ScienceAndTech

సముద్ర వనరులపై కన్నేసిన రిలయన్స్-తాజావార్తలు

సముద్ర వనరులపై కన్నేసిన రిలయన్స్-తాజావార్తలు

* టెలికాం రంగంలో సంచలనాలకు వేదికైన రిలయన్స్‌ జియో ఇన్ఫోకామ్‌ మరో ఘనతను సాధించబోతోంది. అధికమవుతున్న డేటా అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రపంచంలో భారీ స్థాయిలో సబ్‌మెరైన్‌ కేబుల్‌ సిస్టమ్‌ ప్రాజెక్టులకు కంపెనీ శ్రీకారం చుట్టింది. సముద్ర మార్గం ద్వారా అత్యాధునిక కేబుల్స్‌తో ఇండియా ఆసియా ఎక్స్‌ప్రెస్, ఇండియా యూరప్‌ ఎక్స్‌ప్రెస్‌ పేరుతో ఈ ప్రాజెక్టులను అమలు చేయనుంది. ముంబై, చెన్నై కేంద్రంగా 16,000 కిలోమీటర్ల పొడవున సముద్రంలో కేబుల్స్‌ వేస్తారు. సెకనుకు 200 టెరాబైట్స్‌ వేగంతో ఇంటర్నెట్‌ సామర్థ్యం ఉంటుంది. భారత్‌తో తూర్పున సింగపూర్, థాయ్‌లాండ్, మలేషియా.. పశ్చిమాన ఈజిప్ట్, జిబూటీ, సౌదీ అరేబియాతోపాటు ఇటలీని కనెక్ట్‌ చేస్తారు. 2024 ప్రారంభం నాటికి ఇవి పూర్తి అవుతాయి. రెండు ప్రాజెక్టులు ఒకదానితో ఒకటి అనుసంధానమై, అంతర్జాతీయ డేటా ఇంటర్‌ఇంటర్ ఎక్స్ ఛేంజ్ పాయింట్లను కలుపుతారు. భారత్‌తో పాటు, వెలుపల కూడా వినియోగదార్లు, కంపెనీలకు కంటెంట్, క్లౌడ్‌ సేవల విషయంలో సామర్థ్యం పెంచేందుకు ఈ ప్రాజెక్టులు దోహదం చేస్తాయని రిలయన్స్‌ జియో వెల్లడించింది. ‘ఫైబర్‌ ఆప్టిక్‌ సబ్‌మెరైన్‌ టెలికమ్యూనికేషన్ల చరిత్రలో మొదటిసారిగా ఈ వ్యవస్థలు భారతదేశాన్ని అంతర్జాతీయ నెట్‌వర్క్‌ పటంలో ఉంచుతాయి. భారత్‌లో డిజిటల్‌ సేవలు, డేటా వినియోగం వృద్ధిలో జియో ముందుంది. భారత్‌ కేంద్రంగా తొలిసారి సబ్‌మెరైన్‌ కేబుల్‌ సిస్టమ్‌ ప్రాజెక్టుల నిర్మాణంలో నాయకత్వ పాత్రను పోషిస్తున్నాం’ అని రిలయన్స్‌ జియో ప్రెసిడెంట్‌ మాథ్యూ ఊమెన్‌ వ్యాఖ్యానించారు.

* వివిధ రాష్ట్రాలు ఆంక్షలు, లాక్‌డౌన్‌లు విధించడంతో కరోనా కల్లోల పరిస్థితులు ఇప్పుడిప్పుడే దారికి వస్తున్నాయి. రోజువారీ నమోదవుతున్న కేసుల్లో తగ్గుదలే ఇందుకు కారణం. మరోవైపు కరోనా నుంచి కోలుకునేవారు పెరుగుతున్నారు. కేవలం, కరోనా కేసులు, మరణాల వార్తలే కాదు, కొన్ని పాజిటివ్‌ పాయింట్లను మీ ముందుకు తీసుకొస్తున్నాం. అంటే కరోనావేళ మీరనుకునే ‘పాజిటివ్‌’ కాదులెండి..! కాస్త ఉపశమనమిచ్చే అంశాలు..

👍 దేశంలో కరోనా నుంచి కోలుకునే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గత 24 గంటల్లో 4.22లక్షల మంది కరోనా బారి నుంచి బయటపడ్డారు. గత 5 రోజులుగా కొత్త కేసుల కన్నా రికవరీ కేసులే అధికంగా ఉండటం ఊరటనిచ్చే అంశం.
👍 స్టాండర్డ్‌ ఛార్టెడ్‌ బ్యాంకు తన ఉద్యోగులకోసం ప్రత్యేక సదుపాయాలు ప్రకటించింది. కరోనా బారినపడి ఐసీయూలో చికిత్స పొందుతున్న వారికి వైద్య ఖర్చుల్లో రూ.2.5లక్షలు రీఇంబర్స్‌మెంట్‌ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. అదే విధంగా ఆరు నెలల ముందస్తు జీతాన్ని అది కూడా వడ్డీ రహితంగా ఇవ్వనున్నట్లు తెలిపింది. కరోనాతో బాధపడుతూ చనిపోయిన ఉద్యోగి కుటుంబానికి నాలుగు సంవత్సరాల వేతనాన్ని అందించనున్నట్లు ప్రకటించింది.

👍 ప్రపంచ దేశాలకు 8 కోట్ల టీకాలను అందించనున్నట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ వెల్లడించారు. ఫైజర్‌, మోడెర్నా, జాన్సన్ అండ్‌ జాన్సన్ టీకాలను వచ్చే ఆరు వారాల్లో ప్రపంచ దేశాలకు అందించనున్నట్లు ప్రకటించారు.
👍 భారత్‌లో వెలుగుచూసిన కొత్తరకం కరోనా వేరియంట్లపై ఫైజర్‌, మోడెర్నా టీకాలు సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు పరిశోధనలో వెల్లడైంది. అమెరికాకు చెందిన ఎన్‌వైయూ గ్రాస్‌మాన్‌ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌, లాంగోన్‌ సెంటర్‌కు చెందిన పరిశోధకులు సంయుక్తంగా ఈ పరిశోధనను నిర్వహించారు.

👍 కొవిడ్‌తో తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయి అనాథలైన పిల్లలకు 25ఏళ్లు వచ్చేదాకా నెలకు రూ.2500 చొప్పున ఆర్థిక సాయంతో పాటు ఉచిత విద్య అందిస్తామని దిల్లీ సీఎం కేజ్రీవాల్‌ ప్రకటించారు. ఇంట్లో సంపాదించే వ్యక్తిని కోల్పోవడంతో ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు నెలకు రూ.2500 చొప్పున ఇస్తామన్నారు. ఇంట్లో సంపాదించే భర్తను కోల్పోయిన భార్యకు; వివాహం కాని కొడుకును కోల్పోయిన తల్లిదండ్రులకు ఈ సాయాన్ని అందజేస్తామన్నారు.
👍 కరోనా క్లిష్ట పరిస్థితుల నేపథ్యంలో ప్రముఖ ప్రీమియం మోటార్‌ సైకిల్‌ బ్రాండ్‌ కేటీఎం(బజాజ్‌ ఆటో గ్రూప్‌) తన వినియోగదారులకు ఓ సదవకాశాన్నిచ్చింది. మే 31వ తేదీతో ముగిసే కేటీఎం బైక్‌ సర్వీస్‌, వారెంటీ గడువును ఈ ఏడాది జులై 31 వరకూ పొడిగిస్తున్నట్లు తెలిపింది.

👍 కరోనావైరస్‌ను అత్యంత సమర్థంగా అడ్డుకుంటున్న ఫైజర్‌ టీకాల విషయంలో మరో సానుకూల కబురును ఐరోపా మెడిసిన్‌ ఏజెన్సీ తెలిపింది. ఒక సారి అత్యంత శీతల వాతవారణం నుంచి బయటకు తీసుకు వచ్చిన టీకాల వయల్స్‌ను వినియోగించకపోతే నెలరోజుల వరకు ఫ్రిజ్‌లో నిల్వ ఉంచవచ్చని పేర్కొంది. ప్రస్తుతం ఈ పరిమితి ఐదురోజుల వరకే ఉంది.
👍 కరోనా సెకండ్‌ వేవ్‌ ఉద్ధృతి కొనసాగుతుండటంతో రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను పొడిగించాలని ఒడిశా ప్రభుత్వం నిర్ణయించింది. వైరస్‌ కట్టడే లక్ష్యంగా ప్రస్తుతం రాష్ట్రంలో కొనసాగుతున్న లాక్‌డౌన్‌ను జూన్‌ 1వరకు కొనసాగించనున్నట్టు వెల్లడించింది.

👍 కరోనాపై పోరాటంలో ఆన్‌లైన్‌ ట్రావెల్‌ సొల్యూషన్స్‌ ఈజీ మైట్రిప్‌ తనవంతు ప్రయత్నం చేస్తోంది. 550 ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్స్‌ను ఆస్పత్రులు, ఎన్జీవోలకు అందిస్తామని ప్రకటించింది.
👍 ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌ ద్వారా దేశవ్యాప్తంగా వివిధ ఆస్పత్రులకు 11వేల మెట్రిక్‌ టన్నుల లిక్విడ్‌ ఆక్సిజన్‌ సరఫరా చేసినట్లు రైల్వేశాఖ తెలిపింది.

* తన బొందిలో ప్రాణమున్నంత వరకూ హుజూరాబాద్‌ నియోజకవర్గ ప్రజలను కాపాడుకుంటానని మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. నాగార్జునసాగర్‌లో గెలిచినట్లు ఇక్కడా చేస్తామంటే ప్రజలు పాతరేస్తారని తెరాస నేతలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాకు చెందిన ఓ మంత్రిపై పరోక్షంగా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. స్థానిక నేతలను బ్లాక్‌ మెయిల్‌ చేసే పద్ధతి మానుకోవాలని హితవు పలికారు. కులమతాలకు సంబంధం లేకుండా అందరి ఆత్మగౌరవ బావుటా ఎగురవేస్తానని చెప్పారు. తెలంగాణ ఉద్యమానికి హుజూరాబాద్‌ అండగా ఉందన్నారు. మంగళవారం హుజూరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఈటల మాట్లాడారు.

* మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని మంత్రి గంగుల కమలాకర్‌ డిమాండ్‌ చేశారు. రాజీనామా చేస్తే ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుందామని సవాల్‌ విసిరారు. హుజూరాబాద్‌లో ఈటల పరోక్షంగా విమర్శలు చేసిన నేపథ్యంలో కరీంనగర్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో గంగుల మాట్లాడారు. పదవుల కోసం పెదవులు మూయను అని చెప్పిన ఈటల.. కేబినెట్‌ నుంచి బర్తరఫ్‌ చేసినా పదవి పట్టుకుని ఊగుతున్నారని ఆక్షేపించారు. ఇది ఆత్మగౌరవమా?ఆత్మ వంచనా?అనేది ఆత్మవిమర్శ చేసుకోవాలని హితవు పలికారు. ప్రజలంతా నీ వెంటే ఉన్నపుడు రాజీనామా ఎందుకు చేయడం లేదని ఈటలను నిలదీశారు.

* ర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు సికింద్రాబాద్‌ ఆర్మీ ఆస్పత్రిలో వైద్యపరీక్షలు కొనసాగుతున్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నిన్న రాత్రి గుంటూరు నుంచి సికింద్రాబాద్‌ తిరుమలగిరిలోని ఆర్మీ ఆస్పత్రికి ఏపీ సీఐడీ పోలీసులు తీసుకొచ్చారు. ఆర్మీ ఆస్పత్రిలోని ముగ్గురు వైద్యుల బృందం రఘురామకు వైద్య పరీక్షలు నిర్వహిస్తోంది. వైద్య పరీక్షలను వీడియోలో చిత్రీకరిస్తున్నారు. అనంతరం పరీక్షల నివేదికను సీల్డ్‌ కవర్‌లో హైకోర్టు రిజిస్ట్రార్‌ ద్వారా సుప్రీంకోర్టుకు అందజేయనున్నారు. మరోవైపు ఆస్పత్రి వద్ద పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.

* ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ ఎంపీ రఘురామకృష్ణరాజు చేస్తున్న వ్యాఖ్యల వెనుక కుట్ర కోణం ఉందని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. రఘురామను తెదేపా పావుగా వాడుకొని ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర చేస్తోందని ఆరోపించారు. రఘురామపై సీఐడీ సుమోటోగా కేసు నమోదు చేసి అరెస్టు చేసిందన్నారు. ఆయన విషయంలో ఎక్కడా ప్రభుత్వానికి సంబంధం లేదని స్పష్టం చేశారు. ప్రత్యర్థులపై రాజద్రోహం కేసు పెట్టడం తానెప్పుడూ చూడలేదని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారని చెబుతూ.. ఆయన హయాంలో కేసీఆర్‌పై 12 రాజద్రోహం కేసులు పెట్టారని సజ్జల గుర్తు చేశారు.

* కరోనా మహమ్మారి అందరి జీవితాలను తలకిందులు చేస్తోంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఎందరో కరోనా మహమ్మారికి బలవుతూ వస్తున్నారు. ఈ మహమ్మారి పలువురు క్రికెటర్ల ఇళ్లలో విషాదాలు నింపుతూ వస్తుంది. ఇప్పటికే టీమిండియా మాజీ క్రికెటర్లు పియూష్‌ చావ్లా, ఆర్పీ సింగ్‌ కరోనా కారణంగా తమ తండ్రులను కోల్పోగా.. టీమిండియా మహిళా క్రికెటర్‌ వేదా కృష్ణమూర్తి రెండు వారాల వ్యవధిలో సోదరిని, తల్లిని కోల్పోయింది. తాజాగా మరో టీమిండియా మహిళా క్రికెటర్‌ ప్రియా పూనియా తల్లి కరోనా కాటుకు బలైపోయారు.