Politics

స్టాలిన్ వరాలు…మహిళలకు ఉచిత ప్రయాణం-తాజావార్తలు

News Roundup - TN CM Stalin Announces Free Rides To Woman In Buses

* ప్ర‌జ‌ల‌పై వ‌రాల జ‌ల్లు కురిపించిన త‌మిళ‌నాడు కొత్త సీఎం స్టాలిన్.. లీట‌రు పాలపై కూడా రూ.3 త‌గ్గించిన వైనం.ప్ర‌భుత్వ బ‌స్సుల్లో మ‌హిళ‌ల‌కు ఉచిత ప్ర‌యాణం.రేష‌న్ కార్డు ఉన్న దాదాపు రెండు కోట్ల కుటుంబాల‌కు రూ.4 వేలు.క‌రోనా ఆర్థిక సాయం కింద ప్ర‌క‌ట‌న‌.తమిళనాడు ముఖ్యమంత్రిగా డీఎంకే చీఫ్ స్టాలిన్ ఈ రోజు ఉదయం ప్రమాణ స్వీకారం చేసిన విష‌యం తెలిసిందే. తొలి రోజే ఆయ‌న కీల‌క ఉత్త‌ర్వుల‌పై సంత‌కాలు చేశారు. త‌మిళ‌నాడు ప్ర‌జ‌లపై వ‌రాల జ‌ల్లు కురిపించారు. క‌రోనా వేళ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటోన్న ప్ర‌జ‌ల‌కు ఆయ‌న ప్ర‌క‌టించిన వ‌రాలు ఉపశ‌మ‌నం క‌లిగించేలా ఉన్నాయి. ప్ర‌భుత్వ బ‌స్సుల్లో మ‌హిళ‌ల‌కు ఉచితంగా ప్ర‌యాణించే సౌక‌ర్యాన్ని క‌ల్పించారు.రేష‌న్ కార్డు ఉన్న దాదాపు రెండు కోట్ల కుటుంబాల‌కు రూ.4 వేల చొప్పున సాయం అందించ‌నున్న‌ట్లు తెలిపారు. ఈ సాయాన్ని కొవిడ్ ఆర్థిక‌ సాయం కింద ఇస్తున్న‌ట్లు ఆయ‌న వివ‌రించారు. ఇందులో భాగంగా తొలి విడ‌త కింద త్వ‌ర‌లో రూ.2 వేల చొప్పున జ‌మ చేస్తామ‌ని తెలిపారు. అంతేకాదు, త‌మిళ‌నాడు వ్యాప్తంగా లీట‌రు పాల‌పై రూ.3 త‌గ్గిస్తూ త‌మిళ‌నాడు కొత్త‌ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. అలాగే మ‌రిన్ని ప్ర‌యోజ‌నాల‌ను త్వ‌ర‌లోనే ప్ర‌జ‌ల‌కు అందించ‌నున్నారు.

* దేశంలో ఆక్సిజన్‌ కోసం కేంద్రానికి, రాష్ట్రాలకు మధ్య విభేదాలు తలెత్తుతున్నాయి. ఈ విషయంలో కోర్టులు జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. రాజధాని దిల్లీకి ప్రతిరోజూ 700 మెట్రిక్‌ టన్నుల మెడికల్‌ ఆక్సిజన్‌ను సరఫరా చేయాలని ఆదేశించిన సుప్రీం తాజాగా కర్ణాటక విషయంలోనూ అదే విధంగా స్పందించింది. కర్ణాటకకు ప్రాణవాయు సరఫరాను పెంచాలంటూ ఆ రాష్ట్ర హైకోర్టు జారీ చేసిన ఆదేశాలను సమర్థించింది. ‘కర్ణాటక ప్రజలను చూస్తూ అలా వదిలేయలేం’అని వ్యాఖ్యానించింది.

* కరోనా పాజిటివ్‌ వచ్చి ఉంటుందా?.. వారి కుటుంబంలో ఎవరైనా ఆసుపత్రి పాలయ్యారా?.. ఫోన్‌కు స్పందించకున్నా.. తిరిగి కాల్‌ చేయకపోయినా.. స్విచ్చాఫ్‌ చేసినా.. బంధువులు, మిత్రుల మెదళ్లలో రేగుతున్న సందేహాలివి. ఎప్పుడూ మాట్లాడుతూ ఉండేవారు కొద్ది రోజులు ఫోన్‌ చేయకున్నా.. తాము చేస్తే ఫోన్‌ తీయకున్నా మనసు కీడు శంకిస్తోంది. అసలు విషయాన్ని కనుక్కోవడానికి ఉమ్మడి స్నేహితులు, ఇతర బంధువులను ఆరా తీస్తున్నారు. కరోనా ఉద్ధృతి నేపథ్యంలో ఎక్కువ మంది ఇదే తరహాలో యోచిస్తున్నారు. వాస్తవ పరిస్థితి అంతకంటే భిన్నంగా ఏమీ లేదు. కరోనా లక్షణాలు కనిపించగానే టెస్టు చేయించుకోవడం, వైద్యుల వద్ద ఉన్నా ఫలితం ఏమొస్తుందో? ఏం చెబుతారో?.. అన్న ఆందోళన.. అందుకే తర్వాత మాట్లాడదామని ఫోన్లకు స్పందించడం లేదు. పాజిటివ్‌ వచ్చి హోం ఐసొలేషన్‌లో ఉన్నా ఔషధాలు సమకూర్చుకోవడం, ఇతర ఏర్పాట్లు చేసుకోవడం వంటి కారణాలతో పాటు విశ్రాంతి తీసుకోవాలని భావించి ఫోన్లకు బదులివ్వడం లేదు. అలాంటి సమయంలో మిత్రులు, బంధువులు చేస్తున్న ఫోన్లకు జవాబు ఇక్వకుంటే కరోనా వచ్చి ఉంటుందేమోనని సందేహిస్తున్నారు. కొందరు తమకు కొవిడ్‌ పాజిటివ్‌ వచ్చిందని వాట్సప్‌ స్టేటస్‌గా పెట్టుకున్నారు. అది చూసినవారు ఫోన్లు చేయడం మాని, త్వరగా కోలుకోవాలని మెసేజ్‌ పెడుతున్నారు. షాపులు ఒక్క రోజు తెరవకున్నా ఆ వ్యాపారులకు కరోనా వచ్చి ఉంటుందేమోనని జనం అనుమానిస్తున్నారు.

* దేశంలో 5జీ ట్రయల్స్‌లో చైనా సాంకేతికతను వాడకూడదని భారత్‌ తీసుకున్న నిర్ణయంపై అగ్రరాజ్యం అమెరికా ప్రశంసించింది. 5జీ ట్రయల్స్‌లో చైనాకు చెందిన హువాయ్‌, జీటీఈ సాంకేతికతను వాడవద్దని నిర్ణయించడం భారత ప్రజలతో పాటు ప్రపంచానికి శుభవార్త అని పేర్కొంది. చైనా కమ్యూనిస్టు పార్టీ నియంత్రణలో ఉన్న అక్కడి టెక్‌ కంపెనీలకు దూరంగా ఉండాలని అమెరికా తన మిత్ర దేశాలకు మరోసారి పిలుపునిచ్చింది.

* అనంతపురం ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని కొవిడ్‌ విభాగంలో పడకల కొరత తీవ్రంగా వేధిస్తోంది. దీంతో ఒకే మంచంపై ఇద్దరు రోగులను పడుకోబెట్టి ప్రాణవాయువు అందిస్తున్నారు. కణేకల్లు మండలానికి చెందిన సుంకన్న అనే వృద్ధుడు కొవిడ్‌ లక్షణాలతో ఊపిరాడని స్థితిలో గురువారం ఉదయం ఆసుపత్రిలో చేరాడు. ఈయనకు పడక లేక ఓ యువకుడు ఉన్న పడకపైనే ఆక్సిజన్‌ పెట్టి చికిత్స అందించారు. కొద్ది గంటల్లోనే ఆ వృద్ధుడు మృతిచెందాడు. మృతదేహం ఉన్న పడకపైనే యువకుడు రెండు గంటల పాటు ఆక్సిజన్‌తో చికిత్స పొందిన దయనీయ పరిస్థితి ఇది.

* దేశంలో 18 ఏళ్లు పైబడిన వారందరికీ వ్యాక్సిన్‌ ఇమ్మని కేంద్రం స్పష్టం చేస్తుంటే.. ఏపీ ప్రభుత్వం సాధ్యం కాదని చెప్పటం తగదని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. వ్యాక్సిన్‌ కోసం రాష్ట్ర నిధులు ఖర్చు పెట్టకుండా కేంద్రం అనుమతులు లేవంటూ ప్రజల ప్రాణాలను పణంగా పెట్టడం ఎంతమాత్రం సబబు కాదన్నారు. ప్రభుత్వ సహకారం లేనిదే కరోనా నియంత్రణ సాధ్యం కాదని తెలిపారు. సమాజ శ్రేయస్సు కోసం ప్రతి ఒక్కరూ తమ గళం గట్టిగా వినిపించి ప్రభుత్వాన్ని మేల్కొల్పాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ‘కరోనా వేళ సమాజ శ్రేయస్సుకు అవసరమైన సమాచారం’ పేరిట ఆన్‌లైన్‌లో చంద్రబాబు సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ఆరోగ్య సంరక్షణ, ఫార్మా రంగాల నిపుణులు పాల్గొన్నారు.

* తెలంగాణలో ప్రస్తుతం అమల్లో ఉన్న రాత్రి కర్ఫ్యూను రాష్ట్ర ప్రభుత్వం మరో వారం పొడిగించింది. మే 15వ తేదీ ఉదయం 5 గంటల వరకు రాత్రి పూట కర్ఫ్యూను పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా ఉద్ధృతి దృష్ట్యా గత నెల 20వ తేదీ నుంచి రాష్ట్రంలో రాత్రిపూట కర్ఫ్యూ అమల్లో ఉంది. మొదట్లో మే 8వ తేదీ వరకు పొడిగించిన రాష్ట్ర ప్రభుత్వం మరోవారం పాటు రాత్రి కర్ఫ్యూని పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా ప్రజలు సమూహాలుగా ఉండకుండా పలు మార్గదర్శకాలు జారీ చేసింది. పెళ్లిళ్లకు 100 మందికి మించకుండా, అంత్యక్రియలకు 20 మంది మించరాదని స్పష్టం చేసింది. భౌతికదూరం పాటించాలని, మాస్కులు తప్పనిసరిగా ధరించాలని తెలిపింది. సామాజిక, రాజకీయ, క్రీడా, వినోద, విద్యా, మతపరమైన, సాంస్కృతిక సమావేశాలు, కార్యక్రమాలపై నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆదేశాలు, ఆంక్షలను కఠినంగా అమలు చేయాలని కలెక్టర్లు, పోలీసు కమిషనర్లు, ఎస్పీలను ప్రభుత్వం ఆదేశించింది.

* హైదరాబాద్‌లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీ మొత్తంలో బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇవాళ దుబాయ్ నుంచి వచ్చిన విమానంలో ఓ లగేజీ బ్యాగ్‌ను అనుమానంతో కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు. అందులో బిస్కెట్ల రూపంలో దాదాపు 2.60 కిలోల బంగారం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వాటి విలువ దాదాపు రూ.1.28 కోట్లు ఉంటుందని విమానాశ్రయం కస్టమ్స్ ఉప కమిషనర్ శివకృష్ణ తెలిపారు. ఆ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు శివకృష్ణ తెలిపారు.

* చైనా ప్రయోగించిన రాకెట్‌ శకలాలు భూమిపై పడనున్నాయన్న వార్తలు కలవరపెడుతున్నాయి. ఈ వారాంతంలోనే అవి భూమిని తాకనున్నాయని శాస్త్రవేత్తలు హెచ్చరికలు భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఈ విషయంపై ఇంతవరకు పెద్దగా పట్టనట్లు వ్యవహరించిన చైనా.. తొలిసారి స్పందించింది. రాకెట్‌ శకలాలు భూమిని తాకే లోపలే అవి కాలిపోతాయని ఆ దేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి వాంగ్‌ వెన్‌బిన్‌ తెలిపారు. దానివల్ల నష్టం జరిగే అవకాశాలు దాదాపు లేవని పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం మీడియాతో మాట్లాడారు.

* పుంగనూరుకు చెందిన ఓ బాధితురాలు ఈ నెల 3వ తేదీన తిరుపతిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో వైద్యం కోసం చేరారు. మరుసటి రోజు మృతి చెందారు. మృతదేహాన్ని అప్పగించేటప్పుడు ఆమె మెడలోని 60 గ్రాముల బంగారం తాళిబొట్టు కనిపించలేదు. బాధితుల బంధువులు ఆస్పత్రి యాజమాన్యాన్ని ప్రశ్నించినా ఫలితం లేకపోవడంతో అలిపిరి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇలా గతంలో తిరుపతిలోని స్విమ్స్‌, రుయాతో పాటు జిల్లాలోని పలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో కొవిడ్‌ మృతుల శరీరాలపై ఉన్న ఆభరణాలు మాయం అయ్యాయి. పలు పోలీస్‌స్టేషన్లలో కేసులు సైతం నమోదయ్యాయి. రెండో కొవిడ్‌ అలలో మృతుల సంఖ్య పెరుగుతున్నందున ఇలాంటి ఘటనలు వెలుగులోకి వచ్చే అవకాశం లేకపోలేదు. ఇప్పటి వరకు ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఈ విషయంపై ఎలాంటి విధి విధానాలు పాటించడం లేదు. కొవిడ్‌ బారినపడ్డారని తెలియగానే బాధితులు భయాందోళనలకు గురవుతూ వెంటనే ఆస్పత్రికి వచ్చేస్తున్నారు. ఈ క్రమంలో తమ శరీరంపైౖ ఎలాంటి విలువైన ఆభరణాలు ఉన్నాయోనని గుర్తించే పరిస్థితి ఉండదు. ఆస్పత్రిలో చేరే వారికి కొంత దూరంగా బంధువులు ఉన్నప్పటికీ ఆభరణాలు గురించి ఆలోచన చేసే పరిస్థితి ఉండదు. తీరా మృతి చెందాక మృతదేహాన్ని పూర్తిగా కప్పి జిప్‌ బ్యాగ్‌లో పెట్టి దహన సంస్కారాలకు తరలిస్తారు.

* కరోనాపై పోరాటంలో ప్రధాని మోదీకి అందరూ అండగా ఉండాలని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అన్నారు. రాష్ట్రాల ముఖ్యమంత్రులు చెప్పేది ప్రధాని వినడం లేదంటూ ఝార్ఖండ్‌ సీఎం హేమంత్‌సోరెన్‌ చేసిన ట్వీట్‌పై జగన్‌ స్పందించారు. ఇది కొవిడ్‌పై యుద్ధంలో వేలెత్తి చూపే సమయం కాదని.. ప్రధానికి అండగా నిలవాల్సిన సమయమని హేమంత్‌సోరెన్‌కు జగన్‌ సూచించారు. కరోనా విజృంభిస్తోన్న వేళ తగినంత ఆక్సిజన్‌తో పాటు టీకాలు సరఫరా చేయడం లేదంటూ చాలా మంది ముఖ్యమంత్రులు బహిరంగంగానే కేంద్రాన్ని తప్పుబడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఝార్ఖండ్‌ సీఎం హేమంత్‌సోరెన్‌ కూడా ప్రధానిని విమర్శిస్తూ ట్వీట్‌ చేశారు. సోరెన్‌ చేసిన ట్వీట్‌కు రీట్వీట్‌ చేస్తూ మోదీకి జగన్‌ మద్దతుగా నిలవడం చర్చనీయాంశమైంది.

* భారతీయ జనతా పార్టీకి, సిద్ధార్థ్‌కు మధ్య జరుగుతున్న మాటల యుద్ధం రోజురోజుకీ ముదిరిపోతోంది. కేంద్రంలో ఉన్న భాజపా ప్రభుత్వం ప్రజలకు సాయం చేసే విషయంలో ఎన్నో సందర్భాల్లో విఫలమైందని పేర్కొంటూ గత కొన్నిరోజుల నుంచి సిద్ధార్థ్‌ వరుస ట్వీట్లు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే భాజపాపై ఆయన విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. కాగా, తమ పార్టీని తప్పుబడుతున్న సిద్ధార్థ్‌కు సరైన సమాధానం చెప్పాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్‌ భాజపా నేత విష్ణువర్ధన్‌ రెడ్డి తాజాగా ఓ ట్వీట్‌ పెట్టారు.

* దేశంలో కరోనా వైరస్‌ విజృంభణ కేవలం భారత్‌కే కాకుండా ప్రపంచం మొత్తానికీ ప్రమాదం అని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ అన్నారు. కొవిడ్‌-19 వ్యాప్తి, వ్యాక్సినేషన్‌పై కేంద్ర ప్రభుత్వానికి సరైన వ్యూహం లేకపోవడం వల్లే మహమ్మారి సునామీలా విరుచుకుపడుతోందని ఆరోపించారు. ఈ మేరకు కొవిడ్‌ కట్టడికి పలు సూచనలు చేస్తూ ప్రధాని మోదీకి లేఖ రాశారు. కరోనా వ్యాప్తి భయానకంగా ఉన్న నేపథ్యంలో ప్రజల్ని కాపాడేందుకు చేయాల్సిన ప్రతి చర్య అమలు చేయాలని రాహుల్‌ ప్రధానిని విజ్ఞప్తి చేశారు.

* కొవిడ్‌ నుంచి కోలుకొన్న వారిని బ్లాక్‌ ఫంగల్‌ ఇన్ఫెక్షన్‌ భయపెడుతోంది. ఇటీవల కాలంలో బ్లాక్‌ ఫంగల్‌ కేసులు పెరిగిపోతున్నట్లు దిల్లీ, పుణె, అహ్మదాబాద్‌ల్లోని వైద్యులు గుర్తించారు. గతంలో కొవిడ్‌ ఫస్ట్‌వేవ్‌ సమయంలో కూడా కోలుకొన్న వారిలో కొందరిని ఈ ఇన్ఫెక్షన్‌ సోకింది. తాజా మళ్లీ ఈ రకమైన కేసులు పెరుగుతున్నాయి. తాజాగా దిల్లీలోని గంగారామ్‌ ఆసుపత్రిలో గత రెండు రోజుల్లో ఇటువంటివి ఆరు కేసులను గుర్తించినట్లు ఈఎన్‌టీ సర్జన్‌ మనీష్‌ ముంజల్‌ తెలిపారు. గుజరాత్‌లోని కొన్ని ఆసుపత్రుల్లో ఈ కేసులను గుర్తించారు.

* దేశీయ స్టాక్ మార్కెట్లలో లాభాల జోరు వరుసగా మూడో రోజూ కొనసాగింది. శుక్రవారం సూచీలు లాభాల్లో ముగిశాయి. ఉదయమే సానుకూలంగా ప్రారంభమైన సూచీలు రోజంతా లాభాల బాటలోనే పయనించాయి. ఉదయం 49,169 వద్ద లాభాలతో ప్రారంభమైన సెన్సెక్స్‌ చివరకు 256 పాయింట్లు లాభపడి 49,206 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 49,036 వద్ద కనిష్ఠాన్ని.. 49,417 వద్ద గరిష్ఠాన్ని చవిచూసింది. ఇదే ట్రెండ్‌ కొనసాగించిన నిఫ్టీ రోజులో 14,863-14,765 మధ్య కదలాడి చివరకు 98 పాయింట్లు ఎగబాకి 14,823 వద్ద స్థిరపడింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.73.91 వద్ద నిలిచింది.

* ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం N440K అనే కొత్త రకం కొవిడ్‌-19 వైరస్‌ వ్యాప్తి తీవ్రత లేకపోతే పొరుగు రాష్ట్రాలు ఏపీ నుంచి వచ్చేవారిపై ఎందుకు ఆంక్షలు విధిస్తున్నాయని తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు నిలదీశారు. ఏపీ నుంచి వచ్చేవారు 14 రోజులు క్వారంటైన్‌లో ఉండాలని దిల్లీ సహా వివిధ రాష్ట్రాలు ఆంక్షలు పెట్టాయన్నారు. ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని.. ప్రజల ప్రాణాల కంటే జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చేందుకే ప్రాధాన్యం ఇస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో కరోనా తీవ్రతపై హైకోర్టు అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పగలదా? అని అచ్చెన్న ప్రశ్నించారు. ఇకనైనా తప్పిదాలు కప్పిపెట్టకుండా ప్రతిపక్షాలు, శాస్త్రవేత్తలు, న్యాయస్థానాలు ఇచ్చే సలహాలు, సూచనలు పాటించాలని హితవుపలికారు. 18-45 ఏళ్ల మధ్య వారికి వ్యాక్సిన్‌ ఇవ్వాలనే కేంద్ర మార్గదర్శకాలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని అచ్చెన్నాయుడు డిమాండ్‌ చేశారు.

* ఖమ్మం కార్పొరేషన్‌ మేయర్‌, డిప్యూటీ మేయర్‌ అభ్యర్థులను తెరాస అధిష్ఠానం ఖరారు చేసింది. మేయర్‌గా పునుకొల్లు నీరజ, డిప్యూటీ మేయర్‌గా ఫాతిమా జోహ్రాను ఖరారు చేశారు. ఈ మేరకు మేయర్‌, డిప్యూటీ మేయర్‌ పేర్లను మంత్రి ప్రశాంత్‌ రెడ్డి వెల్లడించారు. ఇటీవల జరిగిన ఖమ్మం కార్పొరేషన్‌ ఎన్నికల్లో 26వ డివిజన్‌ నుంచి పునుకొల్లు నీరజ, 37వ డివిజన్‌ నుంచి ఫాతిమా జోహ్రా విజయం సాధించారు.