WorldWonders

పంజాగుట్టలో తమిళ దంపతుల ఆత్మహత్య-తాజావార్తలు

పంజాగుట్టలో తమిళ దంపతుల ఆత్మహత్య-తాజావార్తలు

* పంజాగుట్టలో ఇద్దరు వ్యక్తుల ఆత్మహత్య….దర్యాప్తు చేస్తున్న పంజాగుట్ట పోలీసులు. పంజాగుట్ట పోలీసు స్టేషన్ పరిధిలోని ఒక ప్రముఖ హోటల్ లో పుదుచ్చేరికి చెందిన విజయకుమార్( 34 వయస్సు). శ్యామలదేవి (36 వయస్సు) ఇద్దరు కలిసి ఈ నెల 8 వ తేదీ గది అద్దెకు తీసుకుని ఉంటున్నారు.ఈరోజు ఉదయం నుండి సాయంత్రం వరకు ఎలాంటి ఫుడ్ ఆర్డర్ మరియు రూమ్ సర్వీస్ గురుంచి ఫోన్ చేయకపోవడంతో,ఎంతకీ గది తలుపులు తీయకపోవటం తో అనుమానం వచ్చిన హోటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వగా అక్కడికి చేరుకున్న పంజాగుట్ట పోలీసులు డోర్స్ బద్దలు కొట్టి చూడగా అక్కడ ఇద్దరు విగత జీవులై పడిఉన్నారు.పక్కనే తమిళంలో రాసిన సూసైడ్ నోట్ ను స్వాధీనం చేసుకున్నారు. ప్రాథమిక విచారణలో గతంలోనే ఇద్దరికి వేర్వేరు వ్యక్తులతో వివాహాలు జరిగినట్టు తెలిసింది.వివాహీతర సంబంధమే వీళ్ళిద్దరి ఆత్మహత్యకు కారణంగా భావిస్తున్నారు.
పూర్తి స్థాయిలో తమిళంలో ఉన్న సూసైడ్ నోట్ ని అనువదించిన తరువాత పూర్తి వివరాలు తెలుస్తాయి.

* కేంద్రం పంపిణీ చేసిన వెంటిలేటర్లు లోపభూయిష్టంగా ఉన్నాయంటూ వస్తోన్న ఆరోపణలను ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా పరిగణించారు. దానికి సంబంధించి వెంటనే ఆడిట్‌ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. శనివారం నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశంలో ఆయన దేశంలో నెలకొన్న కొవిడ్ పరిస్థితులను సమీక్షించారు. ఈ సందర్భంగా వెంటిలేటర్ల అంశం చర్చకు వచ్చింది. ‘వెంటిలేటర్ల పనితీరుపై పలు రాష్ట్రాల నుంచి వస్తోన్న ఆరోపణలను ప్రధాని తీవ్రంగా పరిగణించారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తోన్న ఈ వెంటిలేటర్లపై తక్షణమే ఆడిట్ నిర్వహించాలని ఆదేశించారు. అలాగే సరిగా పనిచేస్తోన్న వెంటిలేటర్ల విషయంలో అవసరమైతే ఆరోగ్య కార్యకర్తలకు కొత్తగా శిక్షణ ఇవ్వాలని సూచించారు’ అంటూ కేంద్రప్రభుత్వ ప్రకటన వెల్లడించింది. దాంతో పాటు కరోనా పాజిటివిటీ రేటు అధికంగా ఉన్న ప్రాంతాల్లో టెస్టుల సంఖ్యను పెంచాలని మోదీ ఈ సమావేశంలో సూచించారు. స్థానిక కంటైన్‌మెంట్‌ జోన్ల ఆవశ్యతకను ప్రధానంగా ప్రస్తావించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికి వెళ్లి పరీక్షలు నిర్వహించేలా, ఆక్సిజన్ కొరత లేకుండా చూసేలా వనరులను పెంచాలని ఆయన అధికారులను ఆదేశించారు. పీఎం కేర్స్ నిధులతో పలు రాష్ట్రాలకు కేంద్రం వెంటిలేటర్లను సరఫరా చేసింది. అయితే రాజస్థాన్‌, పంజాబ్‌, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో ఆ వెంటిలేటర్లలో సమస్య తలెత్తినట్లు వార్తా కథనాలు వెల్లడించాయి. ఈ వ్యవహారంపై రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ ట్విటర్‌లో పేర్కొన్నారు. వాటి సేకరణపై కేంద్ర ఆరోగ్య శాఖ వెంటనే దర్యాప్తు జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు..

* రఘురామ కేసు స్పెషల్ మూవ్ పిటిషన్‌పై వాదనలు ముగిశాయి. రఘురామరాజు కాలి దెబ్బల ఫొటోలు చూసిన హైకోర్టు డివిజనల్‌ బెంచ్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే రాష్ట్రంలో ఏం జరుగుతోందని ప్రశ్నించింది. దెబ్బలు నిజమైతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. మెజిస్ట్రేట్ కోర్టులో ఏం జరిగిందో తెలుసుకుని అరగంటలో ఉత్తర్వులిస్తామని తెలిపింది. ఈ క్రమంలోనే రఘురామకు కేంద్రం కల్పించిన వై కేటగిరి భద్రత కొనసాగించాలని ఆయన తరపు న్యాయవాది సీనియర్ లాయర్ ఆదినారాయణరావు కోరారు. రఘురామ కుటుంబ సభ్యులను కూడా అనుమతించాలని కోరారు. అలాగే మెడికల్ కోర్టు నివేదిక రేపు ఉదయం 10:30లోపు ఇచ్చేలా చూడాలని కోర్టును కోరారు. కాగా అంతకుముందు రఘురామ కేసుపై జస్టిస్ ప్రవీణ్‌కుమార్, జస్టిస్ లలితల ఆధ్వర్యంలో స్పెషల్ డివిజన్ బెంచ్‌ విచారణ చేపట్టింది. రఘురామ తరపున సుప్రీంకోర్టు సీనియర్ లాయర్ ఆదినారాయణరావు వాదనలు వినింపించారు. రఘురామను సీఐడీ పోలీసులు కొట్టారని, ఆయన నడవలేక పోతున్నారని, న్యాయవాది ఆదినారాయణరావు అంతకుముందే హైకోర్టుకు రాసిన లేఖలో తెలియజేశారు. దీనిపై మెడికల్ కోర్టు ఏర్పాటు చేసి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

* ఎంపీ రఘు రామకృష్ణ రాజు కేసు విచారణకు హైకోర్టులో జస్టిస్‌ ప్రవీణ్‌ నేతృత్వంలో స్పెషల్‌ డివిజన్‌ బెంచ్‌ ఏర్పాటైంది. రఘురామ తరఫున హైకోర్టులో హేబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ దాఖలైంది. రాష్ట్రంలో ఏం జరుగుతోందని హైకోర్టు ప్రశ్నించింది. ‘‘కస్టడీలో ఉన్న వ్యక్తిని ఎలా కొడతారు? రఘురామకు తగిలినవి తాజా గాయాలని తేలితే తీవ్ర పరిణామాలు’’ తప్పవని హైకోర్టు స్పష్టం చేసింది. ఎంపీ రఘురామ గాయాల పరిశీలనకు వైద్యుల కమిటీని ఏర్పాటు చేసింది.

* ఇజ్రాయెల్‌ మిలటరీ, హమాస్‌ ఉగ్రవాదుల మధ్య పోరు కొనసాగుతోంది. తాజాగా ఇజ్రాయెల్‌ బలగాలు గాజాసిటీలోని విదేశీ మీడియా సంస్థలు కొలువుదీరిన భవనంపై క్షిపణి దాడికి పాల్పడ్డాయి. దాడికి ముందే హెచ్చరికలు చేయడంతో భవనాన్ని అందులోని సిబ్బంది ఖాళీ చేయడంతో ప్రాణాపాయం తప్పింది. హెచ్చరికలు చేసిన గంట వ్యవధిలోనే క్షిపణితో ఇజ్రాయెల్‌ సేనలు దాడికి తెగబడ్డాయి.

* ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం నాటికి తాము తయారు చేసిన 50 మిలియన్ల కరోనా టీకా డోసుల్ని భారత్‌కు అందించేందుకు అమెరికా ఫార్మా దిగ్గజం ఫైజర్‌ సుముఖంగా ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. భారత్‌లో కరోనా టీకాల కొరత కొనసాగుతున్న తరుణంలో ఈ పరిణామాలు చోటుచేసుకుంటుండడం ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు అనేక రాష్ట్రాలు నేరుగా టీకాలను కొనుగోలు చేసేందుకు గ్లోబల్‌ టెండర్లను ఆహ్వానిస్తున్నాయి.

* కరోనా జనాలను అనేక ఇబ్బందులకు గురిచేస్తోంది. ఇప్పుడు చాలామంది ఆక్సిజన్‌ దొరక్క ప్రాణాలు విడుస్తున్నారు. ఇలాంటి సమయంలో కేవలం ఒకే ఒక్క మిస్డ్‌ కాల్‌ ఇస్తే.. మీకు ఆక్సిజన్‌ ఇస్తా అంటున్నారు సోనూసూద్‌. కరోనా తెచ్చిన కష్టకాలంలో హీరోగా నిలబడి ఎందరినో ఆదుకుంటున్న ప్రముఖ నటుడు సోనూసూద్‌ మరో అడుగు ముందుకేశారు. ఆక్సిజన్‌ కోసం ఎదురుచూస్తూ వాటిని కొనలేని పరిస్థితిలో ఉన్న వారికి ఉచితంగా ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లు అందించేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా ఫ్రాన్స్‌తో పాటు పలుదేశాల నుంచి ఆక్సిజన్‌ ప్లాంట్లకు ఆర్డర్లు ఇచ్చారు. దిల్లీలో కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ఆక్సిజన్‌ కావాల్సిన వాళ్లు తనను సంప్రదించాలని ఆయన అన్నారు.

* దేశంలో కోవిడ్‌ విజృంభిస్తుండటంతో ఆస్ట్రేలియా ప్రభుత్వం గత నెలలో భారత్‌ నుంచి వచ్చే విమానాలపై నిషేధం విధించింది. దీనిపై తీవ్ర మిర్శలు తలెత్తడంతో ఈ నెల 15 నుంచి భారత్‌లో చిక్కుకున్న తమ దేశ పౌరులను తీసుకువచ్చేందుకు ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే.

* అంతరిక్ష పరిశోధనలు, ప్రయోగాల్లో చైనా దూసుకుపోతుంది. ఇప్పటికే ఛాంగీ–5 శోధక నౌక ద్వారా చంద్రుడి నమూనాలు భూమీ మీదకు తీసుకువచ్చిన డ్రాగన్‌ దేశం.. వచ్చే ఏడాదికల్లా అంతరిక్షంలో సొంతంగా స్పేస్ స్టేషన్ నిర్మించుకునేందుకు ప్రయత్నించడమే కాక వచ్చే నెలలో ముగ్గురు వ్యోమగాముల్ని అంతరిక్షంలోకి పంపడానికి ప్రయత్నిస్తున్న సంగతి తెలిసందే.

* ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్న సామెతను ఓ వ్యక్తి తన జీవితానికి అన్వయించుకున్నాడు. అప్పులు తీర్చడానికి, తన భార్యతో సంబంధం కొనసాగిస్తున్న వ్యక్తి అడ్డుతొలిగించుకోవటానికి ఓ చక్కటి పథకం వేశాడు. ఆ పథకం పారక చివరకు పోలీసులకు చిక్కి, కటకటాల పాలయ్యాడు. మహారాష్ట్రలో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు… ముంబై, భివాండికి చెందిన తుషార్‌ సిల్వంత్‌ వ్యాపారంలో నష్టాలు రావటంతో బాగా కుమిలిపోయాడు. దానికి తోడు భార్య అతడ్ని వదిలేసి వేరుగా ఉంటోంది. మసాజ్‌ పార్లర్‌లో పనిచేస్తున్న ఆమె ఓ కస్టమర్‌తో వివాహేతర సంబంధం కొనసాగిస్తోందని తుషార్‌కు అనుమానం వచ్చింది. ఈ నేపథ్యంలో అప్పులు తీర్చడానికి, తన భార్యతో సంబంధం కొనసాగిస్తున్న వ్యక్తి అడ్డుతొలిగించుకోవటానికి ఓ చక్కటి పథకం వేశాడు. భార్య ప్రియుడికి ఫోన్‌ చేసి, తననో క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసుగా పరిచయం చేసుకున్నాడు. ‘‘ మసాజ్‌ పార్లర్‌లో పని చేస్తున్న ఆమెతో నీకు ఎఫైర్‌ ఉంది. చట్టపరంగా నీ మీద చర్యలు తీసుకోకుండా ఉండాలంటే రూ.10లక్షలు పంపు’’ అని బెదిరించాడు. దీంతో భయపడిపోయిన బాధితుడు రూ. 5లక్షలు పంపాడు. కొద్దిరోజుల తర్వాత తుషార్‌ మరోసారి బాధితుడికి ఫోన్‌ చేసి మిగిలిన రూ.5లక్షలు డిమాండ్‌ చేశాడు. ఈ సారి తుషార్‌పై అనుమానం వచ్చిన బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుతో అతడి భార్యకు సంబంధం ఉందా అనే కోణంలో విచారణ చేపట్టారు.