NRI-NRT

తానా ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఆసక్తి-TNI ప్రత్యేకం

తానా ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఆసక్తి-TNI ప్రత్యేకం - TANA 2021 Election Results-Naren Niranjan Gogineni

అమెరికాలో అతిపెద్ద తెలుగు సంఘం తానాలో గత నాలుగైదు నెలల నుండి జరిగిన ఎన్నికల సమరం తుది దశకు చేరుకుంది. మరో కొద్ది గంటల్లో ఫలితాలు వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో రంగంలో ఉన్న ఇరువర్గాల్లో ఎవరు విజయం సాధిస్తారనే విషయంపై ఆసక్తికరమైన చర్చలు ప్రవాసాంధ్రుల్లో సాగుతున్నాయి. ఈ ఎన్నికలు సాధారణ ఎన్నికలు మరిపించే విధంగా ఇరువర్గాల మధ్య హోరాహోరీగా సాగాయి.

*** అమెరికా అంతటా ప్రచారం
అధ్యక్ష పదవికి ముగ్గురు అభ్యర్థులు రంగంలో ఉన్నప్పటికీ నరేన్ కొడాలి, నిరంజన్ శృంగవరపు వర్గాల మధ్యనే పోటీ జరిగిందనేది వాస్తవం. ఈ ఇరువురు తమ అభ్యర్థులను రంగంలోకి దింపారు. నాలుగైదు స్థానాలకు మినహా అన్ని స్థానాలకు అభ్యర్థులు ఇరువైపులా రంగంలో నిలిచారు. ప్రస్తుతం తానా ఫౌండేషన్ ఛైర్మన్‌గా ఉన్న శృంగవరపు నిరంజన్ వర్గం ఎన్నికలకు ముందు, ఎన్నికల ప్రారంభంలో చాలా దూకుడును ప్రదర్శించింది. శృంగవరపుకి ప్రస్తుత తానా అధ్యక్షుడు తాళ్లూరి జయశేఖర్, తదుపరి అధ్యక్షుడు లావు అంజయ్య చౌదరిలు బహిరంగంగానే మద్దతు ఇచ్చి ఆయన్ను, ఆయన వర్గాన్ని వెన్నుతట్టి ప్రోత్సహించారు. అమెరికా అంతటా అభ్యర్థులతో పాటు తిరిగి నిరంజన్ తరఫున ప్రచారం నిర్వహించారు. తానా అధ్యక్ష పదవికి పోటీలో ఉన్న నరేన్ కొడాలి తరఫున కోమటి జయరాం, నాదెళ్ల గంగాధర్ తదితరులు బహిరంగంగానే మద్దతు ప్రకటించారు. దాదాపు అన్ని ప్రధాన నగరాలను నరేన్‌తో పాటు పర్యటించి ప్రచారం నిర్వహించారు.

*** గెలుపుపై ఇరువర్గాల ధీమా
రాబోయే ఫలితాలపై ఇటు నరేన్ వర్గం, అటు నిరంజన్ వర్గం విజయం తమదేనని ధీమాగా ప్రకటిస్తున్నాయి. వాస్తవానికి కొడాలి నరేన్ వర్గం ఎన్నికల నామినేషన్ల సమయానికి చాలా వెనుకబడి ఉంది. ఎన్నికల తేదీలు సమీపిస్తున్న కొద్దీ చాలా వరకు ఆయన వర్గం పుంజుకుంది. బలంగా ఉన్న నిరంజన్ వర్గానికి బలమైన పోటీని నరేన్ వర్గం ఇచ్చింది అనడంలో ఏ మాత్రం సందేహం లేదు. ప్రస్తుతం నరేన్ వర్గంలో గెలుపు ధీమా ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. ఒక సమయంలో నరేన్ వర్గం డీలా పడింది. తమ కార్యదర్శి అభ్యర్థి భక్తా భల్లా నామినేషన్ తిరస్కరణకు గురి కావడంతో ఆ వర్గంలో కొంత నిరాశ ఏర్పడింది. దీనితో పాటు మరికొందరి నామినేషన్లు కూడా తిరస్కరణకు గురి అయ్యాయి. కోశాధికారి పదవికి బలమైన అభ్యర్థిని నరేన్ వర్గం ప్రతిపాదించలేకపోయిందని ఆయన వర్గాల్లోనే అభిప్రాయం నెలకొని ఉంది. ఏది ఏమైనప్పటికీ చివరిదశ ఎన్నికల రణరంగంలో నరేన్ వర్గం నిరంజన్ వర్గంతో సమాన స్థాయికి చేరిందని ప్రవాసాంధ్రుల్లో అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీనికి తోడు నరేన్ తరఫున చివరిదశలో ఆయన మిత్రబృందం ఇండియా నుండి అమెరికాకు వెళ్లి ఆయనకు వెన్నుదన్నుగా నిలిచింది. వారిలో ప్రముఖంగా వల్లేపల్లి శశికాంత్ ప్రముఖ పాత్ర పోషించారు. నరేన్‌కు బాల్యమిత్రుడైన శశికాంత్ చాలావరకు ఆయన తరఫున చక్రం తిప్పారు. ఆయనతో పాటు ప్రముఖ సినీ నిర్మాత నవీన్ ఎర్నేని కూడా నరేన్ తరఫున అమెరికాలో చివరిదశలో విస్తృతమైన ప్రచారాన్ని నిర్వహించారు. వీరితో పాటు బత్తినేని సోదరులు, దోనేపూడి విష్ణు తదితరులు కూడా నరేన్ తరఫున దృష్టి పెట్టి ఆయన విజయం సాధించే విధంగా కృషి చేశారు. నరేన్ మిత్రులు ఆయనకు ప్రచార సహకారంతో పాటు బలమైన తోడ్పాటును అందించారు. ఫౌండేషన్ ట్రస్టీ అభ్యర్థుల తరఫున $70వేల డాలర్లను విరాళంగా అందజేసి నరేన్ వర్గం నిరంజన్ వర్గానికి సవాల్ విసిరింది. దీనిని ప్రత్యర్థి వర్గం ఊహించలేకపోయింది.

*** ఇండియాలో లానే ఎన్నికలు
మనం ఎక్కడికి వెళ్లినా మన అలవాట్లు, మన వ్యవహార శైలి అలాగే ఉంటుందని ఈ సారి జరిగిన తానా ఎన్నికల్లో నిరూపించారు. ఇరువర్గాల వారు యథేచ్ఛగా బ్యాలెట్లను పోటాపోటీగా ఇంటింటికీ తిరిగి సేకరణ జరిపారు. ప్రస్తుతం అవతల వర్గం కన్నా తామే బ్యాలెట్లను అధికంగా సేకరించామని, విజయం తమదేనని ఇరువర్గాలు ధీమా ప్రదర్శిస్తూ ప్రకటనలు గుప్పిస్తున్నాయి. విజయోత్సవ సభలు ఏర్పాటు చేసుకునే పనిలో నిమగ్నమయ్యాయి. ఈ విషయంలో ఏ మాత్రం వెరవకుండా ప్రత్యర్థి వర్గం కన్నా తామే ఎక్కువ బ్యాలెట్ కలెక్షన్ చేశామని లెక్కలు వేస్తూ విజయం తమదేనని ప్రకటించుకుంటున్నారు. మేరీల్యాండ్ తదితర ప్రాంతాల్లో బ్యాలెట్ పత్రాల సేకరణ సందర్భంగా నిరంజన్ వర్గం కొందరిని తపాలా బాక్సుల నుండి చోరీ చేస్తున్నప్పుడు రెడ్ హ్యాండేడ్‌గా పట్టుకుని నరేన్ వర్గంపై కేసులు కూడా పెట్టింది. అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశంలో నిష్పక్షపాతంగా, స్వతంత్రంగా ఎన్నికల్లో ఓటు వేయాల్సిన కొందరు తానా ఓటర్లు బ్యాలెట్లపై తమ ఓట్లను రహస్యంగా ఉంచాల్సిన బాధ్యత కలిగి ఉన్నప్పటికీ బహిరంగంగా ఇతరులకు ఎలా ఇచ్చారనేది ఆశ్చర్యకరంగానూ, చర్చనీయాంశంగానూ మారింది. చాలా మంది తమ పత్రాలను ఓటు వేయకుండా ఖాళీగా ఉంచి తమకు నచ్చిన వర్గానికి పెద్ద ఎత్తున ఇచ్చినట్లు సమాచారం.

మరికొన్ని గంటల్లో ఎన్నికల ఫలితం వెలువడుతుంది. శనివారం ఉదయం నుండి సియాటెల్‌లో స్వతంత్ర సంస్థ ఆధ్వర్యంలో ఈ లెక్కింపు జరగనుంది. తానా ఎన్నికల అభ్యర్థులతో పాటు ఎన్నికల కమిటీ సభ్యులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయి పర్యవేక్షించనున్నారు. శుక్రవారం సాయంత్రానికి వీరంతా సియాటెల్‌కు చేరుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. శనివారం ఉదయం ప్రారంభమయే ఓట్ల లెక్కింపు రోజంతా పట్టే అవకాశం ఉంది. ఒకరిపై ఒకరికి ఆధిక్యత కలిగి పోటాపోటీగా జరిగితే లెక్కింపుకు ఎక్కువ సమయం పడుతుందని, ఏకపక్షంగా సాగితే మాత్రం త్వరగానే లెక్కింపు పూర్తి అవుతుందని అంచనా. విజయోత్సవ సభలు ఏ ఏ నగరాల్లో ఎప్పుడు జరపాలనే దానిపై కూడా ప్రణాళికలు జోరుగా జరుగుతున్నాయి. విజయం ఎవరిని వరిస్తుందో వేచి చూద్దాం.


కిలారు ముద్దుకృష్ణ
సీనియర్ జర్నలిస్టు