Business

బిగ్‌బాస్కెట్ కొనుగోలుకు టాటాలకు లైన్ క్లియర్-వాణిజ్యం

Line Cleared For TATAs To Purchase BigBasket

* ఆన్‌లైన్‌ గ్రాసరీ దిగ్గజం బిగ్‌బాస్కెట్‌ను దక్కించుకోవడానికి టాటా డిజిటల్స్‌కు మార్గం సాఫీ అయ్యింది. గురువారం ఈ కొనుగోలుకు భారత కాంపిటిషన్స్‌ కమిషన్ ఆఫ్‌ ఇండియా ఆమోద ముద్ర వేసింది. దీంతో టాటా డిజిటల్‌ సంస్థ సూపర్‌ మార్కెట్‌ గ్రాసరీ సప్లైస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌(ఎస్‌జీఎస్‌)లో 64.3శాతం వాటాను కొనుగోలు చేయవచ్చు. ఎస్‌జీఎస్‌ సంస్థ బిగ్‌బాస్కెట్‌ను నియంత్రిస్తున్న ఇన్నోవేటీవ్‌ రిటైల్‌ కాన్సెప్ట్స్ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో వాటాలను కొనుగోలు చేయడానికి మార్గం సుగమం అయింది.

* కరోనా వ్యాక్సిన్‌ ధరలపై విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమవుతోంది. ప్రజలపై భారం తగ్గించేలా టీకాలపై కేంద్ర ప్రభుత్వం వస్తు, సేవల పన్ను(జీఎస్‌టీ) తొలగించే అవకాశాలున్నట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. దీని వల్ల టీకా ధరలు తగ్గితే ఎక్కువ మంది ప్రయివేటుగా వ్యాక్సిన్‌ వేయించుకునేందుకు ముందుకొస్తారని కేంద్రం భావిస్తున్నట్లు సమాచారం. అయితే, దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు.

* దేశీయ స్టాక్‌ మార్కెట్లు గురువారం లాభనష్టాల మధ్య ఊగిసలాడాయి. మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్‌ 32 పాయింట్ల లాభంతో 49,765 వద్ద, నిఫ్టీ 30 పాయింట్ల లాభంతో 14,894 స్థిరపడ్డాయి. ఉదయం భారీ లాభాల్లో మొదలైన మార్కెట్లు మెల్లగా నష్టాల్లోకి జారుకొన్నాయి. చివరకు కోలుకొని లాభాల్లోకి వచ్చాయి. మంగళూరు రిఫైన్‌, ఎక్సెలియా సొల్యూషన్స్‌, జేఎస్‌డబ్ల్యూ, మేగమణి ఆర్గానిక్స్‌, సెయిల్‌ షేర్లు లాభాల్లో ఉండగా.. బీఎఫ్ ఇన్వెస్ట్‌మెంట్స్‌, సింగ్ని ఇంటర్నేషనల్‌, క్రాప్టన్‌ గ్రీవ్‌స్‌, స్పందన స్ఫూర్తి ఫినాన్స్‌ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.

* చాలా కాలంగా మంచి స్మార్ట్ ఫోన్ కొనాలని అనుకుంటుండగా, అకస్మాత్తుగా ఒక ఆన్ లైన్ స్టోర్ లో మీకు నచ్చిన స్మార్ట్ ఫోన్ ను చూశారు. అది పండగ సీజన్ కావడంతో ఆ ఫోన్ పై సుమారు 40 నుంచి 45 శాతం మేర తగ్గింపు కూడా లభిస్తుండ‌డంతో వెంటనే దానిని కొనుగోలు చేయాలని నిర్ణయించుకుంటారు. అన్ని డిస్కౌంట్ లు పోగా దాని ధర రూ. 35,594 గా ఉంది. అలాగే మీరు ‘బై నౌ’ ఆప్షన్ కింద ఒక చిన్న లైన్ ని కూడా గమనించారు. అదేంటంటే, క్రెడిట్ కార్డు ద్వారా నెలకు సుమారు రూ. 1,700 నుంచి మొదలుకొని సమానమైన నెలవారీ వాయిదాలలో (ఈఎమ్‌ఐ) ఈ స్మార్ట్ ఫోన్ ను కొనుగోలు చేయవచ్చు. మీరు వెంటనే కొనుగోలు చేయకుండా, ఒక్క నిమిషం అలోచించి ఇది ఎలా పని చేస్తుందో తెలుసుకోండి. సాధారణంగా కొంతమంది కేవలం ఈఎమ్‌ఐ మొత్తం మాత్రమే క్రెడిట్ కార్డు నుంచి డిడక్ట్ అవుతుందని భావిస్తారు, కానీ మీరు చేసిన లావాదేవీ మొత్తం ముందుగా మీ క్రెడిట్ కార్డు నుంచి డిడెక్ట్ అవుతుంది. అనంతరం ఈ మొత్తం ఈఎమ్‌ఐ కింద మారుతుంది. ఉదాహరణకు మీ క్రెడిట్ కార్డు పరిమితి రూ. 75,000 అనుకుంటే, మీరు స్మార్ట్ ఫోన్ ను కొనుగోలు చేయడానికి రూ. 35,594 ఖర్చు చేశారు. అనంతరం మీ కార్డులో కేవలం రూ. 40,000 మాత్రమే అందుబాటులో ఉంటుంది. దీంతో మీ భవిష్యత్తు అవసరాలకు ఆచి తూచి వ్యవహరించాల్సి ఉంటుంది. ఉదాహరణకు, ఈ క్రెడిట్ కార్డును ఉపయోగించి మీరు కొన్ని నెలల పాటు విదేశాల్లో విహారయాత్రకు వెళ్లాలని అనుకున్నట్లైతే, అప్పుడు మీరు మీ ఆర్ధిక అవసరాలను పునఃనిర్మించుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే మీ క్రెడిట్ పరిమితి సుమారు సగానికి తగ్గిపోయింది.

* 2020-21 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికం లాభాలను హిందూస్థాన్‌ యూనిలీవర్‌ సంస్థ ప్రకటించింది. ఈ ఏడాది ఏకీకృత నికరలాభం రూ.2,143కోట్లుగా వెల్లడించింది. గతేడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే 41.07వృద్ధి చెందింది. కంపెనీ గతేడాది ఇదే సీజన్‌లో రూ.1,519 కోట్ల లాభాన్ని నమోదు చేసింది. ఇక గత త్రైమాసంలో సంస్థ రూ.1,921 కోట్ల లాభాన్ని సంపాదించింది.