Politics

ఆసుపత్రికి కేటీఆర్ తరలింపు-తాజావార్తలు

ఆసుపత్రికి కేటీఆర్ తరలింపు-తాజావార్తలు

* తెలంగాణ ఐటీ, పురపాల శాఖ మంత్రి కేటీఆర్ కు గత నెల 23న కరోనా పాజిటివ్ అని వెల్లడైన సంగతి తెలిసిందే. స్వల్ప లక్షణాలతో బాధపడుతున్న ఆయన అప్పటినుంచి హోం ఐసోలేషన్ లోనే ఉన్నారు. అయితే, గత రెండ్రోజులుగా అధిక జ్వరంతో బాధపడుతుండడంతో ఆయనను గత రాత్రి హైదరాబాదులోని యశోద ఆసుపత్రికి తరలించారు. ఆక్సిజన్ లెవల్స్ కూడా హెచ్చుతగ్గులకు గురవుతుండడంతో డాక్టర్ల సలహా మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం కేటీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు తెలుస్తోంది. కాగా, తమ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆరోగ్యంపై టీఆర్ఎస్ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది.

* తెలంగాణ ఆరోగ్యమంత్రి ఈటల రాజేందర్ కు ముఖ్యమంత్రి కేసీఆర్ మరో షాక్ ఇచ్చారు. భూకబ్జా ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఆయన శాఖపై కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖను ముఖ్యమంత్రి తనకు అటాచ్ చేసుకున్నారు. ఈ మేరకు సీఎం చేసిన సిఫారసుకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆమెదముద్ర వేశారు. గవర్నర్ ఆమోదముద్రతో శాఖ లేని మంత్రిగా ఈటల మిగిలిపోయారు. మరోవైపు, తనపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో నిన్నటి నుంచి ఈటల తన విధులకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే.

* తమిళనాడు పీఠం డీఎంకే కూటమిదేనంటూ పలు ఎగ్జిట్స్‌ పోల్స్‌ అంచనాలపై ఆ పార్టీ చీఫ్‌ స్టాలిన్‌ స్పందించారు. అధిక సీట్లతో డీఎంకే గెలుస్తుందన్న ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలు ఎంతో సంతోషాన్నిస్తున్నాయన్నారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులకు కీలక విజ్ఞప్తి చేశారు. రాష్ట్రం కరోనా ఉద్ధృతి దృష్ట్యా మే 2న లెక్కింపు కేంద్రాల వద్ద పార్టీ కార్యకర్తలు గుంపులుగా గుమిగూడొద్దని కోరారు. విజయోత్సవ వేడుకలను ఎవరి ఇంట్లో వారే చేసుకోవాలని రాజకీయ పార్టీల కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రం కొవిడ్‌ గుప్పిట్లో చిక్కుకుందని, అనేకమంది ప్రజలు ఆక్సిజన్‌, పడకలు లేక అవస్థలు పడుతున్నారంటూ ఆవేదన వ్యక్తంచేశారు.

* తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌పై వచ్చిన భూ కబ్జా ఆరోపణలకు సంబంధించి మెదక్‌ జిల్లా అచ్చంపేటలో అ.ని.శా., విజిలెన్స్‌ అధికారులు ఈ ఉదయం విచారణ ప్రారంభించారు. మంత్రిపై ఫిర్యాదులు చేసిన రైతుల నుంచి అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. ఈటల అసైన్డ్‌ భూముల కబ్జా చేశారని నిన్న సీఎం కేసీఆర్‌కు రైతులు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రైతుల ఫిర్యాదుపై కేసీఆర్‌ సమగ్ర విచారణకు ఆదేశించారు. ఈ మేరకు విచారణలో విజిలెన్స్ ఎస్పీ మనోహర్‌ పాల్గొన్నారు.

* కర్ణాటకలో బీజేపీకి భారీ షాక్ తగిలింది. గత నెల 27న కార్పొరేషన్లు, నగరసభ, పట్టణ పంచాయతీ, పురసభకు జరిగిన ఎన్నికల్లో అధికార బీజేపీకి ఘోర పరాభవం ఎదురైంది. 8 జిల్లాల్లోని 10 స్థానిక సంస్థల్లో 263 వార్డులకు ఎన్నికలు జరగ్గా కాంగ్రెస్ 120 స్థానాల్లో జయభేరి మోగించింది. ఆశ్చర్యకరంగా బీజేపీ కంటే జేడీఎస్ మెరుగైన ఫలితాలు రాబట్టింది. బీజేపీ 57 స్థానాలకే పరిమితం కాగా, జేడీఎస్ 66 స్థానాల్లో విజయం సాధించింది. బళ్లారి కార్పొరేషన్‌ను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఇక్కడ 39 వార్డుల్లో 20 చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. బీజేపీ 14 చోట్ల, ఇతరులు ఐదు చోట్ల గెలుపొందారు. బీదర్‌లో హంగ్ ఏర్పడింది. అయితే, 15 స్థానాల్లో గెలిచిన కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరించింది. బీజేపీ 8, జేడీఎస్ 7, ఎంఐఎం 2, ఆప్ ఒక స్థానంలో విజయం సాధించింది. రామనగరలో బీజేపీకి ఘోర పరాభవం ఎదురైంది. ఇక్కడ ఆ పార్టీ ఖాతానే తెరవలేదు. ఇక్కడ 31 స్థానాలకు గాను కాంగ్రెస్ 19, జేడీఎస్ 11, స్వతంత్ర అభ్యర్థి ఒక స్థానంలో విజయం సాధించారు. బీజేపీ ఇక్కడ ఖాతా కూడా తెరవలేదు. రామనగర జిల్లా చెన్నపట్టణ నగర సభ ఎన్నికల్లో 31 వార్డులకు గాను జేడీఎస్ 16 చోట్ల విజయం సాధించగా, కాంగ్రెస్ ఏడు, బీజేపీ ఏడు స్థానాల్లో గెలుపొందాయి. ఒక స్థానంలో ఇండిపెండెంట్ అభ్యర్థి గెలుపొందాడు. హసన్ జిల్లాలోని బేలూరు పురసభలోనూ బీజేపీ భారీ షాక్ తగిలింది. ఇక్కడ మొత్తం 23 స్థానాలుండగా కాంగ్రెస్ 17, జేడీఎస్ 5 స్థానాలను కైవసం చేసుకున్నాయి. బీజేపీకి ఒక్క స్థానం దక్కింది. ఇక ముఖ్యమంత్రి యడియూరప్ప సొంత జిల్లాలోనూ బీజేపీకి ఎదురుగాలి వీచింది. ఇక్కడ మొత్తం 35 స్థానాలుండగా కాంగ్రెస్ 18, జేడీఎస్ 11, బీజేపీ 4 స్థానాల్లో గెలుపొందాయి. శివమొగ్గ జిల్లా తీర్థహళ్లిలో 15 వార్డులకు కాంగ్రెస్ 9, బీజేపీ 6 స్థానాల్లో విజయం సాధించగా, చిక్కబళ్లాపుర జిల్లా గుడిబండ పట్టణ పంచాయతీకి జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఖాతా తెరవలేదు. 11 స్థానాలకు గాను కాంగ్రెస్ 6, జేడీఎస్ 2, ఇతరులు మూడు స్థానాల్లో గెలుపొందారు. బెంగళూరు రూరల్ జిల్లా విజయపురలోనూ బీజేపీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఇక్కడ 23 వార్డులకు గాను జేడీఎస్ 14, కాంగ్రెస్ 6, ఇతరులు 2 చోట్ల విజయం సాధించగా, బీజేపీ ఒకే ఒక్క స్థానానికి పరిమితమైంది. మడికెరె నగరసభను మాత్రం బీజేపీ కైవసం చేసుకుంది. ఇక్కడ 23 స్థానాలకు ఎన్నికలు జరగ్గా బీజేపీ 16, ఎస్‌డీపీఐ 5, కాంగ్రెస్, జేడీఎస్‌లు ఒక్కో స్థానంలో విజయం సాధించాయి.

* దేశంలో కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. తొలిసారిగా రోజువారీ కేసుల సంఖ్య 4 లక్షలు దాటేసింది. నిన్న ఒక్కరోజే 4,01,993 మందికి పాజిటివ్‌ తేలింది. మరోవైపు మరణాలు కూడా రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. శుక్రవారం 3,523 మంది ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ బులిటెన్‌ విడుదల చేసింది. దీంతో ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 2,11,853కి చేరింది. దేశంలో క్రియాశీల కేసుల సంఖ్య 30 లక్షలు దాటేసింది. ప్రస్తుతం 32,68,710 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 15,49,89,635 మందికి వ్యాక్సిన్‌ వేసినట్లు ప్రకటన విడుదల చేసింది.

* ఆంధ్రప్రదేశ్‌లోని ప్రైవేటు ఆస్పత్రుల్లో కొవిడ్‌ చికిత్సకు ధరలు ఖరారు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్‌ఏబీహెచ్‌ అక్రిడేషన్‌ ఉన్న ఆస్పత్రులకు ఒక ధర, అక్రిడేషన్‌ లేని ఆస్పత్రులకు మరో ధరను ప్రభుత్వం నిర్ధరించింది. ఎన్‌ఏబీహెచ్‌ అక్రిడేషన్‌/ నాన్‌ అక్రిడేషన్‌ ప్రకారం ధరలు చూసుకుంటే.. నాన్ క్రిటికల్ కేర్(ఆక్సిజన్‌ లేకుండా)- ₹4000/3,600(రోజుకు), నాన్ క్రిటికల్‌ కేర్(ఆక్సిజన్‌తో)- 6,500/5,850(రోజుకు), క్రిటికల్‌ కేర్‌(ఐసీయూ)- ₹12,000/10,800(రోజుకు), క్రిటికల్‌ కేర్‌(ఐసీయూ, వెంటిలేటర్‌)- ₹16,000/14,400(రోజుకు). అక్రిడేషన్‌తో సంబంధం లేకుండా ప్రైవేటు ఆస్పత్రుల్లో సీటీ స్కాన్‌కు ₹3వేలు, రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్ వయల్‌కు ₹2,500, టొసిలిజుమాబ్‌కు ₹30వేల ధరను ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి ఆస్పత్రిలో పైధరలను ప్రదర్శించాలని ఆదేశించింది.

* భారత్‌లో మరో వ్యాక్సిన్‌ త్వరలో అందుబాటులోకి రానుంది. రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్‌-వి టీకాలు మాస్కో నుంచి ప్రత్యేక విమానంలో నేడు హైదరాబాద్‌ చేరుకున్నాయి. తొలి విడతలో భాగంగా 1.5 లక్షల వయల్స్‌ భారత్‌కు అందాయి. వీటిని తొలుత భారత్‌లో స్పుత్నిక్‌-వి క్లినికల్‌ ట్రయల్స్ నిర్వహించిన డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్‌కు అందించనున్నారు. కసౌలీలోని సెంట్రల్‌ డ్రగ్స్‌ ఆమోదం లభించిన తర్వాత రెడ్డీస్‌ ల్యాబ్స్‌ వీటిని వ్యాక్సినేషన్‌ ప్రక్రియకు అందించనుంది. ఈ నెలలోనే మరో మూడు మిలియన్ల డోసులు, జూన్‌లో ఐదు మిలియన్లు, జులైలో మరో 10 మిలియన్ల డోసులు భారత్‌కు రానున్నట్లు దౌత్య వర్గాలు ఇటీవల వెల్లడించాయి.

* భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అసభ్య పదజాలంతో మాట్లాడుతున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. కొన్నింటికి హద్దులు ఉంటాయని మంత్రి అన్నారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఎమ్మెల్యే బాల్క సుమన్‌తో కలిసి తలసాని మీడియాతో మాట్లాడారు. కరోనా కట్టడి విషయంలో రాష్ట్రానికి కేంద్రం ఏం చేస్తుందో బండి సంజయ్‌ చెప్పాలన్నారు. గతేడాది ప్రధాని చెప్పిన పనులన్నీ రాష్ట్ర ప్రభుత్వం చేసిందని.. బండి సంజయ్‌ నిజాలు తెలుసుకుని బాధ్యతగా మాట్లాడాలని హితవు పలికారు. ఈటల విషయం సీఎం కేసీఆర్‌ పరిధిలో ఉందన్నారు.

* భారత్‌లో కరోనా రెండో దశ ఉద్ధృతిని కట్టడికి అంతర్జాతీయ స్థాయి అంటువ్యాధుల నివారణ నిపుణుడు, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ వైద్య సలహాదారుడు డాక్టర్‌ ఆంటోనీ ఫౌచీ కీలక సూచనలు చేశారు. వెంటనే దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించడంతో పాటు చైనా తరహాలో అత్యవసర చికిత్సా కేంద్రాలు భారీ ఎత్తున ఏర్పాటు చేయడం, కరోనా పరిస్థితుల సమగ్ర పర్యవేణకు ఓ కేంద్రీకృత వ్యవస్థ ఉండాలంటూ ఫౌచీ మూడు కీలక ప్రతిపాదనలు చేశారు. ఈ మేరకు ప్రముఖ జాతీయ మీడియా సంస్థ ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌కు ఆయన ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.

* దేశ రాజధాని దిల్లీలో కరోనా విలయతాండవం ఆగడం లేదు. నానాటికీ కేసులు, మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. దీంతో వైరస్‌ ఉద్ధృతి దృష్ట్యా ప్రస్తుతం అమలవుతున్న లాక్‌డౌన్‌ను మరో వారం పాటు పొడిగిస్తున్నట్టు దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రకటించారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. రాజధాని వాసులు కూడా లాక్‌డౌన్‌ కొనసాగించడమే మేలని అభిప్రాయపడుతున్నట్లు పలు సర్వేలు చెబుతున్నాయి.