Editorials

కరోనాతో మావోయిస్టు అగ్రనేతలు ఖతం

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం దక్షిణ బస్తర్‌ అటవీ ప్రాంతాల్లో కరోనా కలకలంతో దాదాపు 10 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు మంగళవారం అక్కడి పోలీస్‌ ఉన్నతాధికారులకు సమాచారం అందింది. ఇటీవల దండకారణ్య ప్రాంతంలో సుకుమా, దంతెవాడ, బీజాపూర్‌ జిల్లా అటవీ ప్రాంతాల్లో దాదాపు 100 మంది మావోయిస్టులు కరోనా బారినపడ్డారని, విషాహారం కారణంగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారని నిఘావర్గాల ద్వారా అధికారులకు సమాచారం చేరింది. తాజాగా మంగళవారం వీరిలో దాదాపు 10మంది మావోయిస్టులు మృతిచెందినట్లు పోలీస్‌ అధికారులు భావిస్తున్నారు. కరోనా బారినపడిన వారిలో దండకారణ్య స్పెషల్‌ జోనల్‌ కమిటీ నేత సుజాతతో పాటు మావోయిస్టు అగ్రనేతలు జయలాల్‌, దినేశ్‌ కూడా ఉన్నట్లు అధికారులకు సమాచారం ఉంది. మృతిచెందిన మావోయిస్టుల్లో సీఆర్‌సీ సభ్యులు(సెంట్రల్‌ రీజినల్‌ కమాండ్‌) పీఎల్‌జీఏ సభ్యులు, ప్లాటూన్‌ సభ్యులు ఉన్నట్లు పోలీస్‌ అధికారులు అనుమానిస్తున్నారు. వారికి సంబంధించి మరిన్ని వివరాల కోసం ఛత్తీస్‌గఢ్‌ పోలీస్‌ అధికారులు ఇంటెలిజెన్స్‌ వర్గాల ద్వారా దృష్టి సారించినట్లు సమాచారం.