Movies

నిజాయితీగా న్యాయం చేస్తా

నిజాయితీగా న్యాయం చేస్తా

‘దంగల్‌’, ‘థగ్స్‌ ఆఫ్‌ హిందుస్తాన్‌’ లాంటి భారీ చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బాలీవుడ్‌ నాయిక ఫాతిమా సనా షేక్‌. ఇప్పుడు ఈ కథానాయిక తొలిసారి నాయికా ప్రాధాన్య చిత్రంలో నటించనుంది. తమిళంలో మంచి విజయం సాధించిన చిత్రం ‘అరువి’. 2017లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రంలో అదితి బాలన్‌ ప్రధాన పాత్రలో నటించింది. ఇప్పుడు అదితి పాత్రలో ఫాతిమా నటించనుంది. ఈ విషయం గురించి ఫాతిమా మాట్లాడుతూ ‘‘ఇదో మంచి కథ, ఆసక్తిగా సాగే చిత్రమని మాత్రమే ‘అరువి’ గురించి నేను ప్రస్తుతానికి చెప్పగలను. ఒక అమ్మాయి, ఆమె ప్రయాణమే ఈ కథ. నా పాత్ర చుట్టూనే కథ తిరుగుతుందా? లేదా? అనేది నాకు ముఖ్యం కాదు. ఆ ఉద్దేశంతో ఈ సినిమాని అంగీకరించలేదు. నిజాయితీగా నా పాత్రకు న్యాయం చేయగలుగుతానా? లేదా? అనేదే చూసుకున్నాను. కచ్చితంగా ప్రేక్షకులకు నచ్చుతుంది. ఇది రీమేక్‌ అయినా కచ్చితంగా మరిన్ని తాజా అంశాలు ఇందులో ఉండనున్నాయి’’అని చెప్పింది.