Health

అంతర్రాష్ట్ర ప్రయాణీకులకు ఏపీ పోలీసుల సూచనలు-తాజావార్తలు

అంతర్రాష్ట్ర ప్రయాణీకులకు ఏపీ పోలీసుల సూచనలు-తాజావార్తలు

* ఆంధ్రప్రదేశ్‌లో 104 వ్యవస్థ మరింత బలోపేతం కావాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. అధికారులు నిత్యం మాక్‌ కాల్స్‌ చేసి పనితీరు పర్యవేక్షించాలన్నారు. కొవిడ్‌ ప్రత్యేక అధికారులతో ఆయన ఇవాళ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి పలు ఆదేశాలు, సూచనలు చేశారు. 104 నంబర్‌కు కాల్‌ చేసిన వెంటనే కచ్చితంగా స్పందన ఉండాలని.. అవసరమైన వారికి బెడ్‌ కేటాయించేలా చూడాలని స్పష్టం చేశారు. కొవిడ్‌ బాధితుల రద్దీ ఎక్కువగా ఉన్న జిల్లాల్లో పడకలను గణనీయంగా పెంచాలని సూచించారు.

* వైద్య చికిత్సలకు హైదరాబాద్‌ వెళ్లే వారికి ఏపీ పోలీసులు పలు సూచనలు చేశారు. ప్రైవేట్‌ అంబులెన్స్‌లలో వచ్చేవారికి షరతులతో అనుమతులు జారీ చేస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. అలా వీలు కానిపక్షంలో రోగికి చికిత్స చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని.. సదరు వ్యక్తికి తమ ఆస్పత్రిలో పడక సిద్ధంగా ఉన్నట్లు హైదరాబాద్‌కు చెందిన ఆస్పత్రి యాజమాన్యం నుంచి ముందస్తు అంగీకార పత్రాన్ని తీసుకోవాలని సూచించారు. అలాంటి వారికి తెలంగాణలోకి అనుమతి ఉంటుందన్నారు.

* బిహార్‌లోని బక్సర్‌ జిల్లాలో మృతదేహాల కలకలం రేగింది. గంగా నదిలో కిలోమీటర్‌ పరిధిలో 48 మృతదేహాలను గుర్తించారు. కరోనా మృతులను గంగా నదిలో పడేసినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మరోవైపు యమునా నదిలో కూడా భయానక దృశ్యాలు కనిపించాయి. పదికి పైగానే కరోనా మృతదేహాలు నదీ తీరంలో తేలుతూ కనిపించాయి. ఉత్తర ప్రదేశ్‌లోని హామిర్‌పుర్‌ జిల్లాలో కనిపించిన ఈ దృశ్యాలు స్థానికుల్లో భయాందోళన సృష్టించాయి.

* ఇటీవల ముగిసిన పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ సాధించిన ఫలితాలపై ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ పరాభవానికి గల కారణాలను గుర్తించి వెంటనే ‘ఇంటిని చక్కబెట్టాల్సిన అవసరం ఉంది’ అని వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఈరోజు జరిగిన పార్టీ అత్యున్నత నిర్ణాయక మండలి సీడబ్ల్యూసీ సమావేశంలో పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. ఎన్నికలు జరిగిన అస్సాం, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్‌లో కాంగ్రెస్ ఓటమికి గల కారణాలను ఆయా రాష్ట్రాల్లోని సీనియర్‌ నాయకులు పార్టీకి వివరించాలని సోనియా ఆదేశించారు.

* కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నా చాలా మందికి ఆ సంతోషం ఎక్కువ రోజులు నిలవడం లేదు. ‘బ్లాక్‌ ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్‌’రూపంలో మళ్లీ ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. కొవిడ్‌-19ను జయించిన వారిలో ఎక్కువగా దీని ప్రభావం కనిపిస్తున్నట్లు వైద్యులు గుర్తించారు. దిల్లీ, అహ్మదాబాద్ తదితర చోట్ల ఈ ఫంగస్‌ను గుర్తించారు. ఈ సమస్య మరింత పెరుగుతుందనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం, ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) సంయుక్తంగా కొన్ని మార్గదర్శకాలను జారీ చేశాయి. వీటిని కచ్చితంగా పాటిస్తే ఈ ఇన్‌ఫెక్షన్‌ నుంచి బయటపడవచ్చని చెబుతున్నాయి.

* ప్రజలందరికీ టీకాలు ఇవ్వడమే భారత్‌లోని ప్రస్తుత కొవిడ్‌-19 విజృంభణకు దీర్ఘకాలిక పరిష్కారమని అమెరికాకు చెందిన ప్రముఖ అంటువ్యాధుల నిపుణులు ఆంటోనీ ఫౌచీ స్పష్టం చేశారు. దేశీయంగా, ప్రపంచ వ్యాప్తంగా టీకాల ఉత్పత్తిని వేగవంతం చేయాలని ఆయన సూచించారు. ‘‘ ప్రజలకు టీకాలు ఇవ్వడంతోనే ప్రస్తుత సంక్షోభానికి ముగింపు లభిస్తుంది. భారత్‌ ప్రపంచంలోనే అత్యధిక వ్యాక్సిన్లను ఉత్పత్తి చేసే దేశం. వారు టీకాలకు అవసరమైన మెటీరియల్‌ను దేశీయంగా తయారు చేసుకోవడంతోపాటు బయట నుంచి కూడ పొందాలి. లేకపోతే వారి వద్దే భారీ కంపెనీలు ఉంటే వందల మిలియన్ల టీకాలను ఉత్పత్తి చేయాలి’’ అని పేర్కొన్నారు.

* దేశంలో ఇంధన ధరలు మళ్లీ పెరిగాయి. పెట్రోల్ ధరను లీటరుకు 26 పైసలు, డీజిల్​ను లీటర్​కు 34 పైసల చొప్పున పెంచుతూ చమురు సంస్థలు సోమవారం నిర్ణయం తీసుకున్నాయి. తాజా బాదుడుతో దేశ రాజధాని దిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.91.53కి చేరగా.. లీటరు డీజిల్ ధర రూ.82.06కి పెరిగింది. ఇతర నగరాల్లో చూస్తే ముంబయిలో పెట్రోల్ ధర రూ. వందకు చేరువవుతోంది. ప్రస్తుతం లీటరు ధర రూ.97.86గా ఉంది. డీజిల్ ధర రూ.89.17కి చేరింది.

* టీమ్‌ఇండియా క్రికెటర్లు కొవిడ్‌-19 టీకాలను వేయించుకుంటున్నారు. ఇప్పటికే శిఖర్ ధావన్‌ వ్యాక్సిన్‌ వేయించుకున్న సంగతి తెలిసిందే. తాజాగా భారత క్రికెట్‌ జట్టు సారథి విరాట్‌ కోహ్లీ, పొడగరి పేసర్‌ ఇషాంత్‌ శర్మ టీకా వేయించుకున్నారు. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా ద్వారా పంచుకొన్నారు. ప్రజలు సాధ్యమైనంత త్వరగా టీకా వేయించుకొని రక్షణ పొందాలని సూచించారు. భారత్‌ త్వరలోనే ఇంగ్లాండ్‌లో పర్యటించనుంది. మొదట న్యూజిలాండ్‌తో ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ ఆడనుంది. ఆ తర్వాత నెల రోజులు భారత బృందమే రెండు జట్లుగా విడిపోయి సన్నాహక మ్యాచులు ఆడతాయి.

* దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీల్లో వరుసగా నాలుగో సెషన్‌లోనూ లాభాల పరంపర కొనసాగించింది. సోమవారం సెన్సెక్స్‌ 295 పాయింట్లు లాభపడి 49,502 వద్ద ముగిసింది. నిఫ్టీ 119 పాయింట్లు ఎగబాకి 14,942 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.73.35 వద్ద నిలిచింది. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ ఉండటం, కరోనా విజృంభణ ఏమాత్రం తగ్గుముఖం పట్టకపోవడం, వ్యాక్సిన్‌, ఔషధాల కొరత వంటి ప్రతికూల పరిణామాలు ఉన్నప్పటికీ సూచీలు లాభాల్లో పయనిస్తుండడం గమనార్హం.

* ఓ ఆసుపత్రిలోని సమస్యని గమనించి, పరిష్కార మార్గాన్ని చూపింది ‘రాధే శ్యామ్‌’ చిత్ర బృందం. ఇటలీ నేపథ్యంలో పీరియాడికల్‌ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ సినిమా కోసం భారీ ఆసుపత్రి సెట్‌ని రూపొందించారు. చిత్రీకరణ పూర్తవడంతో సెట్‌ని తొలగించి బెడ్లు, స్ట్రెచర్లు తదితర వస్తువుల్ని హైదరాబాద్‌ శివారు ప్రాంతంలోని ఓ చోటుకి తరలించారు. అయితే ఓ ప్రైవేటు ఆసుపత్రిలో నెలకొన్న బెడ్లు కొరత తీర్చేందుకు, కొవిడ్‌ బాధితులకు చేయూత నిచ్చేందుకు ముందుకొచ్చింది చిత్ర బృందం. షూటింగ్‌కి వినియోగించిన 50 బెడ్లు, స్ట్రెచర్లు, సెలైన్‌ స్టాండ్లు, ఆక్సిజన్‌ సిలిండర్లని ఆసుపత్రి వర్గాలకి ఇటీవల అందించింది.

* ఇటీవల భారత్‌కు వచ్చిన జస్టిన్‌ బీబర్‌కి బాడీగార్డ్‌గా వ్యవహరించిన షెరా తాజాగా మరోసారి వార్తలోకెక్కాడు. కేవలం సల్మాన్‌కు కాకుండా ముంబైకు విచ్చేసిన ఎంతో మంది అంతర్జాతీయ ప్రముఖలు.. విల్‌ స్మిత్‌, జాకీచాన్‌, మైకేల్‌ జాక్సన్‌ వంటి వారికి గార్డ్‌గా ఉన్నాడు. షెరా బాలీవుడ్‌ ఫెవరేట్‌ బాడీగార్డ్‌. ఇక సల్మాన్‌తో కలిసి 26 సంవత్సరాల నుంచి ఉంటున్నాడు. ఈ క్రమంలో సల్మాన్‌కు భద్రతగా ఉన్న షెరాకు నెలకు 15 లక్షల వరకు జీతం ఉన్నట్లు సమాచారం. అంటే సంవత్సరానికి రెండు కోట్ల వరకు ఉంటుందన్నమాట.

* తాజాగా ఓ మహిళ ఏకంగా ఏలియన్స్‌ తనను ఇప్పటి వరకు 52 సార్లు కిడ్నాప్‌ చేశాయని.. వాటి సాంకేతికతను తనకు చూపించాయి అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇది ఎంతవరకు వాస్తవమో తెలియదు కానీ ప్రస్తుతం సదరు మహిళ వ్యాఖ్యలు మరోసారి గ్రహాంతర జీవుల ఉనికిపై ఆసక్తి రేకేత్తించాయి.

* ఓ పెళ్లి బరాత్‌ ఛత్తీస్‌గఢ్‌లో తీవ్ర వివాదాస్పదమవుతోంది. పెళ్లి కొడుకు కాం‍గ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడికి దగ్గరి చుట్టరికం. ఉదయం పెళ్లికి కాగా సాయంత్రం బరాత్‌ పెట్టుకున్నారు. అయితే ఈ బరాత్‌కు పెద్ద ఎత్తున బంధువులు, స్నేహితులు పాల్గొన్నారు. ఎంతో ఆనందోత్సాహాల మధ్య బరాత్‌ జరిగింది. డప్పుచప్పుళ్లకు .. కొత్త కొత్త పాటలకు డ్యాన్స్‌లు చేశారు. అయితే ప్రస్తుతం కరోనా వ్యాప్తి ఉందనే పట్టించుకోకుండా ఎంజాయ్‌ చేశారు. కోవిడ్‌నిబంధనలు ఉల్లంఘించారు. వారిపై కేసు నమోదైంది. ఛత్తీస్‌గఢ్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు మోహన్‌ మర్కంట్‌ మేనల్లుడి వరుసయ్యే వ్యక్తికి వివాహం జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన బరాత్‌లో ఎవరూ మాస్క్‌, శానిటైజర్‌ వంటివి పట్టించుకోలేదు. కనీసం భౌతిక దూరంగా కూడా పాటించలేదు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో తమ రాష్ట్రంలో తీవ్ర ఆంక్షలు ఉన్న విషయమే పట్టించుకోలేదు. ఈ బరాత్‌లో ఛత్తీస్‌ఘడ్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు కూడా ఉండడం తీవ్ర వివాదమవుతోంది.

* టీడీపీ అధినేత చంద్రబాబుకు కష్టం చెప్పుకుందామని వస్తే కలవకపోగా తానిచ్చిన అర్జీలు కూడా పట్టించుకోవడంలేదని, ఇదేమిటని ప్రశ్నించడానికి వెళ్తే పోలీసులు అనుమతించడం లేదని ఒక వ్యక్తి హైదరాబాద్‌లోని ఏపీ ప్రతిపక్షనేత చంద్రబాబు ఇంటి సమీపంలో తచ్చాడుతుండగా జూబ్లీహిల్స్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వైఎస్సార్‌ జిల్లా రాజంపేట సమీపంలోని పెనమలూరు మండలం చక్రంపేటకు చెందిన సిరిగిరి సుబ్బారెడ్డి (40) తనకు తన కుటుంబసభ్యుల నుంచి ప్రాణహాని ఉన్నట్లు అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

* ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. ప్రస్తుతం ఆమె విశాఖపట్నంలోని ఓ ఆస్పత్రిలో వైద్యం చేయించుకుంటున్నారు. ఆమె భర్త, వైఎస్సార్‌ సీపీ అరకు పార్లమెంట్‌ అధ్యక్షుడు పరిక్షిత్‌ రాజుకు కూడా కరోనా సోకింది.