు వేతనంతో కూడిన సెలవులను అందిస్తున్నట్లు ఇన్ఫోసిస్ పేర్కొంది. అలాగే, పూణే, బెంగళూరు నగరాలలో నివసిస్తున్న ఉద్యోగులు, వారి కుటుంబల కోసం కొవిడ్ కేర్ సెంట‌ర్ల‌ను ఏర్పాటు చేసింది. పూణేలోని రూబీ హాల్ ఆసుపత్రి, బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రిని కోవిడ్ కేంద్రాలుగా మార్చింది.

* దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో టెక్‌ దిగ్గజం ఆపిల్ స్పందించింది. మహమ్మారి నివారణ కోసం ప్రభుత్వం తీసుకుంటున్న సహాయక చర్యలకు టెక్ దిగ్గజం సహకరిస్తుందని ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ ప్రకటించారు. “భారతదేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో వైద్యులు, కార్మికులు, యాపిల్ కుటుంబం సహా భయంకరమైన ఈ మహమ్మారితో పోరాడుతున్న ప్రతి ఒక్కరి గురుంచి ఆలోచిస్తున్నాం. క్షేత్రస్థాయిలో కొనసాగుతున్న సహాయక చర్యలకు మద్దతుగా ఆపిల్ విరాళం ఇవ్వనుంది’’ అని టిమ్‌ కుక్‌ ట్విటర్‌ ద్వారా ప్రకటించారు.

* స్వల్ప, మధ్యస్థ లక్షణాలతో ఉన్న కొవిడ్‌-19ను అదుపు చేసే ఔషధంగా పేర్కొంటున్న మోల్నుపిరవిర్‌పై మూడో దశ క్లినికల్‌ పరీక్షలకు హైదరాబాద్‌కు చెందిన ఫార్మా సంస్థలు సిద్ధం అవుతున్నాయి. ఇన్‌ఫ్లుయంజా వ్యాధి చికిత్సలో ఉపయోగిస్తున్న మోల్నుపిరవిర్‌ను కొవిడ్‌-19 పాజిటివ్‌ వచ్చిన వారిపై వినియోగించేందుకు ప్రపంచ వ్యాప్తంగా ‘రీపర్పసింగ్‌’ పద్ధతిలో పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో నాట్కో ఫార్మా మూడో దశ క్లినికల్‌ పరీక్షలను నిర్వహించేందుకు సమాయత్తం అవుతోంది. ఇందులో భాగంగా ఈ ఔషధాన్ని ప్రాణాపాయ స్థితిలో ఉన్న కొవిడ్‌-19 రోగులకు అందించి, చికిత్సలో వినియోగించేందుకు ప్రయత్నిస్తోంది. ఇందుకోసం అనుమతులు కోరుతూ.. సెంట్రల్‌ డ్రగ్‌ స్టాండర్డ్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌ (సీడీఎస్‌సీఓ)కు దరఖాస్తు దాఖలు చేసినట్లు సోమవారం తెలిపింది. ఇప్పటిదాకా రెండు దశల్లో నిర్వహించిన ప్రీ క్లినికల్‌ పరీక్షల్లో అంచనాలకు మించి ఫలితాలు వచ్చినట్లు వెల్లడించింది. మోల్నుపిరవిర్‌ ద్వారా చికిత్స అందించినప్పుడు 5 రోజుల వ్యవధిలో సత్ఫలితాలు కనిపిస్తాయని, నోటి ద్వారా అందించే చికిత్స కావడం వల్ల రోగులకు ఇబ్బందులూ తగ్గుతాయని పేర్కొంది. కొవిడ్‌-19 రెండో దశ తీవ్రంగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఈ ఔషధానికి సీడీఎస్‌సీఓ అత్యవసర వినియోగ అనుమతిని ఇస్తుందని తాము ఆశిస్తున్నట్లు పేర్కొంది. అనుమతి లభిస్తే.. నెల రోజుల్లోపు ఈ ఔషధాన్ని విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించింది.

* అతి పెద్ద ప్రైవేట్ బ్యాంకుల్లో ఒకటయిన యాక్సిస్ బ్యాంక్ 2020-21 ఆర్థిక సంవత్సరంలో మార్చితో ముగిసిన త్రైమాసికంలో నికర లాభం రూ.2,677 కోట్లుగా నమోదైంది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో బ్యాంకు రూ.1,388 నికర నష్టాల్ని చవిచూసింది. బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం ఈసారి 11 శాతం పెరిగి రూ.7,555 కోట్లకు చేరుకుంది. అంకుముందు ఏడాది ఇది రూ.6,808 కోట్లుగా ఉంది.