ScienceAndTech

చైనాలో కరెంట్ పోతే…బిట్‌కాయిన్ 14శాతం పడిపోతుంది

చైనాలో కరెంట్ పోతే…బిట్‌కాయిన్ 14శాతం పడిపోతుంది

బిట్‌కాయిన్‌.. ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు ఎలెన్‌ మస్క్‌ను కూడా ఊరించింది. దానిని కొననందుకు మస్క్‌ ట్విటర్‌లో చాలాసార్లు పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. ఒక్క మస్కే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా చాలామంది బిట్‌కాయిన్‌ కొననందుకు తమను తాము నిందించుకొన్నారు. కానీ, ఇప్పుడు మెల్లగా పరిస్థితి మారుతోంది. బిట్‌కాయిన్‌ ఒక్క ఏడాదిలో ఎంత వేగంగా విలువను సంపాదించుకొందో.. అంతే వేగంగా కోల్పోతోంది. ఏప్రిల్‌ రెండో వారం నుంచి ఇప్పటి వరకు దాదాపు 30శాతానికి పైగా విలువ కోల్పోయింది. దీనికి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి. ఒకటి చైనా.. రెండోది ఎలెన్‌ మస్క్‌.

*** క్రిప్టోలపై విరుచుకు పడుతున్న డ్రాగన్‌..
చైనా 2019లో క్రిప్టో కరెన్సీల ట్రేడింగ్‌ను నిషేధించింది. కానీ ప్రజలు బిట్‌ కాయిన్‌ ఆన్‌లైన్‌ వంటి ప్లాట్‌ఫామ్‌లపై ట్రేడింగ్‌ చేస్తున్నారు. దీంతో ఆందోళన చెందిన బీజింగ్‌ వరుసగా ఆంక్షలు విధిస్తూ వస్తోంది. తాజాగా మంగళవారం చైనాకు చెందిన ది నేషనల్‌ ఇంటర్నెట్‌ ఫైనాన్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ చైనా, ది చైనా బ్యాంకింగ్‌ అసోసియేషన్‌, ద పేమెంట్‌ అండ్‌ క్లియరింగ్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ చైనా అనే ప్రభుత్వ రంగ సంస్థలు సోషల్‌ మీడియా వేదికగా ప్రజలకు హెచ్చరికలు జారీ చేశాయి. క్రిప్టో కరెన్సీల్లో పెట్టుబడులు పెట్టినా, వాటి లావాదేవీల్లో పాల్గొన్నా.. వాటిలో నష్టాలకు ఎటువంటి రక్షణ ఉండదని తేల్చి చెప్పాయి. బిట్‌కాయిన్‌ విలువలో అత్యంత వేగంగా జరిగే మార్పులు ప్రజల ఆస్తుల భద్రతా ప్రమాణాలను ఉల్లంఘిస్తున్నాయని వివరించాయి. చైనా బలంగా క్రిప్టో కరెన్సీలను అడ్డుకోవడంతో మిగిలిన దేశాలు కూడా ఆ పని చేయాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. ఫేస్‌బుక్‌ లిబ్రా కరెన్సీని కూడా చైనా నిందించింది. ప్రభుత్వ బ్యాంకులే క్రిప్టోకరెన్సీలను నిర్వహించాలని పేర్కొంది.

*** చైనాలో కరెంటు పోతే..
వినియోగంపై నిషేధం ఉన్నా సరే ప్రపంచంలోని బిట్‌కాయిన్లలో 75శాతం మైనింగ్‌ చైనాలోనే చేస్తారు. వీటిని సృష్టించడానికి భారీగా విద్యుత్తు అవసరమవుతుంది. చైనాలోని షిన్‌జియాంగ్‌ ప్రావిన్స్‌లో ఏప్రిల్‌ మూడోవారంలో విద్యుత్తు ఉత్పత్తి సంస్థల్లో సమస్యలు వచ్చాయి. విద్యుత్తును నిలిపివేశారు. దీంతో ఒక్కసారిగా బిట్‌కాయిన్‌ విలువ 14శాతం వరకు పడిపోయింది. దీనిని బట్టే బిట్‌కాయిన్లపై చైనా పట్టు అర్థమవుతుంది.

*** మాటమార్చిన మస్క్‌
టెస్లా బాస్‌ ఎలన్‌ మస్క్‌ బిట్‌కాయిన్‌పై మాటమార్చడం కూడా దీని విలువ పడిపోవడానికి ఓ కారణమైంది. మార్చిలో టెస్లా బిట్‌కాయిన్ల చెల్లింపులను తమ సంస్థ ఆమోదిస్తుందని ప్రకటించింది. దీంతో బిట్‌కాయిన్‌ విలువ ఒక్కసారి అమాంతం పెరిగిపోయింది. దాదాపు 62 వేల డాలర్లను దాటేసింది. కానీ, పర్యావరణంపై ప్రేమ గుర్తుకు రావడంతో ఏప్రిల్‌ రెండో వారంలో మస్క్‌ మనసు మార్చుకొన్నారు. టెస్లా కార్ల కొనుగోలుకు బిట్‌కాయిన్లను అనుమతించమని ప్రకటించారు. బిట్‌ కాయిన్‌ కోసం భారీ విద్యుత్తు ఉపయోగిస్తుండటంతో పర్యావరణం దెబ్బతినడమే దీనికి కారణమని వెల్లడించారు. ఈ ఒక్క ప్రకటనతో బిట్‌కాయిన్‌ 15శాతం విలువ కోల్పోయింది.

*** నెల రోజుల్లో 30శాతం విలువ కరిగి..
ఏప్రిల్‌ రెండో వారంలో 63 వేల డాలర్లు ఉన్న బిట్‌కాయిన్‌ విలువ నేడు 40 వేల డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. అంటే దాదాపు నెలరోజుల్లో 30శాతం విలువ కోల్పోయింది. మరో క్రిప్టో కరెన్సీ ఇథీరియం కూడా దాదాపు 40శాతం విలువ కోల్పోయింది. ఇక ఇటీవలే విలువ బాగా పెరుగుతూ వచ్చిన డాగీకాయిన్‌ కూడా 45శాతం విలువ కోల్పోయినట్లు బిజినెస్‌ టుడే పేర్కొంది.

*** చైనా సొంత డిజిటల్‌ కరెన్సీ
చైనా కొన్ని నెలల క్రితం సొంతంగా ఎలక్ట్రానిక్‌ కరెన్సీ వినియోగాన్ని ప్రయోగాత్మకంగా ప్రారంభించింది. 2014లోనే దీనిపై పనిచేయడం మొదలుపెట్టింది. 2016లో డిజిటల్‌ కరెన్సీ ఇన్‌స్టిట్యూట్‌ కూడా ఏర్పాటు చేసింది. 2020 నుంచి ప్రయోగాత్మక వినియోగం మొదలుపెట్టింది. దీనిని ఈసీఎన్‌వైగా వ్యవహరిస్తోంది. అంటే ఎలక్ట్రానిక్‌ చైనీస్‌ యువాన్‌ అని అర్థం. వీటిని చెంగ్డూ, షెన్‌జెన్‌, షిన్జియాంగ్‌ వంటి నాలుగు ప్రధాన నగరాల్లో పరీక్షించింది. ఆ తర్వాత వీటిని బీజింగ్‌, షాంగైకి విస్తరించింది. కొందరు ప్రజలను ఆహ్వానించి, వీచాట్‌ వంటి సామాజిక మాధ్యమాల్లో వారికి కొంత డిజిటల్‌ కరెన్సీ పంపించి, సూచించిన మాల్స్‌లో వాటిని వినియోగించాలని కోరింది. చాలా బ్యాంకులు తమ నిధుల్లో కొంత భాగాన్ని డిజిటల్‌ కరెన్సీగా మార్చాలని పేర్కొంది. భవిష్యత్తులో దీనిని ప్రపంచ వ్యాప్తంగా వినియోగించేటట్లు చేసే అవకాశం ఉంది.