Politics

యూపీలో బ్లాక్‌ఫంగస్ కేసులు-తాజావార్తలు

యూపీలో బ్లాక్‌ఫంగస్ కేసులు-తాజావార్తలు

* కరోనాకు తోడు బ్లాక్‌ఫంగస్‌ కేసులు వైద్యులకు తలనొప్పిగా మారాయి. కొద్దిరోజుల క్రితం దిల్లీ, పుణె, అహ్మదాబాద్‌లో ఈ కేసులను వైద్యులు గుర్తించారు. ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లో వెలుగుచూస్తున్న ఈ కేసులు భయాందోళనకు గురిచేస్తున్నాయి. మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లో ఏడు బ్లాక్‌ ఫంగస్‌ కేసులు వెలుగుచూశాయి. ఇందులో హామిదియా అనే ప్రభుత్వ ఆసుపత్రిలో ఆరు, ఓ ప్రైవేటు హాస్పిటల్‌లో మరో కేసును వైద్యులు గుర్తించారు. ఆ వ్యాధిని అరికట్టేందుకు హామిదియాలోని ఓ బాధితుడికి సోమవారం శస్త్రచికిత్స నిర్వహించి ఓ దవడను తొలగించారు. మరో బాధితుడికి కంటిని తొలగించారు.

* రాష్ట్రంలో కరోనా తీవ్రత దృష్ట్యా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి 10రోజుల పాటు లాక్‌డౌన్‌ విధించాలని నిర్ణయించింది. ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ ఆధ్వర్యంలో సమావేశమైన కేబినెట్‌.. ఈ మేరకు పలు నిర్ణయాలు తీసుకుంది. రేపటి (మే 12 నుంచి 22వ తేదీ వరకు) నుంచి 10 రోజుల పాటు లాక్‌డౌన్‌ అమల్లో ఉండనుంది. లాక్‌డౌన్‌ సమయంలో ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకే కార్యకలాపాలకు అవకాశమిచ్చారు. నిత్యావసరాలు, ఇతర వస్తువుల కొనుగోలుకు ఈ సమయంలో వెసులుబాటు కల్పించారు.

* రుయా ఆస్పత్రిలో ఆక్సిజన్‌ అందక కరోనా బాధితులు మృతిచెందిన ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని ఏపీ సీఎం జగన్ అన్నారు. రాష్ర్టంలో బెడ్లు,ఆక్సిజన్‌ కొరతపై తీసుకోవాల్సిన చర్యలపై సీఎం ఇవాళ కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘మన చేతుల్లో లేని అంశాలకు బాధ్యత వహించాల్సి వస్తోంది. తమిళనాడు నుంచి ఆక్సిజన్‌ ట్యాంకర్‌ సరైన సమయానికి రాలేదు. ఆస్పత్రిలో 11 మంది చనిపోయారని అధికారులు చెప్పారు. నిన్న కూడా 6 ట్యాంకర్లను ఒడిశాకు విమానంలో పంపాం. రవాణా సమయాన్ని ఆదా చేయడానికి ఎయిర్‌ లిఫ్ట్ చేశాం’’ అని జగన్‌ అన్నారు.

* తెలంగాణలో కరోనా పరిస్థితులపై హైకోర్టులో విచారణ కొనసాగింది. రాష్ట్ర కేబినెట్‌ లాక్‌డౌన్‌ విధిస్తూ తీసుకున్న నిర్ణయంపై ఏజీ ప్రసాద్‌ న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. 10రోజులపాటు లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా న్యాయస్థానం స్పందిస్తూ వారాంతపు లాక్‌డౌన్‌, రాత్రి కర్ఫ్యూ పొడిగించమంటే పట్టించుకోలేదని.. కేసులు తగ్గుతున్నప్పుడు అకస్మాత్తుగా లాక్‌డౌన్‌ అంటున్నారని హైకోర్టు ఆక్షేపించింది. మరోవైపు ఏపీ సరిహద్దుల వద్ద ఆ రాష్ట్ర అంబులెన్స్‌ల నిలిపివేతపైనా హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. అంబులెన్స్‌లు ఆపడం రాజ్యాంగ విరుద్ధమని తెలుసా అని ప్రశ్నించింది. సర్క్యులర్‌, అడ్వైజరీ లేకుండా ఎలా నిలిపివేస్తారని ఆగ్రహం వ్యక్తం చేసింది. సరిహద్దుల్లో అంబులెన్స్‌లు ఆపొద్దని పోలీసులను ఆదేశించింది.

* దేశంలో కరోనా కరాళనృత్యం చేస్తోంది. ప్రతిరోజూ లక్షలాది కొత్త కేసులు నమోదవుతున్నాయి. వేలా మంది మృత్యువాత పడుతున్నారు. మరోవైపు ఈ మహామ్మారిని పూర్తిగా నిర్మూలించేందుకు ఇప్పటివరకు ఔషధాలేవీ రాలేదు. కొన్ని రకాల వ్యాక్సిన్లు వచ్చినా ఇంకా అందరికీ అందుబాటులో ఉండటం లేదు. ఈ నేపథ్యంలో చాలా మంది సంప్రదాయ వైద్యం వైపు మొగ్గు చూపుతున్నారు. గుజరాత్‌లో కొంత మంది ఆవు పేడ, మూత్రాన్ని ఒంటినిండా పూసుకొంటున్నారు. బాగా ఆరిన తర్వాత పాలు లేదా మజ్జిగతో కడుక్కుంటున్నారు. ఇలా వారానికి కనీసం ఒక రోజైనా చేయడం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని, తద్వారా కరోనా రాకుండా కాపాడుకోవచ్చని వారు బలంగా విశ్వసిస్తున్నారు.

* దక్షిణాది రాష్ట్రం కర్ణాటకలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. దేశవ్యాప్తంగా తాజాగా నమోదైన మొత్తం కేసుల్లో అత్యధిక కేసులు ఈ రాష్ట్రంలోనే వెలుగుచూశాయి. దీంతో ఇప్పటివరకు కరోనా ఉద్ధృతి ఎక్కువగా ఉన్న మహారాష్ట్రను కర్ణాటక అధిగమించింది. సోమవారం ఒక్కరోజే రాష్ట్రంలో దాదాపు 40వేల మంది వైరస్‌ బారినపడటం వైరస్‌ ఉద్థృతికి అద్ధం పడుతోంది. 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 3.29లక్షల కొత్త కేసులు బయటపడగా.. అత్యధికంగా కర్ణాటకలో 39,305 మందికి వైరస్‌ సోకింది. ఇక 37,236 కేసులతో మహారాష్ట్ర రెండో స్థానంలో ఉంది. తాజా కేసులతో కర్ణాటకలో ఇప్పటివరకు 19.73లక్షల మంది కరోనా బారినపడ్డారు.

* ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చిన కరోనా వ్యాక్సిన్‌లు మహమ్మారిని ఎదుర్కోవడంలో సత్ఫలితాలిస్తున్నట్లు వాస్తవ నివేదికలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా వైరస్‌బారిన పడి ప్రాణాలు కోల్పోయే ముప్పు నుంచి పూర్తి రక్షణ కల్పిస్తున్నాయనే వార్తలు మరింత ఊరట కలిగిస్తున్నాయి. ఆస్ట్రాజెనెకా టీకా ఒక డోసు తీసుకున్న వారిలో ప్రాణాలు కోల్పోయే ముప్పు 80శాతం తగ్గుతుందని ఇంగ్లాండ్‌ ప్రజారోగ్య విభాగం (పీహెచ్ఈ‌) జరిపిన అధ్యయనంలో వెల్లడైంది.

* కరోనా మొదటి ఉద్ధృతితో పోలిస్తే రెండో ఉద్ధృతి నాటికి దేశంలో ఆక్సిజన్‌ వినియోగం 188%మేర పెరిగినా ఉత్పత్తి 62శాతం మాత్రమే పెరిగింది. కేంద్ర వాణిజ్యశాఖ సోమవారం విడుదల చేసిన గణాంకాలే ఈ విషయాన్ని వెల్లడించాయి. గత ఏడాది సెప్టెంబర్‌ 29న కేసులు గరిష్ఠ సంఖ్యకు చేరినప్పుడు దేశంలో 3,095 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ విక్రయం జరిగింది. ఈ ఏడాది మే 6వ తేదీ నాటికి అది 8,920 మెట్రిక్‌ టన్నులకు చేరింది. అప్పట్లో ఉత్పత్తి 5,800 టన్నుల మేర ఉండగా, డిమాండ్‌ మాత్రం అందులో 54%మాత్రమే ఉండేది. ఇప్పుడు 9,446 మెట్రిక్‌ టన్నుల ఉత్పత్తి జరుగుతుండగా అందులో 95%మేర డిమాండ్‌ ఉన్నట్లు తేలింది.

* భారత్‌ కరోనా వైరస్‌తో విలవిల్లాడుతున్నా.. సరిహద్దుల్లో చైనా సైన్యం కదలికలు మాత్రం ఆడగం లేదు. తాజాగా పీఎల్‌ఏ ఆధునీకరించిన రాకెట్‌ లాంఛర్లను భారత సరిహద్దులకు తరలించినట్లు చైనాకు చెందిన సీసీటీవీ కథనం ప్రచురించింది. దీనికి సంబంధించిన చిత్రాలను కూడా విడుదల చేసింది. పీహెచ్‌ఎల్‌ 03 రాకెట్‌ లాంఛర్లు, భారీ ఎత్తున శతఘ్నులను షిన్‌జియాంగ్‌ మిలటరీ కమాండ్‌లో మోహరించినట్లు వెల్లడించింది. ప్రస్తుతం టిబెట్‌లోని 5,200 మీటర్ల ఎత్తులో ఈ దళం మోహరించింది.

* వరుసగా గత నాలుగు సెషన్లలో లాభపడ్డ దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు నేడు డీలా పడ్డాయి. ఉదయమే ప్రతికూలంగా ట్రేడింగ్‌ ప్రారంభించిన సూచీలు రోజంతా నష్టాల్లోనే పయనించాయి. ఏ దశలోనూ కొనుగోళ్ల మద్దతు లభించలేదు. చివరకు సెన్సెక్స్‌ 340 పాయింట్లు కోల్పోయి 49,161 వద్ద.. నిఫ్టీ 91 పాయింట్లు దిగజారి 14,850 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.73.33 వద్ద ముగిసింది. అమెరికా మార్కెట్లు సోమవారం ప్రతికూలంగా ముగిశాయి.