NRI-NRT

H4-EADకు గూగుల్ మద్దతు

విదేశాల నుంచి అమెరికాకు వచ్చే అధిక నైపుణ్యం కలిగిన వలసదారులైన హెచ్‌-1బీ వీసాదారుల భాగస్వాములకు వర్క్‌ వీసాలు అందించేందుకు గూగుల్‌ మద్దతు ఇచ్చింది. ఇప్పటికే పలు సంస్థలు సానుకూలంగా అభిప్రాయాలు వ్యక్తం చేయగా, గూగుల్‌ సైతం ఈ జాబితాలో చేరింది. అమెరికాకు వచ్చే వలసదారులకు గూగుల్‌ మద్దతుగా ఉంటుందని సంస్థ సీఈవో సుందర్‌ పిచాయ్ ట్వీట్‌ చేశారు. ఈ మేరకు హెచ్‌-4ఈఏడీ(ఎంప్లాయ్‌మెంట్‌ ఆథరైజేషన్‌ డాక్యుమెంట్‌) కార్యక్రమానికి మద్దతు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. తద్వారా ఆవిష్కరణలు పెరిగి ఉద్యోగ సృష్టి జరుగుతుందన్నారు. ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, వారి కుటుంబాలకు ఈ కార్యక్రమం ప్రయోజనకరంగా నిలుస్తుందని వివరించారు. హెచ్‌-4 వీసాల వల్ల ఉద్యోగాల్లో పోటీ తత్వం దెబ్బతింటోందని అక్కడి కోర్టులో దాఖలైన కేసులో గూగుల్‌ మరో 30 సంస్థల తరపున అఫిడవిట్‌ సమర్పించింది. హెచ్‌-1బీ వీసాదారు కుటుంబ సభ్యులకు అవకాశం కల్పించే వ్యవస్థను కోరుకుంటున్నామని గూగుల్‌ తెలిపింది. దీని ద్వారా సుమారు 90వేల మందికి ప్రయోజనం చేకూరుతుందని గూగుల్‌ న్యాయ విభాగం ఉపాధ్యక్షురాలు కేథరిన్‌ లఖవేరా తెలిపారు. హెచ్‌-1బీ వీసా కలిగిన వారు తమ భాగస్వామితో పాటు పిల్లలు కూడా అమెరికాలో ఉండేందుకు యూఎస్‌ సిటిజన్‌ షిప్‌ అండ్‌ ఇమిగ్రేషన్‌ సర్వీసెస్‌(యూఎస్‌సీఐఎస్‌) అనుమతి ఇస్తుంది. ‘వలసదారులకు మద్దతుగా నిలిచేందుకు మేము ఎంతో గర్విస్తున్నాం. మరో 30 సంస్థలతో కలిసి హెచ్‌-4ఈఏడీ కార్యక్రమానికి మద్దతు ఇస్తున్నాం. దీని వల్ల ఆవిష్కరణలు, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. ఈ కార్యక్రమం వారి కుటుంబాలకు ఉపయోగకరంగా ఉంటుంది’ అని పిచాయ్‌ ట్వీట్‌ చేశారు. అడోబ్‌, అమెజాన్‌, యాపిల్‌, ఈబే, ఐబీఎం, ఇంటెల్‌, మైక్రోసాఫ్ట్‌, పేపాల్‌, ట్విటర్‌ సహా ఇతర కంపెనీలు హెచ్‌-4ఈఏడీ కార్యక్రమానికి మద్దతు తెలిపాయి. ట్రంప్‌ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ‘అమెరికా ఫస్ట్‌’ నినాదంతో అనేక ఆంక్షలు విధించారు. జోబైడెన్‌ అధ్యక్షుడు అయిన తర్వాత ట్రంప్‌ విధించిన నియమ నిబంధనలు, ఆంక్షలను ఉపసంహరించారు.