Health

శ్వాస మీద దెబ్బకొడుతున్న రెండో దశ కరోనా-TNI బులెటిన్

Second Wave COVID Hitting Respiratory System

* పార్టీ ముఖ్య నేతలతో నేడు టీడీపీ అధినేత చంద్రబాబు సమావేశమయ్యారు. అత్యంత ప్రమాదకర కరోనా వైరస్ ఎన్ 440కె ఏపీలో వ్యాపించిందన్నారు. తొలిసారిగా దీనిని సీసీఎంబీ శాస్త్రవేత్తలు కర్నూలులో గుర్తించారన్నారు. ఇతర వైరస్‌ల కన్నా 10 రెట్లు ప్రభావం ఎక్కువ చూపుతుందని చంద్రబాబు తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా లాక్‌డౌన్‌కు చర్యలు చేపట్టాలని తెలుగుదేశం డిమాండ్ చేసింది. ఇప్పటికే 14 రోజుల పాటు ఒరిస్సా లాక్‌డౌన్‌ను ప్రకటించిందని చంద్రబాబు పేర్కొన్నారు. వ్యాక్సినేషన్ కోసం పలు రాష్ట్రాలు పెద్ద ఎత్తున ఆర్డర్లు పెట్టాయన్నారు.

* హిందూపురం ప్రభుత్వ ఆస్పత్రి ఘటనపై మాజీ మంత్రి పరిటాల సునీత స్పందించారు. హిందూపురం ప్రభుత్వాస్పత్రిలో ఆక్సిజన్ అందక రోగుల మృతి బాధాకరమని అన్నారు. రోగులకు ఆక్సిజన్ అందించలేని జగన్మోహన్ రెడ్డికి అధికారంలో ఉండే అర్హత లేదని తెలిపారు. రెండు రోజుల వ్యవధిలో హిందూపురం ఆస్పత్రిలో 12 మంది మృతిచెందారని… మృతుల కుటుంబసభ్యులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఆక్సిజన్ సకాలంలో అందక ప్రజల ప్రాణాలు పోతుంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్‌లో కూర్చుని చోద్యం చూడటం సిగ్గుచేటని మండిపడ్డారు. ముఖ్యమంత్రి అసమర్థతకు, వైసీపీ ప్రభుత్వ బాధ్యతారాహిత్యానికి మరెంతమంది బలికావాలని ప్రశ్నించారు. అనంతపురం సర్వజన ఆస్పత్రి, కర్నూలు కేఎస్ కేర్ ఆస్పత్రుల్లో ప్రాణవాయువు అందక ఇప్పటికే 26మందికి పైగా చనిపోయారని తెలిపారు.

* రెండో దశలో కరోనా మహమ్మారి నేరుగా శ్వాసవ్యవస్థ మీద దెబ్బకొడుతుండటంతో వైరస్‌ బాధితులకు ఆక్సిజన్‌ అవసరం ఎక్కువైంది. అయితే, ప్రస్తుతం ఆక్సిజన్‌ కొరత తీవ్రంగా ఉండటంతో రోగులు అల్లాడిపోతున్నారు. సకాలంలో ప్రాణవాయువు అందక నిత్యం ఎంతోమంది ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. తాజాగా కర్ణాటకలో మరో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఒక కొవిడ్ ఆసుపత్రిలో ఆక్సిజన్‌ కొరతతో 24 మంది మరణించారు.

* ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కాలేజీలకు ఇంటర్ బోర్డు నేటి నుంచి సెలవులు ప్రకటించింది. పరీక్షలను సర్కారు వాయిదా వేసిన నేపథ్యంలో సెలవులు ప్రకటిస్తున్నట్లు బోర్డు కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. పరీక్షల కొత్త షెడ్యూల్‌ను 15రోజుల ముందుగా విద్యార్థులకు తెలియజేస్తామన్నారు. పరీక్షల తేదీలు ప్రకటించిన తర్వాత విద్యార్థులు, లెక్చరర్లు తప్పని సరిగా కాలేజీలకు హాజరు కావాలని పేర్కొన్నారు.

* కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో ప్రజా ప్రయోజనాల దృష్ట్యా లాక్‌డౌన్‌ విధించే అంశాన్ని పరిశీలించాలని జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌, జస్టిస్‌ లావు నాగేశ్వరరావు, జస్టిస్‌ ఎస్‌.రవీంద్రభట్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. రోగులు ప్రాణవాయువు కోసం ఇబ్బందిపడుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా అత్యవసరాల కోసం ఆక్సిజన్‌ మిగులు నిల్వలు (బఫర్‌స్టాక్‌) ఉంచాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. వాటిని రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో కేంద్రం నిర్వహించాలి. దేశవ్యాప్తంగా వికేంద్రీకరించాలి. వచ్చే నాలుగు రోజుల్లో అత్యవసర నిల్వలను ఏర్పాటు చేయాలి. రాష్ట్రాల కేటాయింపులకు అదనంగా ఈ నిల్వలను నిర్వహించాలని స్పష్టం చేసింది.