Health

ఏపీలో కోవిద్ ఆరాకు ప్రత్యేక బృందం-TNI బులెటిన్

New Team Comes To AP To Enquire On COVID

* ఏపీ రాష్ట్రంలో క్షేత్రస్థాయి కొవిడ్ పరిస్థితుల ఆరాకు ప్రత్యేక బృందం..విశాఖపట్నం నుంచి విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకున్న నౌకాయాన బృందం..కృష్ణతో పాటు చుట్టుపక్కల జిల్లాల్లో అత్యవసర ప్రాణవాయువు అవసరత, ఇతర అంశాలపై అధ్యయనం..రూపొందించిన నివేదికను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అందజేయనున్నట్లు సమాచారం..విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో విజయవాడ వెళ్లిన బృందం..రానున్న రెండ్రోజుల్లో తొలుత కృష్ణ, గుంటూరు జిల్లాల్లో పర్యటించనున్నట్లు తెలుస్తోంది..

* మహమ్మారి కరోనా వైరస్‌కు ఉత్తరప్రదేశ్‌కు చెందిన మరో మంత్రి బలయ్యాడు. కరోనాతో ఆస్పత్రిలో పోరాడుతూ చివరకు కన్నుమూశాడు. విజయ్‌ కశ్యప్‌ (56) ముజఫర్‌నగర్‌ జిల్లా చర్తవాల్‌ ఎమ్మెల్యేగా ఎన్నికై ఉత్తరప్రదేశ్‌ రెవెన్యూ, వరద నియంత్రణ శాఖ మంత్రిగా నియమితులయ్యారు. ఆయన మృతితో కరోనాతో మృతి చెందిన మంత్రులు ముగ్గురయ్యారు.

* దేశమంతా కరోనా వైరస్‌ ఉద్ధృతితో వణుకుతుంటే.. మరోవైపు, కొవిడ్‌ నుంచి కోలుకున్న తర్వాత మ్యుకర్‌మైకోసిస్‌ (బ్లాక్‌ ఫంగస్‌) వ్యాధి లక్షణాలు కనబడటం కలవరపెడుతోంది. బ్లాక్‌ ఫంగస్‌ కేసులు పెరగడంతో రాజస్థాన్‌ కీలక ప్రకటన చేసింది. దీన్ని ఎపిడెమిక్‌గా ప్రకటించింది. దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా నుంచి కోలుకున్నవారిలో బ్లాక్‌ ఫంగస్‌ లక్షణాలు కనబడటంతో పాటు పలువురు మరణిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం రాజస్థాన్‌లో దాదాపు 100 మంది బ్లాక్‌ఫంగస్‌ బారిన పడినట్టు గుర్తించారు. అయితే, వీరందరినీ వేరు చేసి చికిత్స కోసం జైపూర్‌లోని సవాయ్‌ మాన్‌ సింగ్‌ (ఎస్‌ఎంఎస్‌) ఆస్పత్రిలో ప్రత్యేక వార్డును ఏర్పాటుచేశారు. మ్యుకర్‌ మైకోసిస్‌ను రాజస్థాన్‌ ఎపిడెమిక్‌ యాక్ట్‌ 2020 కింద ఎపిడెమిక్‌గా గుర్తిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫై చేసింది. ఈ మేరకు రాజస్థాన్‌ ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అఖిల్‌ అరోడా నోటిఫికేషన్‌ జారీ చేశారు. బ్లాక్‌ఫంగస్‌కు సమగ్రంగా, సమన్వయంతో చికిత్స అందించేందుకు వీలుగా ఈ చర్య తీసుకున్నట్టు ఆయన తెలిపారు.

* క‌రోనా వ్యాక్సిన్ కోసం గ్లోబల్ టెండర్లను ఆహ్వానించాల‌ని ఇటీవ‌లే తెలంగాణ‌ ప్రభుత్వం నిర్ణ‌యం తీసుకున్న విష‌యం తెలిసిందే. ఈ మేర‌కు గ్లోబల్ టెండర్లను ఆహ్వానిస్తూ ప్ర‌భుత్వం ఈ రోజు షార్ట్ టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ టెండర్ల ద్వారా మొత్తం 10 మిలియన్ డోసుల వ్యాక్సిన్ల‌ను కొనుగోలు చేయ‌డానికి ప్రభుత్వం సిద్ధ‌మైంది. బిడ్ల దాఖలు కోసం జూన్ 4 చివరి తేదీగా ప్ర‌క‌టించింది.

* కోవిడ్ పాజిటీవ్ వచ్చిన వక్తులు రోడ్లపైన తిరిగితే చర్యలు తప్పవని గుంటూరు అర్బన్ ఎస్పీ ఆర్.ఎన్. అమ్మిరెడ్డి ఐపీఎస్ అన్నారు.

* న‌గ‌రంలోని గాంధీ ఆస్ప‌త్రిని ముఖ్య‌మంత్రి కేసీఆర్ బుధ‌వారం మ‌ధ్యాహ్నం సంద‌ర్శించారు. క‌రోనా రోగుల‌కు అందుతున్న సేవ‌ల‌ను ప‌రిశీలించారు. క‌రోనా ఎమర్జెన్సీ వార్డులో చికిత్స పొందుతున్న రోగుల‌ను సీఎం ప‌రామ‌ర్శించి, ధైర్యంగా ఉండాల‌ని చెప్పారు. ఇలాంటి విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో క‌రోనా రోగుల‌కు చికిత్స అందిస్తున్న డాక్ట‌ర్ల‌ను సీఎం కేసీఆర్ అభినందించారు.

* వారం రోజులుగా కర్ణాటకలో మరణాల సంఖ్య కనివినీ ఎరుగని విధంగా నమోదవుతోంది. ఈ నెల 7 నుంచి 13వ తేదీ మధ్య 5,189 మంది మృతిచెందగా….14 నుంచి 17వ తేదీ మధ్యలో 1,601 చనిపోయారు.