Business

భారత మార్కెట్‌లోకి ₹59వేల కోవిడ్ యాంటీబాడీ కాక్‌టెయిల్-వాణిజ్యం

భారత మార్కెట్‌లోకి ₹59వేల కోవిడ్ యాంటీబాడీ కాక్‌టెయిల్-వాణిజ్యం

* కొవిడ్‌ బాధితుల చికిత్సలో ఉపయోగించే యాంటీబాడీ కాక్‌టెయిల్‌(కాసిరివిమాబ్‌, ఇమ్డివిమాబ్‌) భారత మార్కెట్‌లో అందుబాటులోకి వచ్చింది. ఔషధ తయారీ సంస్థ రోచ్‌ ఇండియా, సిప్లా సంయుక్తంగా ఈ ఔషధాన్ని నేడు మార్కెట్‌లోకి విడుదల చేశాయి. దీని ధర డోసుకు రూ. 59,750గా నిర్ణయించినట్లు ఈ సంస్థలు ప్రకటించాయి. తొలి బ్యాచ్‌లో భాగంగా లక్ష ప్యాక్‌లను ప్రస్తుతం మార్కెట్‌లోకి విడుదల చేశామని, జూన్‌ మధ్యలో రెండో బ్యాచ్‌ ప్యాక్‌లు అందుబాటులోకి తెస్తామని రోచ్‌ ఇండియా, సిప్లా ఓ ప్రకటనలో తెలిపాయి. ఒక్కో ప్యాక్‌ను ఇద్దరు రోగులకు అందించవచ్చని పేర్కొన్నాయి.

* బిట్‌కాయిన్‌కు మరో షాక్‌ తగిలింది. తాజాగా ఐరోపాలోని అతిపెద్ద బ్యాంక్‌ హెచ్‌ఎస్‌బీసీ కూడా క్రిప్టోకరెన్సీలకు ద్వారాలను మూసేసింది. క్రిప్టో కరెన్సీల ట్రేడింగ్‌ డెస్క్‌ ఏర్పాటు చేసే ఉద్దేశం తమకు లేదని తేల్చిచెప్పింది. క్రిప్టో కరెన్సీలు, డిజిటల్‌ కాయిన్స్‌ విలువల్లో తరచూ విపరీతమైన మార్పులు చోటు చేసుకోవడం, పారదర్శకత లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకొన్నట్లు హెచ్‌ఎస్‌బీసీ సీఈవో నోయల్‌ క్వినైన్‌ తెలిపారు. క్రిప్టోకరెన్సీల కింగ్‌ బిట్‌కాయిన్‌ వార్షిక అత్యధిక విలువ నుంచి 50 శాతం పడిపోయిన సమయంలో నోయల్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.

* దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు లాభాలతో ముగిశాయి. ఉదయమే సానుకూలంగా ప్రారంభమైన సూచీలు ఓ దశలో నష్టాల్లోకి జారుకున్నాయి. అయినా, వెంటనే కోలుకొని రోజంతా అదే జోరును కొనసాగించాయి. చివరకు సెన్సెక్స్‌ 111 పాయింట్లు లాభపడి 50,651 వద్ద, నిఫ్టీ 22 పాయింట్లు ఎగబాకి 15,197 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.72.93 వద్ద నిలిచింది.

* మీరు బ్యాంక్ ఆఫ్ బరోడా ఖాతాదారుడా.. చెక్ చెల్లింపుల్లో జ‌రిగే మోసాల‌ను నివారించేందుకు, “పాజిటీవ్ పే క‌న్ఫ‌ర్మేష‌న్” ను త‌ప్ప‌నిస‌రి చేసింది బ్యాంక్ ఆఫ్ బ‌రోడా. ఈ కొత్త చెల్లింపుల వ్య‌వ‌స్థ‌ను వ‌చ్చే నెల నుంచి అంటే జూన్‌, 2021ని అమ‌లు చేయ‌నుంది. ప్రాసెస్ చేయ‌వ‌ల‌సిన చెక్ విలువ రూ. 2 ల‌క్ష‌లు, అంత‌కంటే ఎక్కువ ఉన్న‌ప్పుడు చెక్ వివ‌రాల‌ను త‌ప్ప‌నిస‌రిగా పునః నిర్థార‌ణ చేయాల‌ని త‌న ఖాతాదారుల‌కు తెలిపింది.