Movies

22మందిని కాపాడిన సోనూసూద్-తాజావార్తలు

22మందిని కాపాడిన సోనూసూద్-తాజావార్తలు

* కర్ణాటకలోని సోనూసూద్‌ బృందం మంగళవారం సకాలంలో స్పందించి ప్రాణాపాయస్థితిలో ఉన్న 20 నుంచి 22 మంది రోగుల ప్రాణాలను కాపాడింది. బెంగళూరులోని అరక్‌ ఆసుపత్రిలో ఆక్సిజన్‌ కొరత ఏర్పడిందని.. అత్యవసరంగా ఆక్సిజన్‌ సిలిండర్లు కావాలంటూ సత్యనారాయణన్‌ అనే ఓ పోలీసు అధికారి కర్ణాటకలోని సోనూసూద్‌ బృందానికి అత్యవసర సందేశం (ఎస్‌ఓఎస్‌) పంపారు. ఆ ఆస్పత్రిలో ప్రాణవాయువు అందక అప్పటికే ఇద్దరు రోగులు ప్రాణాలు కోల్పోగా.. మరో 20 నుంచి 22 మంది ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు.

* దేశంలో కరోనా కేసులు తగ్గినట్లే తగ్గి పెరుగుతున్నాయని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుతం 12 రాష్ట్రాల్లో లక్ష చొప్పున యాక్టివ్‌ కేసులు ఉన్నాయని, మహారాష్ట్రలో కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతుండగా, బెంగళూరు, చెన్నై నగరాల్లో కరోనా కేసులు ప్రమాదకరంగా పెరుగుతున్నాయని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ అన్నారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.

* అతి తీవ్రమైన కరోనా సమస్యకు ఏపీ మంత్రివర్గ సమావేశంలో ప్రాధాన్యత కల్పించలేదని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. మంత్రివర్గ సమావేశం అజెండాలో 33వ అజెండాగా కరోనా నియంత్రణను చేర్చారని మండిపడ్డారు. రూ.వేలకోట్లు దుబారాకు ఖర్చు చేస్తూ ప్రజల ప్రాణాలు కాపాడేందుకు మీన మేషాలు లెక్కిస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. ఆన్‌లైన్‌ ద్వారా నిర్వహించిన మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. ప్రజల ప్రాణాలు, ఆరోగ్యం కంటే ఈ ప్రభుత్వానికి ఎక్కువేంటని ప్రశ్నించారు. ప్రభుత్వానికి తగిన సూచనలు ఇవ్వాలనే బాధ్యతతోనే పొలిట్‌బ్యూరో సమావేశం నిర్వహించామన్నారు.

* జగనన్న కాలనీల్లో జూన్‌ 1వ తేదీ నుంచి పనులు ప్రారంభించాలని ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ నెల 25 నాటికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు, జగనన్న కాలనీల్లో వసతుల కల్పన, టిడ్కో ఇళ్ల నిర్మాణంపై సీఎం సమీక్షించారు. రాష్ట్రంలో కర్ఫ్యూ అమల్లో ఉన్నప్పటికీ నిర్మాణ పనులు ఆగకూడదని చెప్పారు. మధ్యాహ్నం 12 గంటల వరకు యథావిధిగా కార్యకలాపాలు కొనసాగేలా చర్యులు తీసుకోవాలని ఆదేశించారు.

* కరోనా వైరస్‌ మహమ్మారి విలయానికి భారత్‌ వణికిపోతోంది. గత కొన్నివారాలుగా కరోనా కొనసాగుతున్న విజృంభణకు నిత్యం వేల సంఖ్యలో కొవిడ్‌ బాధితులు మృత్యుఒడికి చేరుతున్నారు. గతవారం ప్రపంచంలో నమోదైన మొత్తం కేసుల్లో సగం భారత్‌లోనే ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఇక అదే వారంలో ప్రపంచంలో చోటుచేసుకున్న ప్రతి నాలుగు కొవిడ్‌ మరణాల్లో ఒకటి భారత్‌లోనే ఉందని డబ్ల్యూహెచ్‌ఓ పేర్కొంది.

* సమస్యలు పరిష్కరించాలని కోరుతూ విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ఉద్యోగులు తలపెట్టిన సమ్మె వాయిదా పడింది. కొవిడ్‌ దృష్ట్యా సమ్మెను వాయిదా వేస్తున్నట్లు యాజమాన్యానికి ఇచ్చిన వాయిదా నోటీసులో కార్మిక సంఘాలు పేర్కొన్నాయి. తొలుత ఇచ్చిన నోటీసులో భాగంగా కార్మిక సంఘాలు రేపు సమ్మెకు దిగాల్సి ఉంది. అయితే సమస్యలు పరిష్కరించకుంటే మే తర్వాత ఎప్పుడైనా సమ్మె చేస్తామని నోటీసులు వెల్లడించాయి.

* మినీ పురపోరులో భాగంగా మేయర్, ఛైర్ పర్సన్ పదవుల కోసం పరోక్ష ఎన్నికలు ఈ నెల ఏడో తేదీన జరగనున్నాయి. ఇందుకోసం రెండు నగరపాలికలు, ఐదు పురపాలికల పాలక మండళ్ల ప్రత్యేక సమావేశాలకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లు; సిద్దిపేట, అచ్చంపేట, జడ్చర్ల, కొత్తూరు, నకిరేకల్ మున్సిపాలిటీలకు ఏప్రిల్ 30న పోలింగ్ జరగ్గా ఈ నెల మూడో తేదీన ఓట్ల లెక్కింపు పూర్తి అయింది. ఆయా కార్పొరేషన్ల మేయర్, డిప్యూటీ మేయర్; మున్సిపాలిటీల ఛైర్‌పర్సన్, వైస్ ఛైర్ పర్సన్ల ఎన్నిక కోసం 7వ తేదీన పరోక్ష ఎన్నిక నిర్వహించనున్నారు. ఇందుకోసం ఆయా జిల్లాల కలెక్టర్లు నియమించిన గెజిటెడ్ అధికారులు 6వ తేదీలోగా ఎన్నిక నోటీసు జారీ చేస్తారు. 7వ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు కొత్తగా ఎన్నికైన సభ్యుల ప్రమాణ స్వీకారం ఉంటుంది.

* రాష్ట్ర పరిధిలో మే నెలలో జరిగే అన్ని పరీక్షలు వాయిదా లేదా రద్దు చేయాలని ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డిని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సీఎంకు లోకేశ్ లేఖ రాశారు. మే నెలలో ఆఫ్‌లైన్‌లో జరిగే పరీక్షలను కేంద్రం ఇప్పటికే వాయిదా వేసిందని గుర్తు చేశారు. అందుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వమూ నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఏపీలో బుధవారం నుంచి జరగాల్సిన ఇంటర్‌ పరీక్షలను వాయిదా వేసినందుకు సీఎం జగన్‌కు లోకేశ్‌ కృతజ్ఞతలు తెలిపారు.

* కరోనా విషయంలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో పరిస్థితి అదుపులోనే ఉందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) సోమేశ్‌కుమార్‌ తెలిపారు. కొవిడ్‌ వ్యాప్తి నివారణకు వైద్యులు, సిబ్బంది తీవ్రంగా కష్టపడుతున్నారని చెప్పారు. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య తగ్గుతోందని.. ఇది మంచి పరిణామమన్నారు. బీఆర్కే భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో సీఎస్‌ మాట్లాడారు. రాష్ట్రంలో ఆక్సిజన్‌ బెడ్‌ల కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామని సీఎస్‌ చెప్పారు. మెడికల్‌ ట్రీట్‌మెంట్‌కు హైదరాబాద్‌ క్యాపిటల్‌గా మారిందని.. నగరంలో తెలంగాణ వాళ్లే కాకుండా ఇతర రాష్ట్రాలకు చెందిన రోగులు కూడా చికిత్స పొందుతున్నారని తెలిపారు.

* తనకు జరిగిన అన్యాయం భరించరానిదని కార్యకర్తలు అభిప్రాయపడ్డారని మాజీ మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. హుజూరాబాద్‌లోని తన నివాసంలో శ్రేయోభిలాషులు, కార్యకర్తలు, నేతలతో చర్చించిన అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. తనను ఈ స్థాయికి తీసుకొచ్చిన వారి అభిప్రాయాలు తెలుసుకున్నానని చెప్పారు. ఉద్యమానికి ఊపిరినిచ్చిన ప్రాంతం హుజూరాబాద్‌ అన్నారు. రాష్ట్రంలోని అనేక నియోజకవర్గాల ఉద్యమకారులంతా సూచనలు ఇచ్చారన్నారు. 20 ఏళ్ల ఉద్యమ ఘట్టాలను కొందరు గుర్తు చేశారని చెప్పారు. ఏ నిర్ణయం తీసుకున్నా తన వెంటే ఉంటామని కార్యకర్తలు భరోసా ఇచ్చారని ఈటల తెలిపారు.

* లండన్‌లో జరుగుతోన్న జీ-7 విదేశాంగశాఖ మంత్రుల సమావేశంలో కరోనా వైరస్ కలకలం సృష్టించింది. భారత్‌ తరపున హాజరైన ప్రతినిధి బృందంలో ఇద్దరికి కొవిడ్‌ పాజిటివ్‌గా తేలినట్లు అక్కడి ప్రభుత్వం వెల్లడించింది. దీంతో భారత బృందం మొత్తం ఐసోలేషన్‌లో ఉన్నట్లు అధికారులు తెలిపారు. జీ7 సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన విదేశాంగశాఖ మంత్రి ఎస్‌ జయశంకర్‌కు మాత్రం పాజిటివ్‌ రాలేదని అక్కడి మీడియా వెల్లడించింది.

* ఇటీవలే చైనా ప్రయోగించిన లాంగ్‌ మార్చ్‌ 5బీ రాకెట్‌ భూమిపై కూలే దిశగా ప్రమాదకరంగా ప్రయాణిస్తోంది. ఈ వారంతంలో భూవాతావరణంలోకి ప్రవేశించే ఈ రాకెట్‌ లొకేషన్‌ను ట్రాక్‌ చేస్తున్నామని అమెరికా రక్షణ శాఖ వెల్లడించింది. మే 8న ఇది భూవాతావరణంలోకి ప్రవేశిస్తుందని అంచనా వేస్తున్నారు. ‘అంతరిక్షంలో చైనీస్‌ లాంగ్‌మార్చ్‌ 5బీ ఉన్న లొకేషన్‌ గురించి అమెరికా స్పేస్‌ కమాండ్‌కు పూర్తి అవగాహన ఉంది. దాన్ని ట్రాక్‌ చేస్తున్నాం. అయితే భూవాతావరణంలో అది ఎక్కడ కచ్చితంగా ప్రవేశిస్తుందో ఇప్పుడే నిర్ధారించలేం. కొన్ని గంటల ముందే చెప్పగలం. అది ఈ నెల 8న భూవాతావరణంలోకి ప్రవేశించనుందని అంచనా వేస్తున్నాం’ అని పెంటగాన్‌ స్పేస్‌ కమాండ్‌ సెంటర్‌ ఓ ప్రకటనలో తెలిపింది.

* కర్ణాటకలో కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నా కరోనా వైరస్‌ ఉద్ధృతి తగ్గడంలేదు. నిన్న ఒక్కరోజే 44వేలకు పైగా కొత్త కేసులు రావడం కలకలం రేపుతోంది. దీంతో రాష్ట్రంలో సంపూర్ణ లాక్‌డౌన్‌ విధించాలని సీఎం యడియూరప్ప యోచిస్తున్నారు. రాష్ట్రంలో పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ పెట్టాలా? వద్దా ? అనే అంశంపై ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నట్టు ఆయన తెలిపారు. దేశ ప్రధానిగా మోదీ ఏ నిర్ణయం తీసుకున్నా తాము అమలు చేస్తామని తెలిపారు. ఆయన ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నట్టు చెప్పారు. ఆయన ఆదేశాలకు అనుగుణంగా సాయంత్రం నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

* దేశంలో కరోనా కేసులు తగ్గినట్లే తగ్గి పెరుగుతున్నాయని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుతం 12 రాష్ట్రాల్లో లక్ష చొప్పున యాక్టివ్‌ కేసులు ఉన్నాయని, మహారాష్ట్రలో కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతుండగా, బెంగళూరు చెన్నైలలో కరోనా కేసులు ప్రమాదకరంగా పెరుగుతున్నాయని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ అన్నారు. మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీ, దిల్లీ, హరియాణాలో ఎక్కువ కరోనా మరణాలు నమోదవుతున్నాయి. గత వారం రోజుల్లో ఒక్క బెంగళూరు నగరంలో 1.49 లక్షల పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని వెల్లడించారు.