Health

నన్ను ఎందుకు వేధిస్తున్నారు:ఆనందయ్య ఆవేదన-TNI కోవిద్ బులెటిన్

నన్ను ఎందుకు వేధిస్తున్నారు:ఆనందయ్య ఆవేదన-TNI కోవిద్ బులెటిన్

* సులభమైన కరోనా పరీక్ష అందుబాటులోకి వచ్చింది. సెలైన్ నోటిలో వేసుకుని పుక్కిలించి ఓ ట్యూబులో ఉమ్మాలి. ఆ ట్యూబును పరీక్షకు పంపితే చాలు.. మూడు గంటల్లో ఫలితం వస్తుంది. ఈ కొత్త పరీక్ష వల్ల సమయం, సాధన సంపత్తి ఆదా అవుతాయి. శాస్త్రీయ, పారిశ్రామిక పరిశోధనా మండలి (సీఎస్ఐఆర్) ఈ చవకైన, సులభమైన కొత్త పరీక్షను రూపొందించింది. ఈ కిట్ లో ఉంటే సెలైన్‌ను గొంతులో పోసుకుని 15 సెకన్ల పాటు పుక్కిలించాలి. తర్వాత ఆ ద్రవాన్ని ట్యూబులోకి ఉమ్మాలి. ఆ ట్యూబును ప్రయోగశాలకు పంపితే ఫలితం వస్తుంది. కరోనా రక్షణ దుస్తులు, దూదిపుల్లలు ఇలాంటివేవీ ఈ పరీక్షలో అవసరం లేదు. ఇదొక గమనించదగ్గ నూతన ఆవిష్కరణ అని కేంద్ర ఆరోగ్యమంత్రి డాక్టర్ హర్ష్ వర్ధన్ వ్యాఖ్యానించారు. దూదిపుల్ల అవసరం లేని, ఇబ్బంది కలిగించని ఈ విధానం కరోనా పరీక్షల తీరుతెన్నులనే మార్చేస్తుందని ఆయన పేర్కొన్నారు. ఎవరికి వారే శాంపిల్స్ సేకరించి పంపవచ్చునని, జనాల మధ్య క్యూలో నిలబడి అవస్థలు పడాల్సిన అగత్యం లేదని వైద్య నిపుణులు అంటున్నారు. ఈ పద్ధతిలో వ్యర్థాలు కూడా తగ్గుతాయని హర్షం వ్యక్తం చేస్తున్నారు. భారత వైద్య పరిశోధన జర్నల్‌లో ఈ కొత్త పరీక్ష గురించి ఇటీవలే ఒక అధ్యయన నివేదికను ప్రచురించారు.

* కొవిడ్‌ నివారణ మందు తయారీకి అవసరమైన పదార్థాలతో పాటు ఫార్ములా చెప్పాలని అధికారులు వేధిస్తున్నారని ఆనందయ్య హైకోర్టులో గురువారం వ్యాజ్యం దాఖలు చేశారు. మందు పంపిణీ విషయంలో జోక్యం చేసుకోకుండా అధికారులను ఆదేశించాలని కోరారు. ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఉచితంగా మందు పంపిణీ చేస్తున్నానని.. ఈ కార్యక్రమానికి రక్షణ కల్పించేలా ఆదేశించాలన్నారు. ‘‘లోకాయుక్త ఆదేశాల మేరకు మందు విషయంలో వాస్తవాలు తేల్చేందుకు నెల్లూరు జిల్లా కలెక్టర్‌ త్రిసభ్య కమిటీ వేశారు. కమిటీ ఆయుష్‌ కమిషనర్‌తో వచ్చి నమూనాలు సేకరించింది. మందుపై ప్రజలు ఎవరూ నెగెటివ్‌గా చెప్పడం లేదని నివేదికలో పేర్కొన్నారు. మందు తయారీకి వాడే ఫార్ములా చెప్పాలని త్రిసభ్య కమిటీ సభ్యులతో పాటు ఆయుష్‌ కమిషనర్‌ ఒత్తిడి చేస్తున్నారు. కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో భారీగా ఖర్చు చేయలేని సామాన్య ప్రజలను నా మందు ఆకర్షించింది. ప్రస్తుతం నేను మందును ఉచితంగా పంపిణీ చేస్తున్నాను. అయితే కొంతమంది ప్రైవేటు వ్యక్తులు, అధికార యంత్రాంగం కలిసి దీన్ని కమర్షియలైజ్‌ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆందోళన కలుగుతుంది. అధికరణ 301 ప్రకారం స్వేచ్ఛాయిత వృత్తి, వాణిజ్యం నిర్వహించుకోవచ్చు. ఈ విషయాలను పరిగణలోకి తీసుకొని నా ఆయుర్వేద వృత్తిలో అధికారుల జోక్యాన్ని నిలువరించండి’’ అని ఆనందయ్య కోరారు..

* స్థానిక శిల్పారామం ఎదురుగా రిమ్స్ సమీపంలోని అంబెడ్కర్ భవన్ లో దాదాపు రూ. కోటి రూపాయల వ్యయంతో ఆక్సిజన్ తో కూడిన 200 పడకల ట్రాన్సిట్ ఆసుపత్రిని ప్రారంభించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎస్.బి. అంజాద్ భాష, ఎంపీ అవినాష్ రెడ్డి, జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్ శాసనసభ్యులు పి రవీంద్రనాథ్ రెడ్డి, మేయర్ సురేష్ బాబులు.

* శుభకార్యం ఓ కుటుం బాన్ని కుదిపేసింది. కరోనా మహమ్మారి ఒకరి తర్వాత ఒకరికి సోకి ఆర్థికంగా దెబ్బతీసింది. నల్లగొండ జిల్లా కనగల్‌ మండలం బచ్చన్నగూడేనికి చెందిన జానయ్య, లక్ష్మి దంపతులు ఇటీవల తమ కుమారుడు సాయికి ధోవతి ఫంక్షన్‌ నిర్వహించారు. శుభకార్యానికి నల్లగొండ మం డలం చెన్నుగూడేనికి చెందిన లక్ష్మి తల్లిదండ్రులు మర్రి జంగయ్య, అలివేలు దంపతులు కుటుంబ సమేతంగా హాజరయ్యారు. కాగా, ఫంక్షన్‌ ముగిసిన రెండు రోజులకు తొలుత జానయ్య, లక్ష్మి అస్వస్థతకు గురికావడంతో ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఆ తర్వాత జంగయ్య, అలివేలుతో పాటు వీరి చిన్న కుమార్తె, పెద్దకుమారుడు సైదులు, అతడి భార్య, బంధువులు మొత్తంగా పదిమంది వైరస్‌ బారిన పడ్డారు. జానయ్య పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మిగిలిన తొమ్మిది మంది హోంక్వారంటైన్‌లో ఉంటూ చికిత్స పొందుతున్నారు.

* కొవిడ్-19 మహమ్మారి మూలాలను వెలికితీసే ప్రయత్నాలకు రాజకీయాలు ఆటంకం కలిగిస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఈ మిస్టరీని ఛేదించేందుకు శాస్త్రవేత్తల్ని తమపని తాము చేసుకోనివ్వాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించింది.