Food

జట్రోఫా మొక్క వేరులో క్యాన్సర్ ఔషధం

జట్రోఫా మొక్క వేరులో క్యాన్సర్ ఔషధం

క్యాన్సర్‌ భయంకరమైన వ్యాధి అన్నది తెలిసిందే. దాన్ని పూర్తిగా తగ్గించేందుకు ఎన్నో పరిశోధనలు నిరంతరం జరుగుతూనే ఉన్నాయి. అందులో భాగంగానే పర్‌డ్యూ యూనివర్సిటీ, స్క్రిప్స్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ బృందం బయో డీజిల్‌ కోసం పెంచే జట్రోఫా క్యుర్‌కాస్‌ అనే మొక్క వేరులో క్యాన్సర్‌ను ఎదుర్కొనే క్యుర్‌క్యుసన్‌ని గుర్తించారు. మెదడు, రొమ్ము, పేగు, ప్రొస్టేట్‌, ఊపిరితిత్తులు, కాలేయం… ఇలా ఏ క్యాన్సర్‌ను తీసుకున్నా ఇవన్నీ కూడా ఆయా భాగాలకే పరిమితం కాకుండా శరీరంలోని ఇతర భాగాలకూ వ్యాపిస్తాయి. అలా వ్యాపించడానికీ మందుల కారణంగా దెబ్బతిన్న క్యాన్సర్‌ కణాలు తిరిగి శక్తిని పుంజుకోవడానికీ బ్రటి అనే ఒక ప్రొటీనే కీలకం. మందులతో ఇంతకాలం దాన్ని పూర్తిగా అడ్డుకోలేకపోతున్నారు. మొదటిసారిగా జట్రోఫాలోని క్యుర్‌క్యుసన్‌తో అడ్డుకోవచ్చని వీళ్లు చేసిన పరిశోధనలో స్పష్టమైంది. దాంతో ఆ క్యుర్‌క్యుసన్‌ను ప్రయోగశాలలో కృత్రిమంగా తయారుచేసైనా సరే క్యాన్సర్‌ మందుల్ని రూపొందించేందుకు ప్రయత్నిస్తున్నారు. అప్పుడు క్యాన్సర్‌ పూర్తిగా నివారించడం సాధ్యమవుతుందని నిపుణులు భావిస్తున్నారు.