Health

సమ్మె విరమించిన జుడాలు-తాజావార్తలు

TS Junior Doctors Withdraw Protest

* తమ డిమాండ్లు పరిష్కరించాలంటూ సమ్మెబాట పట్టిన జూనియర్‌ డాక్టర్లు సమ్మె విరమించారు. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా సమ్మె విరమిస్తున్నట్లు వెల్లడించారు. డిమాండ్లన్నీ నెరవేర్చకున్నా సీఎం హామీతో సమ్మె విరమిస్తున్నట్లు చెప్పారు.పెంచిన స్టైపండ్‌, ప్రోత్సాహకాలు వెంటనే అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ నిన్నటి నుంచి జూనియర్‌ డాక్టర్లు సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మేరకు ఈ నెల 10న జూడాలు ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇచ్చారు. మరోవైపు కరోనా విపత్కర పరిస్థితుల్లో జూనియర్‌ వైద్యులు సమ్మెకు పిలుపునివ్వడం, విధులను బహిష్కరించడం సరికాదని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని తక్షణమే విధుల్లో చేరాలని సూచించారు. ప్రభుత్వం ఏనాడూ జూడాలపై వివక్ష చూపలేదని.. వారి సమస్యలను పరిష్కరిస్తూనే ఉందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో సమ్మె నిర్ణయాన్ని ప్రజలు హర్షించరని పేర్కొన్నారు. సీనియర్‌ రెసిడెంట్లకు ఇచ్చే గౌరవ వేతనాన్ని 15 శాతం పెంచాలని సీఎం నిర్ణయించారు. మూడేళ్ల వైద్యవిద్య అభ్యసించి కరోనా సేవలందిస్తున్న వైద్య విద్యార్థులకూ సీనియర్‌ రెసిడెంట్లకిచ్చే గౌరవ వేతనం అందించాలని ఆదేశించారు.

* తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై వైయస్ షర్మిల తీవ్ర విమర్శలు గుప్పించారు. మీది గుండెనా? లేక బండనా? అని ఆమె అన్నారు. గతంలో సెలెక్ట్ అయిన స్టాఫ్ నర్సులకు వెంటనే పోస్టింగులు ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. ఉద్యోగాలు రాక బాధ పడుతున్న 658 కుటుంబాల ఉసురు పోసుకోవద్దని ఆమె అన్నారు. వైద్య, ఆరోగ్యశాఖలో ఖాళీలన్నీ భర్తీ చేయాలని కోరారు. ఉద్యోగాలు సాధించిన వారిని కేసీఆర్ ఎందుకు పక్కన పెట్టారో చెప్పాల్సి ఉందని అన్నారు. ఎన్ని ఆఫీసుల చుట్టూ వీరు తీరుగుతున్నా… ఇప్పటి వరకు న్యాయం జరగలేదని మండిపడ్డారు. కేసీఆర్ ను కలిసేందుకు వీరు వెళ్తే… అరెస్ట్ చేయించారని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రికి ఇంత కఠిన హృదయం ఎందుకని ప్రశ్నించారు. నాలుగేళ్ల తర్వాత మరోసారి ఉద్యోగాల నోటిఫికేషన్ ఇచ్చి, ఉద్యోగ నియామకాలను చేపట్టే సమయానికి వీరిలో చాలా మందికి ఏజ్ బార్ అయిపోతుందని షర్మిల అన్నారు. నర్సుల పోస్టులు అవసరం ఉందని కేసీఆరే చెపుతున్నారని… అలాంటప్పుడు వీరిని ఉద్యోగాల్లోకి ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు అన్నీ కాంట్రాక్టు పద్ధతిలోనే నియామకాలను చేపడుతున్నారంటూ కేసీఆర్ విమర్శించారని… ఇప్పుడు కేసీఆర్ కూడా కాంట్రాక్టు వైపే మొగ్గు చూపుతున్నారని మండిపడ్డారు.

* అనంతపురం జిల్లా కదిరి పట్టణంలో కర్ఫ్యూ సడలింపు మరియు ఆంక్షల సమయంలో పరిస్థితులను జిల్లా ఎస్పీ భూసారపు సత్య ఏసుబాబు పరిశీలించారు. ప్రధాన రహదారులపై నడుచుకుంటూ వెళ్లి వాహనాల, ప్రజల రాకపోకలను … వ్యాపార సముదాయాల కార్యకలాపాలను గమనించారు. కర్ఫ్యూ సమయంలో వెళ్తున్న ఆటోలను నిలబెట్టి ఎందుకు వెళ్తున్నారో అడిగి వివరాలు ఆరా తీశారు. అనంతరం… కూరగాయల మార్కెట్ ను సందర్శించి అక్కడి పరిస్థితులను సమీక్షించారు. అనవసరంగా రహదారులపైకి వచ్చే ఉల్లంఘనదారులపై చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈనెల 31 వరకు ప్రతీరోజూ మధ్యహ్నాం 12 గంటల నుండి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు అన్ని రకాల దుకాణాలు మూసేయించాలన్నారు. ఆటోలు, టాక్సీలు, తదితర ప్రజా రవాణా అనుమతించరాదన్నారు. వైద్య సేవలు, అత్యవసర సర్వీసులకు మినహాయింపు ఇవ్వాలన్నారు. నిత్యావసరాలు, కూరగాయలు, తదితరాలు కర్ఫ్యూ కంటే ముందే తెచ్చుకునేలా ప్రజలకు సూచించాలన్నారు. ఆసమయంలో అందరూ తప్పనిసరిగా మాస్కులు ధరించడం, శానిటైజర్లు వాడటం, భౌతిక దూరం పాటించేలా పబ్లిక్ అడ్రెసింగ్ సిస్టం ద్వారా తెలియజేయాలన్నారు. జన సమూహాలు లేకుండా చూడాలన్నారు. కర్ఫ్యూ సమయంలో నిబంధనలు ఉల్లంఘించిన దుకాణాలు, వాహనాలపై జరిమానాలు లేదా కేసులు నమోదు చేయాలన్నారు. ఈ సమావేశంలో కదిరి డీఎస్పీ భవ్యకిశోర్, పట్టణ సి.ఐ లు,నిరంజనరెడ్డి, శ్రీనివాసులు ఎస్సైలు, తదితరులు ఉన్నారు.

* ఆంధ్రప్రదేశ్‌లో నిత్యం వేల సంఖ్యలో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. మృతుల సంఖ్య కూడా రోజూ 100కు అటూఇటూగా నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో కరోనాతో బాధపడేవారికి ప్రత్యేకంగా చికిత్స అందించేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ముఖ్యంగా వైద్య సదుపాయాలు తక్కువగా ఉండే ఏజెన్సీ ప్రాంతాల్లో ఆర్టీసీ స్లీపర్‌ బస్సుల్లో కొవిడ్‌ రోగులకు చికిత్స అందించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఏపీ రవాణాశాఖ మంత్రి పేర్ని నాని ప్రకటించారు.

* తెలుగుదేశం పార్టీ ఒక పండుగలా భావించే మహానాడు ప్రారంభమైంది. కరోనా నేపథ్యంలో వరుసగా రెండో ఏడాది కూడా మహానాడు వర్చువల్ మాధ్యమంగానే జరుగుతోంది. పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ చిత్రపటం వద్ద టీడీపీ అధినేత చంద్రబాబు నివాళి అర్పించి మహానాడును ప్రారంభించారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ తప్పులపై మాట్లాడుతున్న వారిని అక్రమ కేసులు పెట్టి, అరెస్ట్ చేస్తున్నారని మండిపడ్డారు. మాట్లాడేవారి నోళ్లను మూయించేలా స్టేట్ టెర్రరిజంకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. చివరకు కోర్టులను కూడా బెదిరించే స్థాయికి వచ్చారంటే… రాష్ట్రంలో ప్రజాస్వామ్య వ్యవస్థ ఎటు పోతోందో అందరూ అర్థం చేసుకోవాలని చెప్పారు.

* ఢిల్లీతో సహా పలు రాష్ట్రాల్లో ఏర్పడిన వ్యాక్సినేషన్ కొరతపై ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేంద్రం వ్యాక్సిన్లను ఎందుకు కొనడం లేదని ఆయన ప్రశ్నించారు. వ్యాక్సిన్ల విషయంలో రాష్ట్రాలకు స్వేచ్ఛనివ్వడం లేదని మండిపడ్డారు. ‘‘కేంద్రం వ్యాక్సిన్లను కొనడం లేదు. అలాగని రాష్ట్రాలకు స్వేచ్ఛనూ ఇవ్వడం లేదు. ప్రస్తుతం మనం కోవిడ్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్నాం. ఒకవేళ పాకిస్తాన్ భారత్‌పై దాడులు చేస్తే, రక్షించుకునే బాధ్యతను కూడా రాష్ట్రాలకే వదిలేస్తారా?.. సొంతంగా యుద్ధ ట్యాంకులు కొనుక్కోమని అంటారా?’’ అంటూ కేజ్రీవాల్ ధ్వజమెత్తారు. ఇతర దేశాల లాగా కాకుండా భారత్‌లో ఆరు నెలల ఆలస్యంతో వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైందని విమర్శించారు. మొదటి వ్యాక్సిన్ భారతీయులే భారత్‌లో తయారు చేశారని, అప్పటి నుంచి టీకా నిల్వలు పెంచితే, సెకండ్ వేవ్‌ను సమర్థమంతంగా ఎదుర్కొని ఉండేవారని కేజ్రీవాల్ అభిప్రాయపడ్డారు.

* దేశంలో కరోనా వైరస్‌ ఉద్ధృతి కొనసాగుతున్న వేళ.. ఫంగస్‌ ఇన్‌ఫెక్షన్‌ కేసులు వెలుగు చూడడం ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటికే మ్యూకర్‌మైకోసిస్‌ (బ్లాక్‌ఫంగస్‌) కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ సమయంలో ప్రమాదకరమైనదిగా భావిస్తోన్న క్యాండిడా (వైట్‌ ఫంగస్‌) కేసు దిల్లీ ఆసుపత్రిలో నమోదయ్యింది. కరోనా వైరస్‌ సోకిన బాధితురాలిలో ఈ ఇన్‌ఫెక్షన్‌ కారణంగా జీర్ణకోశంలో చిల్లులు పడినట్లు వైద్యులు గుర్తించారు. దిల్లీలో నమోదైన తొలి క్యాండిడా ఇన్‌ఫెక్షన్‌ కేసు కూడా ఇదేనని వైద్యులు వెల్లడించారు.