NRI-NRT

తానాకు అంజనం వేసేది నిరంజనే-TNI ప్రత్యేకం

Niranjan Panel Wins TANA 2021 - తానాకు అంజనం వేసేది నిరంజనే-TNI ప్రత్యేకం

ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) 2021 ఎన్నికల్లో నిరంజన్ ప్రభంజనం సృష్టించారు. తానా అధ్యక్షుడు అంటే నాలుగు గోడల మధ్య పుట్టేవాడు కాదు నలుగురు ఎన్నుకుంటే నడిపించేవాడంటూ మార్పు జెండా చేతబూని 2021 ఎన్నికల్లో అధ్యక్ష అభ్యర్థిగా బరిలో నిలిచిన కర్నూలు జిల్లాకు చెందిన మిషిగన్ ప్రవాసుడు శృంగవరపు నిరంజన్ విజయదేవత వరాలందుకుని తానాకు మార్పు అనే అంజనం వేసేందుకు అర్హత సాధించారు. తన సమీప ప్రత్యర్థి డా.కొడాలి నరేన్‌పై 1758 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. నిరంజన్‌కు 10866 ఓట్లు లభించగా, నరేన్‌కు 9108 ఓట్లు లభించాయి. 2021-23 కాలానికి ఆయన కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడిగా (Executive Vice-President) గెలుపొందిన సందర్భంగా ఆయనకు, విజేతలుగా నిలిచిన ఆయన ప్యానెల్ అభ్యర్థులకు TNI ప్రత్యేక అభినందనలు. “తన అంటే ఒక్కరిది-తానా అంటే అందరిది” నినాదానికి న్యాయం చేకూరుస్తూ “గోగినేని-కొడాలి”లను సైతం తమ ప్యానెల్‌లో జేర్చుకున్న నిరంజన్ బృందం జయ & జయల దిశానిర్దేశంలో గాడ్‌ఫాదర్ల వ్యవస్థకు తమ గెలుపుతో గట్టిగానే గండికొట్టారు. తానాలో మార్పు నినాదంతో అర్థరాత్రి స్వాతంత్ర్యం తీసుకువచ్చి గతానికి ఘనవీడ్కోలు పలికారు. కొడాలి ఓడాలి అంటూ కాళ్లకు బలపం చేతికి మైకు కంకణం కట్టుకుని అమెరికా అంతటా చేసిన ప్రచారం ఫలించింది. తానాలో సమూల మార్పులు తీసుకురాగల శక్తి “గల్లీయువకులకు” ఉందని రుజువైంది. ఈ ఎన్నికల్లో నిరంజన్ ప్యానెల్ కార్యవర్గ పదవులు అన్నింటినీ కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది. TNI ఎన్నికల ప్రారంభంలో చెప్పినట్లుగానే కొందరికి శృంగభంగమైంది. జీవనోపాధి కనుమరుగైంది. అనుభవానికి-అవకాశానికి మధ్య జరిగిన ఎన్నికల్లో నిరంజన్ విజయంతో తేలింది ఒక్కటే….ఎక్కాలంటే హిమగిరి ధిక్కారం తప్పనిసరి.
గెలుపుకు తోడ్పడినవి: మాజీ అధ్యక్షుల మద్దతు, మహిళలు-వైద్యులు-యువకులు కలగలిసిన సంపూర్ణ సమగ్ర ప్యానెల్ కావడం, ఆంధ్రా-తెలంగాణా-రాయలసీమకు చెందిన ముగ్గురి నాయకత్వం, తానాలో మార్పు అనే నినాదం, తాజాగా జేరిన సభ్యుల ఓట్లు .

Niranjan Wins TANA 2021 Elections
Niranjan Wins TANA 2021 Elections

గత 18ఏళ్లుగా తానాలో రాజ్యసభ(నామినేటడ్) పదవులే గానీ లోక్‌సభ పదవుల్లో తాను పనిచేయలేదని, ఈ సారి తమ సంఘటిత కూటమిని బలపరచాలని తద్వారా తన కలను నెరవేర్చుకోవాలనుకున్న కృష్ణా జిల్లాకు చెందిన వర్జీనియా ప్రవాసుడు డా.నరేన్ కొడాలి విజ్ఞాపనకు మన్నన దక్కలేదు. తానా త్రిమూర్తుల దీవెనలతో త్రిముఖ పోటీలో కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడిగా గెలుపు పట్టా పుచ్చుకోవాలని తహతహలాడిన మాస్టారు ఈ ఎన్నికల్లో పాస్ మార్కులు సంపాదించలేకపోయారు. సంఘటిత కూటమి భంగపాటుకు గురైంది. తానా అధ్యక్ష ఎన్నికల్లో ఒక్కడిగా రెండోసారి పోటీ పడుతున్న మూడో అభ్యర్థి గోగినేని శ్రీనివాస ఎప్పటిలానే తన బాణీని గట్టిగా వినిపించినా అది బధిర శంఖారావంగానే మిగిలిపోయింది. ఓట్లు చీల్చి ప్రత్యర్థుల ఓటమికి బాటలు వేస్తాడేమోననుకున్న ఆయన ప్రభావం వెలతెలపోయింది.
ఓటమి కారణాలు: 22వ సభల ఆర్థికాంశాలు, మార్గనిర్దేశం చేసిన గాడ్‌ఫాదర్లపై సభ్యుల్లో పాతుకుపోయిన వ్యతిరేకత, గుగ్గురువులు “హేమా”హేమీల మద్దతు కొరవడటం.

*** త్రిలక్షణాలు…త్రిమూర్తులు…త్రిముఖ పోటీ.
తానాలో ఎన్నికల సరళి ఒక విలక్షణ్. అయితే సెలక్షన్. లేదంటే ఎలక్షన్. విజేతలను నిర్ణయించే కలెక్షన్. ఇది ఆగని చెయిన్ రియాక్షన్. ఎప్పటిలానే ఈసారి కూడా తానా అధ్యక్షుడు ఎవరనేది సెలక్షన్ పద్ధతితోనే ప్రారంభమయినప్పటికీ సమీకరణాలు, బుజ్జగింపులు, అహం భస్మాలు కుదరని కారణంగా ఎలక్షన్‌కు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముగ్గురు అభ్యర్థులు తమ తమ త్రిమూర్తుల అండతో త్రిముఖ పోటీకి తెరలేపారు. నరేన్(ఆంధ్ర) వైపు ఒక రాముడు(ఆంధ్ర), ఒక శివుడు(ఆంధ్ర), ఒక “నా పేరు రాయొద్దు” (రాయలసీమ) అన్నీ తామే అయి నడిపిస్తే……..నిరంజన్(రాయలసీమ) వైపు ఒక శేఖరుడు(తెలంగాణా), ఒక హనుమంతుడు(ఆంధ్ర), ఒక ప్రవాసుడు(ఆంధ్ర) వేదికలను ఆశయాలను విరివిగా పంచుకున్నారు. మూడు ప్రాంతాల వారీగా మాంచి జోడీగా మారారు. ఒకే ఒక్కడు గోగినేని శ్రీనివాసకు మీడియా, వీడియో రెండూ తోడుండగా మూడో బలంగా తానాతో ఆయనకున్న ఘనచరిత్ర నిలబడింది. ఓట్ల బలమే కాస్త కొరవడింది.
01. సభ్యులకు ఎలక్షన్ ట్రస్ట్ ముద్రించి పంపిన మొత్తం బ్యాలెట్లు: 33875 బ్యాలెట్లు/17758 కవర్లు
02. సభ్యులకు చిరునామాల్లో లోపం కారణంగా బట్వాడా చేయలేకపోయినవి: 1433 కవర్లు
03. పోలింగ్ పూర్తి చేసుకుని తిరిగి వచ్చినవి: 10877 కవర్లు. 20715 ఓట్లు.
04. గాలిలో కలిసినవి: 17758 – (10877+1433) = 5448 కవర్లు (32%)
05. లెక్కించబడిన తుది ఓట్లు: 20715 ఓట్లు.
06. నిరంజన్: 10866
07. నరేన్: 9108
08. గోగినేని: 741
09. డోనర్ కోటాలో ఫౌండేషన్ ట్రస్టీ పదవికి పంపిన బ్యాలెట్లు: 61 కవర్లు.
10. తిరిగి వచ్చినవి: 57 కవర్లు.

*** విష ప్రచారాలు – విస్తృత వాగ్ధానాలు.
తెలుగులో కాదేది కవితకు అనర్హం. తానాలో కాదేది అడుసుకు అనర్హం. క్రికెట్ బ్యాట్లు, వాటర్ బాటిళ్లు, అరటిపళ్లు, మద్యం బిల్లులు, మద్యం షాపులు, మద్యం కేసులు, నిధుల అక్రమాలు, బోర్డు సమావేశాలు, బూతు పురాణాలు, విగ్గులు, పెట్టుబడులు, కంపెనీలు, కోర్టులు, చెక్కులు, రాజకీయ పార్టీలు, ఏకగ్రీవాలు, నేపాలీలు, విద్యార్థులు, బ్యాలెట్ దొంగతనాలు, పోలీసు కేసులు, సభల లెక్కలు, హీరోయిన్ల టికెట్లు, డేటాబేస్ మార్పులు, లక్ష డాలర్లపై కోటి ప్రశ్నలు…అబ్బో ఈ పట్టిక పరంపర చూస్తే ఓ సేవా సంస్థకు జరిగే ఎన్నికల్లో ఇన్ని సిత్రాలు ఉంటాయా అని బయటి వ్యక్తులు ముక్కున వేలేసుకుంటారు. తానా సభ్యులు మాత్రం ఛీత్కరించుకుంటారు…కున్నారు. దూరంగా జరుగుతున్నారు. దానికి తార్కాణం…32% బ్యాలెట్లు తిరిగి అందకపోవడం.

ప్రచార పర్వంలో సానుకూల దృక్పథమే తమ ఉద్దేశమని నరేన్ ఉటంకిస్తే…కళంకం లేని తమపై ఆరోపణలకు ఆస్కారమే లేదని నిరంజన్ ప్యానెల్ ధీమాగా వ్యవహరించింది. దీనికి తోడు నరేన్ ఛైర్మన్‌గా వ్యవహరించిన 22వ మహాసభల ఖర్చు పట్టిక, ఆర్థికాంశాలకు సంబంధించిన అవకతవకలపై విమర్శనాస్త్రాలను ఘాటుగానే ఎక్కుపెట్టింది. ఒక్క స్వాగత నృత్యం, గుమ్మడి గోపాలకృష్ణల కార్యక్రమాలను మినహాయించి 22వ తానా సభల ఖర్చులకు తనకు ఎలాంటి సంబంధం లేదని సాక్షాత్తు సమన్వయకర్తగా వ్యవహరించిన డా.మూల్పూరి వెంకటరావు బోర్డుకు తెగేసి చెప్పడం వీరి ఆరోపణలకు ఆజ్యం పోసింది. ప్రచారం చివరి దశలో నరేన్ ప్యానెల్‌కు ఎన్నికల వాతావరణం కాస్త అనూకులంగా ఉన్నప్పటికీ చిరునామాల వ్యవహారంతో బ్యాలెట్లు ఆలస్యంగా రావడం తరాజులో కొంత మార్పును తీసుకువచ్చింది. దీన్ని అర్థం చేసుకున్న నరేన్ ప్యానెల్ నష్టనివారక చర్యల రూపేణా కోవిద్ సహాయం పేరిట ఫౌండేషన్ ఖాతాలో $70వేల డాలర్లను జమచేసి కోటి రూపాయిలకు వాగ్ధానం ఇవ్వగా, నిరంజన్ ప్యానెల్ ఇప్పటికే ఫౌండేషన్ ఆధ్వర్యంలో లక్ష డాలర్లతో కార్యక్రమాలు చేపట్టామని…మరో లక్ష డాలర్లను సమీకరించి ఇస్తామని ఎదురు వాగ్ధానం చేసింది. వాగ్ధాన వానలు చానా చూసిన తానా ఈ హామీల జల్లులో తడిసి ముద్ద అయి మురిసింది. వాన ఆపాలంటే “హామీల” గోడలు కాదు “అమలు” పైకప్పు కట్టాలని ఎప్పటికో తెలిసేది!

*** విషాద ఎన్నికలు
కురుక్షేత్ర సంగ్రామ సమానంగా నవరస భరితంగా సాగిన 2021 తానా ఎన్నికల్లో సైతం విషాద యోగం ఎదురైంది. తానా వ్యవస్థాపకుడు డా.కాకర్ల సుబ్బారావు, తానాలో చురుగ్గా ఉండే డీసీ ప్రవాసుడు ఎన్.ఆర్.సీ.నాయుడుల అకాల మరణం తానా సభ్యుల రాజకీయ రసోద్రిక్తతను అడుగంటా మాపింది. పలువురు అభ్యర్థుల తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు కరోనా రక్కసి కాటుకు అసువులు బాశారు. ఆయా కుటుంబ సభ్యులకు TNI ప్రగాఢ సానుభూతి తెలుపుతోంది.

*** వేదనాభరిత నివేదన
గెలుపు పరిమళాల్లో పరవశిస్తూ, అహం తృప్తోస్మి శ్వాసిస్తూ, చంకలు గుద్దుకుంటూ వంకలు వెదికేస్తూ, స్తబ్దుగా మహాసభల కోసం ఎదురుచూస్తూ, తదుపరి అధ్యక్షుడి గూర్చి లెక్కలేస్తూ…అప్పుడప్పుడు(వారానికి 8సార్లు) పేపర్లో పేర్లు వేయించుకుంటూ కూర్చునే రోజులు తానాలో మట్టికలవాలి. కోవిద్ సొద తప్పించే ఉపశమనానికై వేచి ఉన్న బాధితుల వేదనాభరిత రోదనాపూర్వక నివేదనను విజేతలు సచేతనంగా ఆలకించాలి. తానా స్పందనే సంపదగా భాసిల్లేలా సహాయక చర్యలకు తక్షణం ఉపక్రమించాలి. ఓట్ల కోసం రాల్చిన మాటలన్నీ ప్రస్తుతానికి మూటగట్టి మూలపెట్టి చొక్కా మడతపెట్టి తెలుగు ప్రజల ఆక్రందన ఆనందంగా మార్చేందుకు ముందడుగు వేయాలి. తానా అనే రెండు అక్షరాలు నిశ్శబ్ధాన్ని, విధిగుద్దులతో అభాగ్యులు చేసే యుద్ధాన్ని పటాపంచలు చేయాలి. అప్పుడే మీ గెలుపుకి మేలిమలుపు. ఈ మహావిషాదానికి అహోమనిపించే ముగింపు.

తానా వెబ్‌సైట్‌ను సాధారణ సమయంలో ఒక నెలలో సందర్శించే వీక్షకుల సంఖ్య 30-40వేలు. బాలోత్సవం వంటి ప్రాముఖ్యమైన కార్యక్రమాలు ఉన్నప్పుడు 10-13లక్షలు. తానా వెబ్ సర్వర్లకు అంత దమ్ము ఉందా అంటే ఉంది. కానీ దాన్ని తగిన శక్తిమేర వాడుతున్నారా అంటే తూచ్…లేదనే సౌండ్ రీసౌండ్‌లో వినిపిస్తుంది. 2021 ఎన్నికలు నిర్వహించిన సియాటెల్ సంస్థ ఎలక్షన్ ట్రస్ట్‌కు తానా కట్టింది సుమారు $65వేల డాలర్లు (₹47లక్షలు). ముగ్గురు అభ్యర్థులు, రెండు ప్యానెళ్ల అభ్యర్థులు చేసిన ఖర్చు చూస్తే….అమెరికావ్యాప్తంగా విమాన టికెట్లు, హోటళ్లు, భోజనాలు, సమావేశ హాళ్లు, రవాణా, కార్లు, ప్రకటనలు, వీడియోలు, బ్యానర్లు, కరపత్రాలు, సిగరెట్లు, మద్యం అన్నీ కలిపి అత్యల్పంగా లెక్క వేసుకుంటే అర మిలియన్ డాలర్లు అంటే $5లక్షల డాలర్లు (₹3.6కోట్లు). పైన ₹47లక్షలు, ఈ ₹3.6కోట్లు కలిపితే మొత్తం $4కోట్లు. ఈ మొత్తంలో కనీసంలో కనీసంగా ఏకకాల పెట్టుబడిగా ఒక లక్ష డాలర్లు ఖర్చుతో (మీ సొంత కంపెనీనే వాడుకోండి లేదా కమీషన్ తీసుకోండి) తానాలో సభ్యులకు వెబ్‌సైట్ లాగిన్ వ్యవస్థ ఏర్పాటు చేసి….అదే చేతితో పనిలో పనిగా ఐటీ నిపుణులుగా చెలామణీ అవుతున్న సదరు గెలుపుగుఱ్ఱాలు తానా ఎన్నికల వ్యవస్థలో e-Voting అమలు చేస్తే మోనార్క్‌లను మోసే కలెక్షన్ కింగ్‌లు ఎందరికో అది పెద్ద ఓదార్పు. సభ్యులకు, ఓటర్లకు కూసింత ప్రశాంతతను…నింపు!

TANA 2021 Elections

తాడో-పేడో హోరులో సాగిన పోరులో తానాతో తమ బొడ్డుతాడు తెగకూడదని ఓ వర్గం, పాతుకుపోయిన పాతసింతకాయ పెసిడెంట్లకు తలుపు మూసి పేడు(చెక్క) కొట్టాలని ప్రయత్నించిన మరో వర్గం మధ్య సాగిన జోరు రసకందాయకంలో విజయం నిరంజన్‌ను వరించడం ముదావహమే. తానా రెండు ముక్కలుగా కాదు తానా చరిత్ర రెండు ముక్కలుగా చీలిన శుభ స్వర్ణ క్షణం ఇది. నిన్నటి వరకు ఒక ముక్క. రేపటి నుండి కొత్త వెలుగుచుక్క.

గత నాలుగు నెలలుగా తానా ఎన్నికల వార్తా స్రవంతిని, గడిచిన 19 ఏళ్లుగా తానా వార్తలను పాఠకులకు అందించేందుకు మేము చేసిన, చేస్తున్న కృషికి గుర్తింపుగా మా మీద, మా ఈ-పత్రిక మీద నమ్మకంతో ప్రకటనల రూపంలో ప్రోత్సాహం అందజేసిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.

—సుందరసుందరి(sundarasundari@aol.com)