NRI-NRT

అంతర్జాతీయ సర్వీసులపై నిషేధాన్ని పొడిగించిన భారత్-తాజావార్తలు

India Bans International Flights Until May 31st

* బుర్రవున్న వారెవరైనా ఈ సమయంలో పరీక్షలు నిర్వహిస్తారా? అని కేఏ పాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పరీక్షలు రద్దు కోరుతూ పాల్ చేపట్టిన దీక్ష రెండవ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రికి, విద్యాశాఖ మంత్రికి మతిలేదా? అని ప్రశ్నించారు. ‘‘మీ పనికిమాలిన విద్యాశాఖ మంత్రి మాటను.. జగన్ వినవద్దు ..విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి?’’ అని డిమాండ్ చేశారు. జగన్ తనసొంత కూతుర్లును పరీక్షలు రాయడానికి కోవిడ్ హాల్లోకి పంపిస్తారా? అని నిలదీశారు. తాను చేస్తోన్న దీక్షకు, జీవించి వుంటే రాజశేఖర్ రెడ్డి వచ్చి ఉండేవారని తెలిపారు. మే 3 న జరిగే వాయిదాలో పరీక్షలు వాయిదా పడతాయన్న విశ్వాసం తనకుందని ధీమా వ్యక్తం చేశారు. అప్పటి వరకూ ఆమరణ దీక్ష కొనసాగిస్తానని తెలిపారు. ‌‌‌‘‘నన్ను అరెస్టు చేస్తారా? నన్ను చంపుతారా? ఏదైనా చేసుకోండి..దేనికి నేను భయపడను’’ అని కేఏ పాల్ తేల్చిచెప్పారు.

* దేశాన్ని కరోనా సెకండ్‌ వేవ్‌ కుదిపేస్తున్న వేళ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేధాన్ని మరోసారి పొడిగించింది. ప్రస్తుతం కొనసాగుతున్న ఈ నిషేధాన్ని మే 31వరకు పొడిగిస్తున్నట్లు పేర్కొంది. ఈ మేరకు డీజీసీఏ జాయింట్‌ డైరెక్టర్‌ జనరల్‌ సునీల్‌కుమార్‌ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. అయితే, కార్గో సర్వీసులకు ఇది వర్తించదన్నారు. అలాగే, డీజీసీఏ ఇప్పటికే ఎంపిక చేసిన మార్గాల్లో విమాన సర్వీసులు నడుస్తాయని ప్రకటనలో ఆయన స్పష్టంచేశారు.

* విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే పది, ఇంటర్ పరీక్షలను నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. పరీక్షల నిర్వహణ వల్ల జరిగే ప్రయోజనాలు సహా ఏ పరిస్థితుల్లో వీటిని నిర్వహిస్తున్నామనే విషయాన్ని అందరికీ తెలియజేయాలన్నారు. పరీక్షల నిర్వహణకు విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సహకారం అందించాలన్నారు. ఇంటర్, పది పరీక్షల నిర్వహణపై సంబంధిత అధికారులతో సీఎం సమీక్షించారు. నిన్న కేరళ రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షలు పూర్తి చేశారన్నారు. పది, ఇంటర్‌ పరీక్షల నిర్వహణపై కేంద్రం ఏ విధానాన్ని ప్రకటించలేదని.. నిర్ణయాధికారాన్ని ఆయా రాష్ట్రాలకే వదిలేసిందని తెలిపారు. దీంతో కొన్ని రాష్ట్రాలు పరీక్షలు నిర్వహిస్తుండగా, మరి కొన్ని రాష్ట్రాలు పరీక్షలను రద్దు చేసినట్లు వివరించారు.

* దేశ రాజధాని దిల్లీలో నెలకొన్న కరోనా ఉద్ధృతి పరిస్థితులపై అధికార పార్టీ ఆప్‌ ఎమ్మెల్యే షోయబ్‌ ఇక్బాల్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. మహమ్మారి కట్టడిలో ప్రభుత్వం విఫలమైందని.. వెంటనే రాష్ట్రపతి పాలన విధించేందుకు ఆదేశాలు జారీ చేయాలని దిల్లీ హైకోర్టును కోరారు. ఈ మేరకు ఆయన శుక్రవారం వీడియో సందేశం విడుదల చేశారు.

* మే 1వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా మూడో దశ వ్యాక్సినేషన్‌ పంపిణీ ప్రారంభిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ దశలో 18 ఏళ్ల వయసు పైబడిన వారందరికీ టీకా ఇస్తామని పేర్కొంది. ఇందుకోసం ఈ నెల 28వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్‌ చేసుకునేందుకు వీలు కల్పించింది. దీంతో గడిచిన రెండు రోజుల్లోనే 2.4కోట్ల మంది రిజిస్ట్రేషన్‌ చేసుకున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

* తెలంగాణలో ప్రస్తుతం అమల్లో ఉన్న రాత్రి కర్ఫ్యూను రాష్ట్ర ప్రభుత్వం మరో వారం పొడిగించింది. మే 8 ఉదయం 5 గంటల వరకు రాత్రి కర్ఫ్యూని పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. కరోనా ఉద్ధృతి దృష్ట్యా ఈ నెల 20వ తేదీ నుంచి రాష్ట్రంలో రాత్రిపూట కర్ఫ్యూ విధించింది. అది శనివారం ఉదయం 5 గంటలకు ముగియనుంది. ప్రస్తుతం కేసుల సంఖ్య మరింత పెరిగినందున మరికొన్ని రోజులు కర్ఫ్యూ కొనసాగించాలనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది. బుధవారం హోంమంత్రి మహమూద్‌ అలీ సైతం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించి రాష్ట్రంలోని పరిస్థితులు తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) సోమేశ్‌కుమార్‌ కర్ఫ్యూ పొడిగింపు ఉత్తర్వులు జారీ చేశారు. ఆదేశాలను పూర్తి స్థాయిలో అమలు చేయాలని జిల్లా కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలను సీఎస్ ఆదేశించారు.

* దేశంలో కరోనా సంక్షోభం.. నిర్వహణ అంశంపై దాఖలైన సుమోటో కేసుపై సుప్రీంకోర్టు శుక్రవారం విచారణ ప్రారంభించింది. వ్యాప్తి కట్టడి, వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో కేంద్రం అనుసరిస్తున్న తీరుపై ఒకింత అసహనం వ్యక్తం చేసిన న్యాయస్థానం.. కేంద్రానికి పలు ప్రశ్నలు సంధించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రెండేసి టీకా ధరలు ఎందుకు అని ప్రశ్నించిన జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం.. అసలు 100శాతం వ్యాక్సిన్లను కేంద్రమే ఎందుకు కొనుగోలు చేయట్లేదని అడిగింది.

* తెలంగాణలో మినీ పురపోరు ఎన్నికల పోలింగ్‌ ముగిసింది. రెండు నగరపాలికలు, ఐదు పురపాలికల్లో పోలింగ్‌ ప్రశాంతంగా జరిగింది. గ్రేటర్‌ వరంగల్‌, ఖమ్మం కార్పొరేషన్లు సహా సిద్దిపేట, అచ్చంపేట, జడ్చర్ల, నకిరేకల్‌, కొత్తూరు పురపాలికల్లో పోలింగ్‌ సజావుగా సాగింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ సాయంత్రం 5 గంటలకు కొనసాగింది. ఇప్పటికే క్యూ లైన్లలో వేచిఉన్న ఓటర్లకు ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు. మే 3వ తేదీన మినీ పురపోరు ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
* రాయలసీమలో ఎండల తీవ్రత కొనసాగింది. గురువారం ఆళ్లగడ్డ, తాడిపత్రి, కొండాపురంలో 41.3-41.8 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

* ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా జగన్ ప్రభుత్వం మార్చిందని టీడీపీ అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ విమర్శించారు.

* భారత అటార్నీ జనరల్‌గా రెండు సార్లు సేవలందించిన ప్రముఖ లాయర్ సొలి సొరాబ్జీ మరణించారు.కొవిడ్‌తో బాధపడుతున్న 91ఏళ్ల సొరాబ్జీ దిల్లీలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.1930లో ముంబయిలో జన్మించిన సొలీ సొరాబ్జీ 1953 నుంచి బాంబే హైకోర్టులో లాయర్‌గా ప్రాక్టీస్ మొదలుపెట్టారు.1971 నుంచి సుప్రీంకోర్టులో డెసిగ్నేటెడ్ సీనియర్ కౌన్సిల్‌గా కొన్నేళ్ల పాటు సేవలందించారు.పద్మవిభూషణ్ అవార్డు కూడా అందుకున్న సొలి సొరాబ్జీ 1989లో మొదటిసారి అటార్నీ జనరల్‌గా సేవలందించారు.ఆ తర్వాత 1998 నుంచి 2004 వరకు రెండో సారి అటార్నీ జనరల్‌గా పనిచేశారు.1997లో సొరాబ్జీని నైజీరియాకు ప్రత్యేక యూఎన్​ ప్రతినిధిగా ఐక్యరాజ్యసమితి నియమించింది.

* ఇంటర్, టెన్త్ పరీక్షలపై ఏపీ హైకోర్టులో సుదీర్ఘ విచారణ.ఇంటర్ పరీక్షలపై ప్రభుత్వం పునపరిశీలన చేసుకోవాలి .పిటిషనర్ల తరపున సీనియర్ కౌన్సిల్ చేసిన వాదనలో చాలా అంశాలు ముడిపడి ఉన్నాయి .దాదాపు 30 లక్షల మంది విద్యార్థులు, తల్లిదండ్రులు, టీచర్లు పరీక్షల్లో భాగం కావాల్సి ఉంది .అందువల్ల ప్రభుత్వం వెంటనే పునపరిశీలన చేసుకోవాలి .మే 3వ తేదీకి కేసు విచారణ వాయిదా వేస్తున్నాం.అదే రోజు ప్రభుత్వ అభిప్రాయం చెప్పాలి .కోవిడ్ వచ్చిన విద్యార్థులు పరీక్షలు ఎలా రాస్తారు? .నిబంధనల ప్రకారం హోం ఐసోలేషన్ లో ఉండాలి కదా? .వారికి ప్రత్యేకంగా పరీక్షలు నిర్వహిస్తామన్న ప్రభుత్వ న్యాయవాది .అదెలా సాధ్యం అవుతుందని ప్రశ్నించిన ఏపీ హైకోర్టు .కోవిడ్ వచ్చిన వారు మానసికంగా పరీక్ష రాయగలుగుతారా? .ఇతర రాష్ట్రాల్లో పరీక్షలు వాయిదా లేదా రద్దు చేసిన విషయంతోపాటు.. రాష్ట్రంలో కేసులు పెరుగుతున్న విషయాన్ని పరిగణనలోకి తీసుకోండి ….–హైకోర్టు

* కోవిడ్-19 మహమ్మారి విలయం నేపథ్యంలో సామాజిక మాధ్యమాలు లేదా ఇతర విధాలుగా సాయం కోరేవారిపై చర్యలు తీసుకుంటే కోర్టు ధిక్కారంగా పరిగణిస్తామని సుప్రీంకోర్టు హెచ్చరించింది. ప్రజల గళాన్ని విందామని, సమాచారాన్ని అణచిపెట్టవద్దని కోరింది. మన దేశంలో ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలు 70 ఏళ్ళనాటివని, ప్రస్తుత ప్రొసీడింగ్స్ కేంద్ర ప్రభుత్వాన్ని కానీ, రాష్ట్ర ప్రభుత్వాలను కానీ విమర్శించడానికి కాదని వివరించింది. కేవలం ప్రజల ఆరోగ్యం పట్ల మాత్రమే తాము శ్రద్ధ చూపుతున్నామని, తప్పొప్పులను నిర్ణయించేందుకు కాదని స్పష్టం చేసింది.

* దేశాన్ని కరోనా సెకండ్‌ వేవ్‌ కుదిపేస్తున్న వేళ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేధాన్ని మరోసారి పొడిగించింది. ప్రస్తుతం కొనసాగుతున్న ఈ నిషేధాన్ని మే 31వరకు పొడిగిస్తున్నట్లు పేర్కొంది. ఈ మేరకు డీజీసీఏ జాయింట్‌ డైరెక్టర్‌ జనరల్‌ సునీల్‌కుమార్‌ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. అయితే, కార్గో సర్వీసులకు ఇది వర్తించదన్నారు. అలాగే, డీజీసీఏ ఇప్పటికే ఎంపిక చేసిన మార్గాల్లో విమాన సర్వీసులు నడుస్తాయని ప్రకటనలో ఆయన స్పష్టంచేశారు.

* అమెరికా నుంచి బయల్దేరిన అత్యవసర సహాయం, పరికరాలు నేడు భారత్‌ చేరుకొన్నాయి. ఈ విషయాన్ని భారత్‌లోని అమెరికా దౌత్య కార్యాలయం ట్విటర్లో వెల్లడించింది. ‘‘కొవిడ్‌తో పోరాడేందుకు అవసరమైన అత్యవసర పరికరాలు, ఇతర సాయంలో అవసరమైన తొలివిడత షిప్‌మెంట్‌ భారత్‌కు చేరింది. భారత్‌-అమెరికాలు కొవిడ్‌పై ఉమ్మడిగా పోరాడతాయి’’ అని పేర్కొంది. దీనికి #USIndiaDosti అనే హ్యాష్‌ట్యాగ్‌ ఇచ్చింది.