NRI-NRT

గజల్‌పై టాంటెక్స్ 166వ సాహిత్య సదస్సు

Rao Tallapragada As Chief Guest For TANTEX 166th NNTV

ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం ఆధ్వర్యంలో 166వ నెల నెలా తెలుగు వెన్నెల సాహిత్య సదస్సు 16వ తేదీన ఘనంగా జరిగింది. మాడ సమన్విత ప్రార్థనా గీతంతో సాహిత్య సదస్సు ప్రారంభమైయింది. ముఖ్య అతిథిగా సిలికానాంధ్ర పూర్వ కార్యదర్శి, గజల్ గేయ రచయిత తల్లాప్రగడ రావు విచ్చేసి “గజల్ కీర్తన సాహిత్య ప్రక్రియలు” అంశంపై ప్రసంగించారు. జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం ముఖ్య అతిథిని పరిచయం చేస్తూ వారి సాహిత్య ప్రస్థానాన్ని సభకు తెలిపారు. ఛందస్సు పరంగా గజల్ కూ గేయానికీ కీర్తనలకూ ఉన్న పోలికలనూ, గజల్ ప్రక్రియ స్వరూప స్వభావాలనూ విస్తారంగా వివరించి, తాను రాసి స్వర పరచిన గజళ్ళను రావు పాడి వినిపించి అలరించారు.

“మనతెలుగు సిరి సంపదలు” ధారావాహికలో భాగంగా యు.నరసింహారెడ్డి పొడుపు కథలు, జాతీయాలు, ప్రహేళికలు ప్రశ్నలు-జవాబుల రూపంలో చర్చ చేశారు. ఉపద్రష్ట సత్యం “పద్య సౌగంధం” శీర్షికన పిల్లలమఱ్ఱి చినవీరభద్రుడి శాకుంతల కావ్య పీఠికలోని పద్యం “పొసగన్ నే కృతిచెప్పగా పరిమళంబుల్ చాలకొక్కొక్కచో” తాత్పర్య విశేషాలను వివరించారు. లెనిన్ వేముల మాట్లాడుతూ మయూర భట్టు రచించిన సూర్య శతకంలోని ప్రథమ శ్లోకాన్ని వివరిస్తూ కీర్తించారు. మాడ దయాకర్ పుస్తక పరిచయం చేస్తూ డాక్టర్ మహీధర నళినీ మోహన్ రాసిన క్యాలండర్ కథ నవలలోని అంశాలను వివరించారు. కార్యక్రమంలో చివరిగా డాక్టర్ అరవిందరావు భావ కవితా గేయాలను శ్రావ్యంగా పాడి వినిపించారు. ముఖ్యఅతిథి ప్రసంగంపై ఆచార్య గంగిశెట్టి లక్ష్మీనారాయణ తమ స్పందన తెలిపారు. ఈ కార్యక్రమానికి సంఘం అధ్యక్షురాలు లక్ష్మి అన్నపూర్ణ పాలేటి, నెల నెలా తెలుగు వెన్నెల సాహిత్య సదస్సు సమన్వయకర్త నీరజా కుప్పాచి తదితర కార్యవర్గ సభ్యులు, పాలకమండలి సభ్యుల, స్థానిక సాహిత్య ప్రియులు హాజరయ్యారు.