Health

కరోనాకు సొంత వైద్యం చేసుకోకండి-తాజావార్తలు

కరోనాకు సొంత వైద్యం చేసుకోకండి-తాజావార్తలు

* కరోనాను జయించిన 92 ఏళ్ల బామ్మ.కరోనా బారి నుంచి 92 ఏళ్ల బామ్మ కోలుకుంది.గుంటూరు జిల్లా గణపవరం గ్రామానికి చెందిన సింగు కామేశ్వరమ్మ ఏప్రిల్‌ 16న అనారోగ్యంతో ప్రైవేటు ఆస్పత్రిలో చేరింది.వైద్యులు పరీక్షించి కరోనా పాజిటివ్‌గా నిర్ధారించారు.ఆస్పత్రిలో కొన్ని రోజులు చికిత్స పొంది కోలుకుంది.అనంతరం ఆమె డిశ్చార్జయ్యి ఇంటికి చేరుకుంది.ప్రస్తుతం ఆమె పూర్తి ఆరోగ్యంగా ఉంది.

* ఏపీ ప్రభుత్వం రేపు మధ్యాహ్నం 12 గంటల నుంచి రాష్ట్రంలో కర్ప్యూ విధించింది. అయితే కర్ప్యూ నేపథ్యంలో శ్రీవారి దర్శనాలపై టీటీడీ క్లారిటీ ఇచ్చింది. శ్రీవారి దర్శనాలను యధావిధిగా కొనసాగించాలని నిర్ణయం తీసుకుంది.

* దేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. ఎంతో కొంత పలుకుబడి ఉన్న వ్యక్తులకే ఆస్పత్రుల్లో బెడ్లు దొరకడం లేదంటే పరిస్థితి ఎలా ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఇలాంటి సమయంలో చాలా మంది ‘సొంత వైద్యం’పై దృష్టి పెడుతున్నారు. వైద్యుల సలహాలు తీసుకోకుండానే తమకు తెలిసిన, అందుబాటులో ఉన్న ఔషధాలను వాడేస్తున్నారు. ఇలా చేయడం చాలా ప్రమాదకరమని, దీనివల్ల మేలు కంటే కీడే ఎక్కువగా జరుగుతుందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. కొవిడ్‌ సోకిన వారిలో కేవలం 10-15 శాతం మందికి మాత్రమే ఆస్పత్రిలో చికిత్స తీసుకునే అవసరం ఏర్పడుతోందని, మిగతా వారంతా ఇంట్లోనే చిన్నపాటి జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని అంటున్నారు.

* ఈ ఏడాది రాబోయే వానాకాలం సీజన్‌ కోసం 25.50 లక్షల మెట్రిక్ టన్నుల రసాయన ఎరువులను కేంద్ర ప్రభుత్వం కేటాయించిందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో జూన్ 1 నుంచి ప్రారంభం కానున్న ఖరీఫ్‌కు సంబంధించి దక్షిణ మధ్య రైల్వే, ఎరువుల కంపెనీల ప్రతినిధులు, టీఎస్‌ మార్క్‌ఫెడ్‌ సంస్థ అధికారులతో ఎరువుల సరఫరా, నిల్వపై మంత్రి ఆన్‌లైన్‌లో సమీక్షించారు. కేంద్రం కేటాయించిన నిల్వలు, వానాకాలం పంట సాగు విస్తీర్ణం, డిమాండ్ వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 6.65 లక్షల మెట్రిక్ టన్నుల రసాయన ఎరువులు అందుబాటులో ఉండగా.. వీటిలో 3.73 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా, 2.92 లక్షల మెట్రిక్ టన్నుల ఇతర ఎరువులు ఉన్నాయన్నారు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో గత వానాకాలం అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈ ఏడాది ఎలాంటి ఇబ్బందులు రాకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు.

* కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతిభవన్‌కు చేరుకున్నారు. ఏప్రిల్ 14వ తేదీన నాగార్జున సాగర్ బహిరంగసభలో పాల్గొన్న తర్వాత ఒకటి, రెండు రోజులకు సీఎం ఎర్రవల్లిలోని ఆయన వ్యవసాయ క్షేత్రానికి వెళ్లారు. స్వల్పలక్షణాలు ఉండడంతో పరీక్షలు చేయించుకోగా.. 19న కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. వైద్యుల సలహా మేరకు అప్పటినుంచి సీఎం ఐసోలేషన్‌లో ఉన్నారు. మధ్యలో ఒకసారి పరీక్షల నిమిత్తం సోమాజిగూడలోని యశోద ఆస్పత్రికి వచ్చినప్పటికీ ప్రగతిభవన్‌కు వెళ్లలేదు.

* ఆంధ్రప్రదేశ్‌లోని ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల్లో కొవిడ్‌ బాధితులకు తప్పనిసరిగా పడకలు కేటాయించాలని.. ఎంప్యానెల్‌ చేసిన ఆస్పత్రుల్లో విధిగా 50 శాతం బెడ్లు కరోనా బాధితులకు కేటాయించాలని ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశించారు. అంత కంటే ఎక్కువ బాధితులు వచ్చినా తప్పనిసరిగా చేర్చుకోవాలన్నారు. ఈ మేరకు కొవిడ్‌ నియంత్రణ, నివారణ, వ్యాక్సినేషన్‌పై వైద్యారోగ్య శాఖ అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. తాత్కాలిక ఎంప్యానెల్‌ ఆస్పత్రుల్లోనూ 50 శాతం పడకలు కేటాయించాలని చెప్పారు. జిల్లా కలెక్టర్లు నోటిఫై చేసిన నాన్‌ ఎంప్యానెల్‌ ఆస్పత్రులూ కొవిడ్ రోగులకు పడకలు ఇవ్వాలని.. అందుకోసం ఆ ఆస్పత్రులను తాత్కాలికంగా ఎంప్యానెల్‌ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కొవిడ్‌ బాధితులకు ఆరోగ్యశ్రీ కింద పూర్తి ఉచితంగా వైద్య సేవలు అందించాలన్నారు.కొవిడ్‌ ఆస్పత్రుల వద్దే కరోనా కేర్‌ సెంటర్లు ఏర్పాటు చేయాలని వెల్లడించారు.

* ప్రభుత్వం చేపట్టిన వ్యాక్సినేషన్‌ కార్యక్రమం వేగం తగ్గకుండా రాష్ట్రాలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. దేశంలో కొవిడ్ పరిస్థితులపై గురువారం కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రాలు, జిల్లాల వారీగా నెలకొన్న పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్య, మౌలిక సదుపాయాలు పెంచడానికి రాష్ట్రాలకు సహాకారం, ఔషధాల లభ్యతలపై ప్రధానంగా చర్చించారు. దేశంలో వ్యాక్సినేషన్‌ జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. కొన్ని రాష్ట్రాల్లో టీకా ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. రాబోయే కొద్ది నెలల్లో టీకా ఉత్పత్తిని పెంచడానికి రోడ్‌మ్యాప్‌పైనా చర్చ జరిపారు.

* కొవిడ్‌ నియంత్రణకు ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తంచేసింది. రాష్ట్రంలో ఆక్సిజన్‌ కొరత లేదని మొన్న అఫిడవిట్‌లో పేర్కొన్నారని.. ఇప్పుడు ఆక్సిజన్‌ బెడ్లు ఖాళీ లేవని నోడల్‌ అధికారులే చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ అఫిడవిట్‌లో లెక్కలకు, వాస్తవ పరిస్థితికి పొంతన లేదని ఆక్షేపించింది. కరోనా చికిత్సలు సక్రమంగా అందడం లేదంటూ సామాజిక కార్యకర్త తోట సురేశ్‌బాబు, ఏపీసీఎల్‌ఏ వేసిన పిల్‌పై ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది.

* కొవిడ్‌ టీకా పేటెంట్ల మినహాయింపుపై చేస్తున్న పోరాటంలో భారత్‌కు అత్యంత కీలక భాగస్వామి నుంచి మద్దతు లభించింది. కొవిడ్‌ టీకాకు పేటెంట్ల నుంచి మినహాయింపు ఇవ్వాలన్న వాదనకు బుధవారం అమెరికా మద్దతు పలికింది. పేద దేశాల ప్రజలు ప్రాణాలు నిలుపుకొనేందుకు అవసరమైన టీకాల లభ్యత పెంపుపై ఈ అంశం ఆశలు పెచ్చింది.

* ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభణ ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో అనేక సంస్థలు తమ ఉద్యోగులకు వర్క్‌ ఫ్రమ్‌ హోం ఇస్తున్న సంగతి తెలిసిందే. ప్రముఖ టెక్‌ దిగ్గజం గూగుల్‌ తన ఉద్యోగులు ‘హైబ్రిడ్‌ వర్క్‌ వీక్‌’ను అమలు చేస్తోంది. ఇందులో భాగంగా మూడు రోజుల పాటు ఉద్యోగులు ఆఫీస్‌కు రావాల్సి ఉంటుంది. మిగిలిన రెండు రోజులు ఉద్యోగుల ఇష్టం. వారికి పని చేయడం ఎక్కడ సౌకర్యం ఉంటే అక్కడి నుంచి విధులకు హాజరుకావచ్చని గూగుల్‌, ఆల్ఫాబెట్ సీఈవో సుందర్‌ పిచాయ్‌ స్పష్టం చేశారు. ఈ ఏడాది చివరి నాటికి కూడా మొత్తం ఉద్యోగుల్లో 20శాతం మంది వర్క్‌ ఫ్రమ్‌ హోం చేయొచ్చని 60శాతం మంది మాత్రమే ఆఫీస్‌కు వస్తారని, అది కూడా వారం కొన్ని రోజులు మాత్రమేనని సుందర్‌ తెలిపారు.