Politics

మోడీకి ఆదుకోమని లేఖ రాసిన జగన్

మోడీకి ఆదుకోమని లేఖ రాసిన జగన్

‘ఆంధ్రప్రదేశ్‌కు లిక్విడ్‌ మెడికల్‌ ఆక్సిజన్‌ కోటా 910 మెట్రిక్‌ టన్నులకు పెంచేందుకు మీరు జోక్యం చేసుకోవాలి. ఆ ఆక్సిజన్‌ సరఫరాకు 20 ట్యాంకర్లు కావాలి. ప్రస్తుతం ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న కరోనా రోగులకు భరోసా కల్పించేలా ఆక్సిజన్‌ సరఫరా చేయాల్సి ఉంది. ఈ విషయంలో మీ సానుకూల ఉత్తర్వుల కోసం ఎదురుచూస్తున్నా’ అని ముఖ్యమంత్రి జగన్‌ ప్రధాని మోదీకి మంగళవారం లేఖ రాశారు.
ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి రాసిన లేఖలోని అంశాలివి…
* ఏప్రిల్‌ 24న రాష్ట్రానికి కేంద్రం 480 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ కోటా ఇచ్చింది. ఆనాటికి రాష్ట్రంలో కరోనా రోగుల సంఖ్య 81,471. మే 8న కేంద్రం ఆక్సిజన్‌ కోటాను సవరించింది. అప్పటికి రాష్ట్రంలో కరోనా రోగుల సంఖ్య 1,87,392కి చేరింది. రోగుల పెరుగుదలకు అనుగుణంగా ఆక్సిజన్‌ కోటా పెరగలేదు.
* ఒడిశా నుంచి 210 మెట్రిక్‌ టన్నులు కేటాయించారు. రాయలసీమ ప్రాంతానికి ఒడిశా 1400 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దూరభారంతోపాటు ఆక్సిజన్‌ సరఫరా చేసేందుకు ట్యాంకర్ల కొరత కారణంగా ఇబ్బందులు పడుతున్నాం.
* ఆంధ్రప్రదేశ్‌ ప్రస్తుతం చెన్నైలోని సెయింట్‌ గోబైన్‌ నుంచి 35 మెట్రిక్‌ టన్నులు, శ్రీపెరంబదూర్‌ ఐనాక్స్‌ ప్లాంటు నుంచి 25 మెట్రిక్‌ టన్నులు తీసుకుంటోంది. ఇలా తీసుకోపోతే రాష్ట్రంలోని ఆసుపత్రులు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కుంటాయి. మే 10న కర్ణాటక, చెన్నై సరఫరా దారులు ఆలస్యం చేయడంతో తిరుపతి రుయా ఆసుపత్రిలో 11 మంది మరణించిన దురదృష్టకర ఘటన చోటు చేసుకుంది.
* కర్ణాటకలోని బళ్లారిలోని జేఎస్‌డబ్ల్యు ప్లాంటు తన సామర్ధ్యాన్ని పెంచుకున్నందున ఇక్కడ 20నుంచి 150 మెట్రిక్‌ టన్నులకు కోటా పెంచాలి. ఒడిశా నుంచి కూడా 210 నుంచి 400 టన్నులకు సరఫరా పెంచాలి. దీనికి 20 ఆక్సిజన్‌ ట్యాంకర్లను కేటాయించాలి. సరఫరా వేగంగా జరిగేందుకు రైల్వేతో అనుసంధానం చేయాలి.