Health

తగ్గుతున్న కేసులు. పెరుగుతున్న మరణాలు-TNI కోవిద్ బులెటిన్

తగ్గుతున్న కేసులు. పెరుగుతున్న మరణాలు-TNI కోవిద్ బులెటిన్

* దేశవ్యాప్తంగా కరోనా విలయం కొనసాగుతోంది. కొద్ది రోజులుగా కొత్త కేసుల్లో తగ్గుదల కనిపిస్తున్నప్పటికీ.. మృత్యుఘోష మాత్రం ఆగట్లేదు. 24 గంటల వ్యవధిలో రికార్డుస్థాయి మరణాలు సంభవించడం వైద్య వ్యవస్థకు సవాలుగా మారింది. మంగళవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం..సోమవారం 18,69,223 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా..2,63,533 మందికి పాజిటివ్‌గా తేలింది. వరసగా ఐదో రోజు కొత్త కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. మరణాలు మాత్రం అత్యధికంగా నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే 4,329 మంది మృత్యుఒడికి చేరుకున్నారు. ఇప్పటివరకు నమోదైన అత్యధిక మరణాలు ఇవే. మే 11(4,205)న మరణాలు సంభవించాయి. ప్రస్తుతం 2.52 కోట్ల మందికి పాజిటివ్‌గా తేలగా.. 2,78,719 మంది ప్రాణాలు గాల్లో కలిశాయి. కొత్త కేసుల తగ్గుదలతో క్రియాశీల కేసుల్లో భారీ తగ్గుదల కనిపించింది. ప్రస్తుతం 33,53,765 మంది కొవిడ్‌తో బాధపడుతుండగా.. క్రియాశీల రేటు 13.29 శాతంగా ఉంది. ఇంత ఉద్ధృతిలోనూ రికవరీల సంఖ్య ఊరటనిస్తోంది. నిన్న 4,22,436 మంది కోలుకున్నారు. మొత్తంగా 2,15,96,512 మంది వైరస్‌ను జయించారు. రికవరీ రేటు 85.60 శాతంగా ఉంది. మరోవైపు, నిన్న 15,10,418 మందికి టీకా అందింది. మొత్తంగా 18.44 కోట్ల టీకా డోసుల పంపిణీ జరిగింది.

* సోమవారం మహారాష్ట్రలో భారీగా కరోనా మరణాలు సంభవించాయి. ఒక్కరోజులో వెయ్యిమంది ప్రాణాలు కోల్పోయారు. మార్చి 30 తరవాత కొత్త కేసులు సంఖ్య 30 వేల దిగువకు చేరినప్పటికీ..మృతుల సంఖ్య ప్రభుత్వాన్ని కలవరపెడుతోంది. తాజాగా అక్కడ 26,616 మందికి కరోనా సోకింది. ప్రస్తుతం కర్ణాటక(38,603), తమిళనాడు(33,075)లో వైరస్ ఉద్ధృతి తీవ్రంగా ఉంది. కర్ణాటకలో 476 మంది మరణించగా..తమిళనాడు, దిల్లీలో 300 మందికి పైగా మృత్యుఒడికి చేరుకున్నారు.

* కృష్ణాజిల్లాలో తొలి బ్లాక్ ఫంగస్ కేసు గుర్తింపు. ఉయ్యురుకి చెందిన పంచాయితీ కార్యదర్శి బ్లాక్ ఫంగస్ తో మృతి. విచారణకి ఆదేశించిన కలెక్టర్ ఇంతియాజ్. కాటూరు పంచాయితీ కార్యదర్శిగా పనిచేస్తున్న బాణవతు రాజశేఖర్. తిరువూరు నియోజకవర్గం ఏ. కొండూరు మండల గొల్లమందల గ్రామానికి చెందిన బాణవతు రాజశేఖర్.

* ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా సోకిన బాధితులకు అత్యవసర వైద్య చికిత్సలో ఉపయోగించే ప్లాస్మా థెరపీని కరోనా ప్రోటోకాల్‌ నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది. కొవిడ్ ప్రోటోకాల్ టాస్క్ ఫోర్స్, వైద్యారోగ్యశాఖ, ఎయిమ్స్, ఐసీఎంఆర్ సంయుక్తంగా ప్రకటించి, ఉత్తర్వులు జారీ చేశాయి. దీంతో ఇకపై కరోనా చికిత్సలో వినియోగించే ప్లాస్మా థెరపీ నిలిచిపోనుంది. కరోనా నుంచి కోలుకున్న వ్యక్తులు కొద్ది రోజుల ద్వారా ప్లాస్మా దానం చేస్తుండగా.. పరిస్థితి విషమంగా ఉన్న బాధితులకు ఇచ్చేవారు. తద్వారా రోగి శరీరంలో యాంటీబాడీలు తయారై కరోనాను అడ్డుకుంటాయని పలువురు వైద్యులు పేర్కొన్నారు. అయితే, ప్మాస్మా థెరపీ వల్ల మరణాలను అడ్డుకోలేమని, పెద్ద ఉపయోగం లేదని ఐసీఎంఆర్ గతంలోనే పేర్కొంది.

* తెలంగాణ‌లోని ప్రైవేటు ఆస్ప‌త్రుల్లో క‌రోనా వైద్యానికి ధ‌ర‌లు నిర్ణ‌యించమ‌ని హైకోర్టు ఆదేశించినా ఆ మేర‌కు చ‌ర్య‌లు చేప‌ట్ట‌లేద‌ని సీఎల్పీ నేత భ‌ట్టి విక్ర‌మార్క అన్నారు. సీఎం దీనిపై టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేస్తూ జీవో ఇచ్చార‌ని గుర్తు చేశారు. ఆ టాస్క్‌ఫోర్స్ ఏం చేస్తుందో తెలియ‌డం లేద‌ని ఆగ్రహం వ్య‌క్తం చేశారు. భట్టి విక్రమార్క జూమ్ యాప్ ద్వారా మీడియా సమావేశం నిర్వ‌హించారు. క‌రోనా ఉద్ధృతిపై సీఎస్‌కు ఫోన్ చేసి అప్ర‌మ‌త్తం చేయ‌మ‌ని చెప్పినా ప‌ట్టించుకోవ‌డం లేద‌ని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో లాక్‌డౌన్ వ‌ల్ల ప్ర‌యోజనం లేద‌ని సీఎస్ అన్నార‌ని.. హైకోర్టు ఒత్తిడితోనే లాక్‌డౌన్ అమ‌లు చేస్తున్నార‌న్నారు.