Sports

ద్రవిడ్‌కు నూతన బాధ్యతలు

Rahul Dravid Could Be Coach For Indian Team To SriLanka

జులైలో పరిమిత ఓవర్ల సిరీస్‌ కోసం శ్రీలంకలో పర్యటించే భారత జట్టుకు జాతీయ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సీఏ) డైరెక్టర్‌గా రాహుల్‌ ద్రవిడ్‌ ప్రధాన కోచ్‌గా వ్యవహరించే అవకాశాలున్నాయి. ఆ సమయంలో ఇంగ్లాండ్‌ పర్యటనలో ఉండే కోహ్లి నాయకత్వంలోని టీమ్‌ఇండియాతో కోచ్‌ రవిశాస్త్రి, ఇతర సహాయ సిబ్బంది ఉండనున్నారు. కాబట్టి లంకకు వెళ్లే మరో భారత క్రికెట్‌ జట్టుకు కోచ్‌గా ద్రవిడ్‌ ఎంపిక దాదాపుగా ఖాయమైనట్లేనని సమాచారం. బీసీసీఐ నుంచి అధికారిక ప్రకటన రావడమే ఆలస్యం. ‘‘శ్రీలంక పర్యటనకు వెళ్లే భారత జట్టుకు ప్రధాన కోచ్‌గా ద్రవిడ్‌ వ్యవహరించే అవకాశాలు మెండు. ఇప్పటికే అతను యువ ఆటగాళ్లతో పని చేశాడు. అది జట్టుకు మేలు చేయనుంది’’ అని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. మరోవైపు ఎన్‌సీఏ బౌలింగ్‌ కోచ్‌ పరాస్‌ మాంబ్రే కూడా జట్టుతో పాటు శ్రీలంకకు వెళ్లే అవకాశం ఉంది. అధికారికంగా ఇంకా షెడ్యూల్‌ ప్రకటించనప్పటికీ జులై 13 నుంచి 27 వరకూ జరిగే ఈ సిరీస్‌లో రెండు జట్లు మూడేసి వన్డేలు, టీ20ల్లో తలపడనున్నట్లు సమాచారం. ఈ టీమ్‌ఇండియా జట్టుకు సీనియర్‌ ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ సారథ్యం వహించే అవకాశముంది.