Business

పెట్రోల్‌కు పోటీగా పెరుగుతున్న పసిడి-వాణిజ్యం

పెట్రోల్‌కు పోటీగా పెరుగుతున్న పసిడి-వాణిజ్యం

* పసిడి ధర మళ్లీ పెరిగింది. సోమవారం పదిగ్రాములపై రూ.348 పెరిగిన బంగారం ధర మంగళవారం మరోసారి రూ.300లకు పైగా పెరగడం గమనార్హం. దేశరాజధాని దిల్లీలో పసిడి రూ.333 పెరగడంతో 10గ్రాములు రూ.47,833కు చేరింది. అంతర్జాతీయంగా బంగారానికి డిమాండ్‌ ఏర్పడటంతో ధర పెరిగిందని బులియన్‌ ట్రేడింగ్‌ వర్గాలు తెలిపాయి. ఇక వెండి అయితే భారీగా పెరిగింది రూ.2,021 పెరగడంతో కిలో రూ.73,122కు చేరింది. నిన్న కిలో రూ.71,101గా ఉండటం గమనార్హం. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్సు బంగారం ధర 1,869 డాలర్లు కాగా, వెండి ఔన్సు 28.48డాలర్లుగా నమోదైంది. డాలర్‌ బలహీనపడిన కారణంగానే పసిడి ధరలు పెరుగుతున్నాయని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యురిటీస్‌ విశ్లేషకుడు తపన్‌ పటేల్‌ పేర్కొన్నారు. ఇక హైదరాబాద్‌లో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి రూ.50వేలకు పైగా ట్రేడ్‌ అవుతోంది. సోమవారం పది గ్రాములు రూ.49,260 వద్ద ముగిసిన సంగతి తెలిసిందే.

* కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు మీకు 50 వేల రూపాయల నగదు బహుమతిని గెలుచుకునే అవకాశం అందిస్తుంది. 50 వేల రూపాయలను గెలుచుకోవడానికి ప్రభుత్వం ఒక ప్రత్యేక పోటీని నిర్వహిస్తుంది. దీనిలో గెలచిన వారికి మొదటి బహుమతి కింద రూ.50 వేల అందజేస్తారు. ఇందులో పాల్గొనడానికి మీరు ఎక్కడికీ వెళ్ళవలసిన అవసరం లేదు. మీరు ఇంటి నుంచే ఇందులో పాల్గొనవచ్చు. ఈ పోటీలో భాగంగా మీరు వన్ నేషన్-వన్ రేషన్ కార్డ్ పథకం లోగోను తయారు చేయాలి. మీరు డిజైనింగ్‌లో నిపుణులైతే, లాక్‌డౌన్‌లో ఇది మీకు మంచి ఆదాయ వనరుగా మారుతుంది. దీనికి సంబంధించిన సమాచారం మై గోవ్ ఇండియా అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో ఇవ్వబడింది. ఇందుకోసం, మొదట మీరు భారత ప్రభుత్వ ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ ప్రారంభించిన లోగో డిజైన్ పోటీలో భాగం కావాలి. మీరు 31 మే 2021 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోటీలో గెలిచిన మొదటి వ్యక్తికి 50 వేల రూపాయల నగదుతో పాటు ఈ-సర్టిఫికేట్ ఇవ్వబడుతుంది. ఇక మిగత ముగ్గురికి ఈ-సర్టిఫికేట్ ఇవ్వనున్నట్లు పేర్కొంది.

* స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాలతో ముగిశాయి. దేశంలో కోవిడ్‌ కేసుల్లో తగ్గుదలతో పాటు అంతర్జాతీయ మార్కెట్ల సంకేతాలు, డీఆర్‌డీఓ అభివృద్ధి చేసిన 2డీజీ ఔషధం విడుదల కావడం వంటి పరిణామాలు మార్కెట్లపై సానుకూల ప్రభావం చూపించాయి. దీంతో దేశీయ మార్కెట్లు లాభాల బాటలో పయనించాయి. మార్చి 12 తరువాత నిఫ్టీ మొదటిసారి 15,000 పాయింట్లను దాటగలిగింది. ఇక ట్రేడింగ్ ముగిసే సమయానికి 184.95 పాయింట్లు లేదా 1.24 శాతం లాభంతో 15,108.10 వద్ద ముగిసింది. అదే సమయంలో సెన్సెక్స్ 612.60 పాయింట్లు లేదా 1.24 శాతం పెరుగుదలతో 50,193.33 వద్ద స్టిర పడింది.

* టీవీఎస్ మోటార్స్ ఎన్‌టీఓఆర్క్యూ(ణ్టోఋQ) 125 స్కూటర్ సరికొత్త రికార్డ్ సృష్టించింది. ఈ స్కూటర్ అంతర్జాతీయ మార్కెట్లలో తక్కువ కాలంలో లక్ష యూనిట్ల అమ్మకాల మైలురాయిని దాటినట్లు టీవీఎస్ మోటార్ కంపెనీ ప్రకటించింది. ఎన్‌టీఓఆర్క్యూ దక్షిణ ఆసియా, పశ్చిమ ఆసియా, ఆసియాన్, లాటిన్ అమెరికాలోని 19 దేశాలలో తమకు కొనుగోలుదారులు ఉన్నట్లు పేర్కొంది. టీవీఎస్ మోటార్ కంపెనీ డైరెక్టర్, సీఈఓ కెఎన్ రాధాకృష్ణన్ మాట్లాడుతూ.. మా స్మార్ట్ స్కూటర్ టీవీఎస్ ఎన్‌టీఓఆర్క్యూ 125 అంతర్జాతీయ మార్కెట్లలో 1 లక్షల అమ్మకాల మైలురాయిని దాటింది. ఈ స్కూటర్ ప్రారంభించినప్పటి నుంచి స్కూటర్ ప్రపంచవ్యాప్తంగా జెన్ జెడ్ కస్టమర్లను భాగ ఆకర్షిస్తుంది. దీనికి ప్రధాన కారణం స్కూటర్ అద్భుతమైన ప్రదర్శన, అందులో ఉన్న సాంకేతికత, ఉన్నతమైన పనితీరు వంటి అంశాలు అందరికి చేరుకోవడానికి దోహదపడ్డాయి అని చెప్పారు.