Health

నెల్లురు మందును అధ్యయనం చేయండి-తాజావార్తలు

నెల్లురు మందును అధ్యయనం చేయండి-తాజావార్తలు

* నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆనందయ్య ఇస్తున్న ఆయుర్వేద ఔషధంపై సీఎం జగన్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ ఔషధంపై అధ్యయనం చేయాలని నిర్ణయించారు. కొవిడ్‌పై నిర్వహించిన సమీక్షలో ఈ మేరకు సీఎం జగన్‌ ఆదేశాలు ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వ విభాగాల అధికారులతో పరీక్షలు చేయించాలని వైద్యఆరోగ్యశాఖ ఉన్నతాధికారులను సీఎం ఆదేశించారు. నెల్లూరు జిల్లా కృష్ణపట్నానికి ఐసీఎంఆర్‌ బృందాన్ని పంపాలని.. ఆయుర్వేద వైద్యంపై శాస్త్రీయ నిర్ధారణ చేయించాలని ఆయన స్పష్టం చేశారు. నేటి నుంచి ఆయుర్వేద మందు పంపిణీ చేస్తారంటూ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌ చేసిన ప్రకటనతో నెల్లూరు పరిసర ప్రాంతాల్లోని వేలాది మంది వాహనాల్లో కృష్ణపట్నం తరలి వచ్చారు.

* కొవిడ్‌ నిబంధనల పేరుతో మధ్యప్రదేశ్‌ పోలీసులు రెచ్చిపోయారు. మాస్కు ధరించలేదనే కారణంతో ఓ మహిళపై ఆమె కుమార్తె ముందే పోలీసులు అమానుషంగా దాడికి పాల్పడిన ఘటన మధ్యప్రదేశ్‌లోని సాగర్‌ జిల్లాలో చోటుచేసుకుంది. మహిళను పోలీసులు నడిరోడ్డుపైనే ఈడ్చుకుంటూ కొడుతూ, కాలితో తంతున్న దృశ్యాలను మొబైల్‌ ఫోన్‌లో ఓ వ్యక్తి వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. ఓ మహిళ, ఆమె కుమార్తె నిత్యావసర సరకులు కొనేందుకు బయటకు వచ్చారు. కొవిడ్‌ నిబంధనల పేరుతో మాస్కు ధరించలేదంటూ ఆ మహిళను ఇద్దరు పోలీసులు కొట్టారు. వారి నుంచి విడిపించుకొనేందుకు ఆమె ప్రయత్నం చేసింది. ఆ క్రమంలో ఆమె పలుమార్లు రోడ్డుపై కింద పడిపోయింది. ఆమెను పోలీసు వాహనంలోకి ఎక్కించేందుకు ఓ మహిళా పోలీసు సైతం ప్రయత్నించగా.. ఆమె తీవ్రంగా ప్రతిఘటించింది. తల్లిని వారి నుంచి విడిపించేందుకు కుమార్తె చేసిన ప్రయత్నం ఫలించలేదు. ఆర్తనాదాలు చేస్తున్న ఆ మహిళ జుట్టు పట్టుకొని రోడ్డుపై ఈడ్చుకుంటూ పోలీసులు హింసకు పాల్పడ్డారు. ఈ దృశ్యాలన్నీ వీడియోలో రికార్డయ్యాయి. కొవిడ్ నిబంధనల పేరుతో ఇలాంటి అమానుషాలకు పాల్పడటం మధ్యప్రదేశ్‌ పోలీసులకు కొత్తేమీ కాదు. మాస్కు ధరించలేదనే కారణంతో ఇండోర్‌లో ఓ వ్యక్తిపై పోలీసులు గత నెల ఇదే విధంగా హింసకు దిగారు. కరోనా నిబంధనల ఉల్లంఘన పేరుతో దేశవ్యాప్తంగా గత నెల ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్న నేపథ్యంలో పోలీసులపై చాలా ఫిర్యాదులు వచ్చినట్టు తెలిసింది.

* మనుషులకు సోకే ప్రమాదం ఉన్న మరో రెండురకాల కరోనావైరస్‌లను శాస్త్రవేత్తలు కొన్నేళ్ల కిందటే గుర్తించారని సైన్స్‌మాగ్‌.ఓఆర్‌జీ పత్రిక పేర్కొంది. కొన్నేళ్ల క్రితం మలేసియాలో ఎనిమిది మంది పిల్లలకు నిమోనియా సోకి ఆసుపత్రి పాలయ్యారు. వారిని పరిశీలించగా కుక్కల్లో కనిపించే ఒక రకమైన కరోనావైరస్‌ సోకినట్లు గుర్తించారు. ఇప్పటికే కరోనా కుటుంబ నుంచి ఏడురకాల వైరస్‌లు మనుషులకు సోకుతున్నాయి. వీటిలో సార్స్‌1, సార్స్‌2, మెర్స్‌ అత్యంత ప్రమాదకరమైనవి. మిగిలినవి స్వల్ప అనారోగ్యం కలిగిస్తాయి. దీనిపై ఐయోవా విశ్వవిద్యాలయం వైరాలజిస్టు స్టాన్లీ పెర్ల్‌మన్‌ మాట్లాడుతూ ‘‘మనం కరోనావైరస్‌లు ఒక జీవి నుంచి మరో జీవిలోకి మారటాన్ని మరింత ఎక్కువగా చూస్తుంటాం’’ అని పేర్కొన్నారు.

* ఏపీలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. ఇవాళ కూడా 20 వేల పైనే కొత్త కేసులు నమోదవ్వడం ఆందోళనకు గురి చేస్తోంది. గడిచిన 24 గంటల్లో 92,231 నమూనాలను పరీక్షించగా.. 20,937 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. దీంతో ఇప్పటి వరకు కరోనా సోకిన వారి సంఖ్య 15,42,079కి చేరింది. తాజాగా 104 మంది కరోనాతో మృతి చెందగా.. మొత్తం మృతుల సంఖ్య 9,904కి పెరిగింది. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం బులిటెన్‌ విడుదల చేసింది. ఇవాళ 20,811 మంది కొవిడ్‌ నుంచి పూర్తిగా కోలుకొని డిశ్ఛార్జి అయ్యారని, ప్రస్తుతం రాష్ట్రంలో 2,09,156 క్రియాశీల కేసులు ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం బులిటెన్‌లో పేర్కొంది.మహమ్మారి కారణంగా చిత్తూరులో అత్యధికంగా 15 మంది మృతి చెందగా.. ప్రకాశం, విజయనగరం జిల్లాల్లో 10 మంది, తూర్పుగోదావరి, నెల్లూరు, విశాఖపట్నం జిల్లాల్లో 9 మంది, కృష్ణా జిల్లాలో 8 మంది, అనంతపురం, గుంటూరు, కర్నూలు, శ్రీకాకుళం జిల్లాల్లో ఏడుగురు, పశ్చిమగోదావరి జిల్లాలో ఆరుగురు చొప్పున ప్రాణాలు కోల్పోయారు.

* అది ప్రకృతి సౌందర్యానికి నెలవైన గర్వాల్ . అందమైన హిమాలయ సానువులు. ఆ హిమగిరులపై శాంతి దూతల్లా కొలవుతీరిన పైన్ వృక్షాలు. లేలేత ఎండ, రివ్వున వీచే శీతల గాలులు. ఆకుపచ్చ తివాచీ కప్పినట్లు భాసించే శిఖరాలు. ఆహ్లాదభరితమైన వాతావరణం. ఇది ప్రకృతికి ఒక పార్శ్వం. అక్కడే ఆ ప్రాంతంలోనే ఆ దృశ్యాలను మరో కోణంలో నుంచి వీక్షిస్తే మహావృక్షాలను తెగ నరుకుతూ అడవులకు చితిపేరుస్తున్న ఫారెస్ట్ కాంట్రాక్టర్లు. రిజర్వ్‌ ఫారెస్ట్ లక్ష్మణ రేఖలతో పేదల కడుపుకొడుతున్న అధికారులు, భూకంపాల జోన్లు, భారీ డ్యామ్‌లు నిర్మిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న పాలకులు.. ఎటుచూసినా విషాద దృశ్యాలు. దయనీయ జీవన చిత్రాలు. ఈ పోకడలను నిరసించి, గొంతెత్తి గర్జించి, ప్రజలను కదిలించిన పర్యావరణ ఉద్యమనీతి సుందర్‌లాల్ బహుగుణ.

* భాజపా అధ్యక్షుడు నడ్డా పిలుపు మేరకు ‘సేవా హి సంఘటన’ పేరుతో పార్టీ శ్రేణులు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. బర్కత్‌పుర భాజపా నగర కార్యాలయంలో యువమోర్చా ఆధ్వర్యంలో కరోనా బాధిత కుటుంబాలకు ఆహార పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. పేద ప్రజల కోసం మే, జూన్ నెలల్లో ప్రతి వ్యక్తికి 5కిలోల చొప్పున కేంద్రం ఉచిత బియ్యం ఇస్తోందని గుర్తు చేశారు. కరోనా ఉద్ధృతి నేపథ్యంలో ప్రజల అవసరాల మేరకు ఈ సాయాన్ని పొడిగించాలన్న యోచనలో కేంద్రం ఉన్నట్లు తెలిపారు.

* పశ్చిమ్‌బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్‌ స్థానం నుంచి పోటీ చేసిన మమతా బెనర్జీ ఓటమి చవిచూసిన విషయం తెలిసిందే. అయినప్పటికీ సీఎంగా బాధ్యతలు స్వీకరించడంతో దీదీ మళ్లీ ఎక్కడి నుంచి పోటీకి దిగుతారనే ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో ఇదివరకు రెండు పర్యాయాలు గెలిచిన భవానీపూర్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇందుకోసం తృణమూల్‌ సీనియర్‌ నేత, సిట్టింగ్‌ ఎమ్మెల్యే సోభాందేవ్‌ ఛటోపాధ్యాయ రాజీనామా రాశారు. స్పీకర్‌కు రాజీనామా పంపగా.. ఆయన ఆమోదం తెలిపారు.

* కరోనా సంక్షోభం వేళ ప్రభుత్వం ఆర్థిక అవసరాలు తీర్చుకునేందుకు భారతీయ రిజర్వ్‌బ్యాంక్‌(ఆర్‌బీఐ) నుంచి భారీగా నిధులు రానున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 99,122 కోట్ల మిగులు ద్రవ్యాన్ని ఆర్‌బీఐ కేంద్రానికి డివిడెంట్‌ రూపంలో చెల్లించనుంది. ఈ మేరకు ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన బోర్డు సమావేశంలో ఆమోదముద్ర పడింది. కరోనా కారణంగా ప్రభుత్వ ఆదాయం భారీగా పడిపోయిన వేళ ఈ నిధులు ఉపయోగపడనున్నాయి. కరెన్సీ ట్రేడింగ్‌, బాండ్ల ట్రేడింగ్‌ నుంచి ఆర్‌బీఐ భారీగా ఆదాయం పొందుతుంది. దీనిలో తన కార్యాకలాపాల కోసం కొంత మొత్తం ఉంచుకొని మిగులు నిధులను కేంద్ర ప్రభుత్వ ఆర్థిక అవసరాల కోసం అందజేస్తుంది.

* కరోనా సెకండ్‌ వేవ్‌ భారత్‌ను గడగడలాడిస్తోంది. ఫస్ట్‌ వేవ్‌తో పోలిస్తే దీని తీవ్రత అధికంగా ఉంది. ఇందులో ముఖ్యంగా ఆక్సిజన్‌ అందక ఇబ్బందులు పడుతున్నవారే ఎక్కువగా ఉన్నారు. అందుకే మన శరీరంలోని ఆక్సిజన్‌ స్థాయిలు తెలిపే పల్స్‌ ఆక్సీమీటర్లు, స్మార్ట్‌ వాచ్‌లకు ఒక్కసారిగా డిమాండ్‌ పెరిగిపోయింది. దీంతో అమాంతంగా వాటి ధరలు పెరిగిపోయాయి. ఈ ఇబ్బందులేవీ లేకుండా సింపుల్‌గా మన ఫోన్‌లోని ఒక యాప్‌తో శరీరంలోని ఆక్సిజన్‌ స్థాయి, పల్స్‌, శ్వాసక్రియల రేట్లు తెలిసేలా ఉంటే బావుంటుంది కదా!? ఆ ఆలోచన నుంచి వచ్చిందే ‘కేర్‌ప్లిక్స్‌ వైటల్స్‌ యాప్‌’.

* పశ్చిమబెంగాల్‌లో రాజకీయ తుపాను రేపిన నారదా స్టింగ్‌ ఆపరేషన్‌ వ్యవహారంలో కోల్‌కతా హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో అరెస్టయిన టీఎంసీ మంత్రులు సహా నలుగురు నేతలను ప్రస్తుతానికి గృహనిర్బంధంలో ఉంచాలని న్యాయస్థానం ఆదేశించింది. ఆ నలుగురి బెయిల్‌ పిటిషన్లను త్రిసభ్య ధర్మాసనానికి పంపుతున్నట్లు తెలిపింది. నారదా కుంభకోణం వ్యవహారంలో రాష్ట్ర మంత్రులు ఫిర్హాద్ హకీం, సుబ్రతా ముఖర్జీ, టీఎంసీ ఎమ్మెల్యే మదన్‌ మిత్ర, తృణమూల్‌ మాజీ నాయకుడు సోవన్‌ ఛటర్జీలను గత సోమవారం సీబీఐ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.