NRI-NRT

NRC Naidu Funeral In Virginia Tomorrow

NRC Naidu Funeral In Virginia Tomorrow

వాషింగ్టన్ డీసీ, అమెరికా రాజధాని ప్రాంత తెలుగు వారికి చిరపరిచితులు, ప్రవాసాంధ్ర ప్రముఖుడు, ముఖ్యంగా ‘తానా’లో తనదైన క్రియాశీలక పాత్ర పోషించి, నలుగురికి తాల్లో నాలుకలా నిత్యం అందుబాటులో ఉండే రాయలసీమ ప్రవాసుడు, రాజంపేట సమీపంలో గల PVG పల్లెకు చెందిన NRC Naidu (44) శుక్రవారం ఉదయం కరోనాతో పోరాడుతూ కన్నుమూశారు. కార్యక్రమమేదైనా, అన్ని రాజధాని తెలుగు సంస్థలకు అందుబాటులో ఉంటూ, ముఖ్యంగా తానా సంబంధిత కార్యక్రమాల్లో దశాబ్ద కాలంగా పలు విధులు విజయవంతంగా నిర్వహించి, 2019 డీసీ కాన్ఫరెన్స్ లో సతీష్ వేమన మార్గదర్శకత్వంలో ప్రతిష్టాత్మక స్పాన్సర్‌షిప్స్ కమిటీకి అధ్యక్షుడిగా, పలు దాతలను తానా కు అనుసంధానిస్తూ వ్యవహరించిన ఆయన పాత్ర తెలుగు వారందరికీ విదితం. ఆయన డీసీ ప్రాంతంలో సుపరిచితులు. ఆయన మరణం పట్ల తెలుగు వారందరూ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాజకీయంగా కూడా చురుకుగా ఉండే నాయుడు, NRI TDP లో కూడా తన వంతు పాత్ర పోషించి పలువురి మన్ననలు పొందారు.

మంచి మనసుతో, నవ్వుతూ అందర్నీ పలకరిస్తూ నిత్యం పలు కార్యక్రమాల్లో పాల్గొంటూ, ప్రతి వారాంతం స్నేహితులందరికీ తన చేతులతో స్వయంగా వండి వారి తృప్తిలో తన సంతోషాన్ని వెలిబుచ్చి నలుగురి చేత మన్ననలు పొందిన నాయుడి అకాల మరణం ముఖ్యంగా తెలుగువారికి తీరని వేదనను మిగిల్చింది. తమ సోదరుడిని, అంతకు మించి ఆప్తుడిని కోల్పోయామని సతీష్ వేమన కన్నీరు మున్నీరయ్యారు.. అందరివాడుగా నడుచుకున్న ఆయన పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని తానా ప్రముఖులు కోమటి జయరాం, గంగాధర్ నాదెళ్ల, జయశేఖర్ తాళ్లూరి మరియు ప్రవాస తెలుగు వారంతా శ్రద్దాంజలి ఘటించారు.